పూలు పళ్ళ తోటల్లో తిరిగిన జ్ఞాపకాలు :వాసిరెడ్డి కాశీరత్నం;- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ


 శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నంగారు 90ఏళ్ల వయసులో గూడా చురుగ్గా ఆదరంగా అందరినీ పలకరిస్తారు.ఈమెను చూసి గృహిణులు నేటి తరం యువత నేర్చుకోవలసింది చాలా ఉంది. ఆమె గాయని రచయిత్రి అనువాదకురాలు రాజకీయ నాయకురాలు  సంఘసేవిక ముగ్గురు కూతుళ్లను తీర్చిదిద్దిన మాతృమూర్తి. 1988లోనంది ఉమెన్స్ అసోసియేషన్ ని స్థాపించి మహిళాభ్యుదయానికి ఇప్పటికీ పాటుపడుతున్నారు.మహిళా విజయం అనే మాసపత్రికను నెలకొల్పి 16ఏళ్లుగా ఎడిటర్ గా నడపటం ఆమెకే సాధ్యం ఐంది. మహిళలకు కౌన్సెలింగ్ చేసి వారిలో ఆత్మ విశ్వాసం కలిగిస్తారు.విదేశాల్లో గూడా మనతెలుగు భాష సాహిత్యం పై ప్రసంగాలు  తానా సభల్లో పాల్గొన్న ఆమె బాల్య స్మృతులు ఆమెమాటల్లోనే తెలుసుకుందాం.
--------------------------------------------------------------
"నా కన్నతల్లి భ్రమరాంబ. నన్ను పెంచినతల్లి  మానాన్న రెండోభార్య లక్ష్మీతులసి.కానీ నాన్నమ్మ జానకమ్మదే పెత్తనం.ఆమె ధాతునామసంవత్సరం కరువుని గూర్చి చెప్పేది. పెరుగులో బురద పచ్చి గడ్డి కలిపి తిన్నారుట జనం!?స్త్రీ లకు మహా ఘోష!ఎడ్లబండికి చుట్టూ కర్టెన్లు కట్టేవారు. లోపల స్త్రీలు  కూచునేవారు.మాఊరువీరులపాడు.పూల పళ్ళతోటల్తో కళకళలాడుతూ ఉండేది. చిన్నప్పుడు ఆతోటలలో చక్కర్లు కొట్టేదాన్ని.శుక్రవారంకి ముందే గాజుల మలారం సుబ్బడు ఇంటింటికీవచ్చి ఆడవారికి చేతినిండా గాజులు తొడిగివెళ్ళేవాడు.రెండో ప్రపంచ యుద్ధసమయంలో మాఊరిపై యుద్ధవిమానాలు ఎగిరేవి