ఎం.ఆర్. రాధా ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 సినిమా, నాటకాలు, రాజకీయ వేదికలపైనా తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖుడు ఎం. ఆర్. రాధా. ఎవరికీ భయపడేవారు కాదు. నిర్భయంగా మాటలు రువ్వేవారు. అటువంటి ఎం.ఆర్. రాధా గురించి కొన్ని సంగతులు.....
మదరాస్ రాజగోపాలన్ రాధాకృష్ణ నాయుడు అనే పూర్తి పేరును కుదిస్తే ఎం.ఆర్. రాధా అయి అందరి నాలుకలపై నానారు.
జర్మనీవారి యుద్ధ నౌక ఎండన్ చెన్నైలో బాంబు దాడి జరిపిన రోజున పుట్టడంతోనో నేమో ఆయన జీవితమంతా బాంబులతో ముడిపడిందనుకునేవారున్నారు....ఆయన తల్లి పేరు రాజమ్మాళ్.
తండ్రి రాజగోపాలన్. భారత సైన్యంలో ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న రాజగోపాలన్ మెసపటోమియాలో మరణించారు. అందుకుగాను ఆయన పొందిన వీరపతకాన్ని ఎం.ఆర్. రాధా అమూల్యమైనదిగా చూసుకునేవారు.
బాల్యంలోనే ఇంట్లో వారి మాట వినేవారు కాదు. స్కూల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపలేదు.
నేనొక అనాధనని చెప్పి ఆలందూర్ రంగసామి నాటకబృందంలో చేరారు. నల్ల తంగాల్ నాటకంలో ఆ స్త్రీ పాత్ర బావిలో విసిరేసే పిల్లలలో ఒకరుగా వేదికనెక్కారు. అదే ఆయన తొలి నాటకానుభవం. నాటకాలలో ఎలా నటించాలో ఆయనకు నేర్పింది జగన్నాధయ్యర్.
ఆయన నటించిన తొలి చిత్రం రాజ శేఖరణ్య (1937). ఆఖరి చిత్రం పంచామృతమ్య (1979).
సినిమా అవకాశాలు రావడంతోనే చాలా మంది నాటకాలలో నటించడం మానేస్తారు. కానీ ఈయన అటు నాటకాలలో ఇటు సినిమాలలో రెండింట్లోనూ నటిస్తూ వచ్చారు.
ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అంటూ తన తొలిరోజుల నాటకాలలో సుత్తి కొడవలి చిహ్నాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అనంతరం ద్రావిడ కళగం పార్టీ పతాకాన్ని ప్రదర్శించాకే నాటకాన్ని ఆరంభించే వారు.
ఈయన కథానాయకుడిగా రక్తకన్నీర్ నాటకం 3,021 సార్లు ప్రదర్శించారు.
తూక్కుమేడై (ఉరికంబం) నాటకాన్ని ఎనిమిది వందలసార్లు, లక్ష్మీకాంతన్ నాటకాన్ని 760 సార్లు ప్రదర్శించారు.
ఈయన దగ్గర ప్లయ్ మౌత్, ఆంబాసిడర్, ఇంపాలా అంటూ రకరకాల.కార్లుండేవి
ఓమారు ఇంపాలా కారులో గేదెకోసం గడ్డి తీసుకొస్తుంటే అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
"మన ఉపయోగానికే కదా కారు. రేకుకి రంగులు కొట్టారు కదాని తలమీద మోసుకుని తిరుగుతామా" అని అనేవారు.
ఆయన నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు చెప్పులు, రాళ్ళు, కోడిగుడ్లు వంటివాటిని ప్రత్యర్థులు విసిరినప్పుడు వాటిని సేకరించి మరుసటిరోజే ప్రదర్శించేవారు. పైగా అక్కడ ఓ అట్టముక్కలో నోన్న పేడిముఖాలు వదిలివెళ్ళిన సామాన్లు ఇవి" అని రాసేవారు.
ఎంజిఆర్ ని రామచంద్రా అని, శివాజీని గణేశా అని పిలిచేవారు. ఇతరులను రారా పోరా అనే పిలిచేవారు.
ఈయన నాటకాలను నిషేధించడంకోసమే కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ పాలనలో నిటకాన్ని నిషేధించే చట్టాన్ని అమలుచేసింది. ఆ చట్టం చర్చకొచ్చినప్పుడు ఈయన లాగూ బనియన్ వేసుకుని నాటకం ప్రదర్శించే ఆవరణకు వెళ్ళారు. ఓ నాటకాన్ని నిషేధిస్తే దానినే పేరు మార్చి మరుసటిరోజు ప్రదర్శించేవారు.
నటుడు ఎన్.ఎస్. కృష్ఢన్ ని కాల్చడం కోసం ఉలుందూర్ పేటలో ఓ తుపాకీ కొన్నారు. ఈ విషయం తెలియడంతోనే "మిత్రుడి చేతిలో చావడానికి పుణ్యం చేసుకున్నాను" అని ఎన్.ఎస్.కె. చెప్పడంతో ఎం.ఆర్. రాధా మనసు మార్చుకుని ఆయనను కౌగిలించుకున్నారు.
తిరుమల ఆలయంపై బాంబుదాడి చేయాలనుకున్న ఎం.ఆర్. రాధా మందుగుండుని ఎండబెట్టినప్పుడు అది పేలి చిరుప్రమాదం సంభవించింది.
ఎం.జి.ఆర్ ని ఆయన ఉన్న రామావరం గార్డెన్ లో కాల్చి , తాను కాల్చుకున్న ఘటనలో నమోదైన కేసులో ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష పడింది.
"మిత్రులిద్దరం తుపాకులతో ఆడుకున్నాం. 
ఏమిటో తుపాకీ గుళ్ళు కనిపెట్టారు. నేనూ చావలేదు. రామచంద్రనూ చావలేదు. వీటిలోనూ డూప్లికేట్ వి వస్తున్నాయేమిటో?" అని కామెడీగా చెప్పారు.
నాలుగున్నరేళ్ళు చెన్నై సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఈయన పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు చూపించిన ఓ ఖైదీ ఓరోజు వంట వండి పెట్టారు.
అక్కడ రాధా పెంచిన ఓ పిల్లి ఆ వంటను ముందుగా తినడంతోనే గింగుర్లు కొట్టి చనిపోయింది.
దానిని పరిశోధనకు పంపగా ఆహారంలో విషం కలిపిన విషయం బయటపడింది.
రామాయణాన్ని హేళన చేస్తూ కీమాయణం అనే నాటకం వేశారు. రాముడి పాత్రలో నటిస్తున్నప్పుడే అరెస్టయ్యారు. భక్తుల మనస్సు నొచ్చుకుంటోంది అని కేసు వేశారు.
మనసు బాధపడఘవారెవరూ తన నాటకాన్ని చూడటానికి రానక్కరలేదు అని ప్రకటన చేశారు.
మీరు దేనిలో ఎక్కువ సంతోషం పొందేవారు అని అడిగినప్పుడు నిరీక్షణలోనే అని అంటూ ప్రజలు దేన్నయితే ఆశిస్తున్నారో అదే తనకిష్టమని జవాబిచ్చారు.
ఆయనకు రాయడం చదవడం రాదు. అయితే ఎంత పెద్ద డైలాగులనైనా ఎవరైనా చదివివినిపిస్తే పొల్లు పోకుండా చెప్పేవారు.
ఆయన చెప్తుంటే రాసినవే చిన్న చిన్న పుస్తకాలుగా ఆరోజుల్లో వెలువడ్డాయి.
రక్తకన్నీర్, భాగపిరవినై, బలే పాండ్య, పాలుం పళముం, తాయ్ సొల్లయ్ తట్టాదే, పడిత్తాల్ మట్టుం పోదుమా, పెరియ ఇడత్తు ప్పెన్,.తొయిలాలి, పెట్రాల్ తాన్ పిళ్ళయా వంటి సినిమాలలో ఆయన నటన అమోఘం. అద్భుతం. 
118 సినిమాలలో నటించిన ఎం.ఆర్. రాధా 
1963లో మొత్తం 22 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించారు.
ము. కరుణానిధిని మొట్టమొదటిసారిగా కళైంజ్ఞర్ కరుణానిధి అని పిలిచింది ఎం.ఆర్. రాధానే.
నడిగవేళ్ రాధా తమకురులుకూడా నటిస్తాయని కరుణానిధి ఆయనను ప్రశంసించారు. 
ఎం.ఆర్. రాధాకు నడిగవేళ్ అని టైటిల్ ఇచ్చింది తందై పెరియార్.
ద్రావిడ ఉద్యమ పార్టీ తమిళనాడులో అధికారంలోకి రావడంతోనే ఎం.ఆర్. రాధాను కళలు, సాంస్కృతిక శాఖ మంత్రిగా నియమిస్తామని అన్నాదురై బహిరంగంగా ప్రకటించారు. తీరా 1967లో డిఎంకె అధికారంలోకొచ్చిన రోజున రాధా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
తనను చూడటానికి యువకులు, విద్యార్థులూ వస్తే వెళ్ళిపొమ్మని పంపించేసేవారు.
"వెళ్ళి చదువుకోండర్రా! మేము మా పని చేసుకుంటున్నాం. మీరు మీ పని చేసుకోండి" అని నిర్మొహమాటంగా చెప్పేసేవారు.
ఉత్సవాలు, ప్రశంసలం వంటివాటిలో ఇష్టం లేని కామరాజ్ రాధాకి మాత్రం శాలువ కప్పి సన్మానించారు. రాధా నటన ఆయనకెంతో ఇష్టం.
ఈ సందర్భంగా రాధా చెప్పిన మాటలు....
"శాలంవలో ఏముంది గొప్పతనం? శాలువను కప్పుతున్న మనిషి ఎంతో గొప్పవారు. ఉన్నతులు. అందుకే ఆయన చేసిన సన్మానానికి సరేనన్నాను" అని రాధా తనకు జరిగిన సన్మానానికి ఉచితరీతిన స్పందించారు.
ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టడానికి విజ్ఞానం ఒక్కటే చాలదు. ఎం. ఆర్. రాధా ప్రదర్శించేటటువంటి నాటకాలు కూడా అవసరం అని
విజ్ఞాన శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ చెప్పారు. 
తమిళ జాతికి ద్రోహం చేసే వారిని నిర్మూలించడానికి ఓ ఆత్మాహుతి దళం అవసరం ఎంతైనా ఉంది. అదే నా లక్ష్యం. మూడు వందల మంది ఇందుకోసం ముందుకొస్తే చాలు అని తన చివరి రోజుల్లో చెప్తుండేవారు ఎం.ఆర్. రాధా!
 ఎక్కువ సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన ఎం.ఆర్ రాధా కమెడియన్ గా కూడా రాణించారు.
చెన్నైలో 1907 ఏప్రిల్ 14న జన్మించిన ఎం.ఆర్ రాధా 1979 సెప్టెంబర్ 17న జాండీస్ తో తిరుచ్చీలో మరణించారు కామెంట్‌లు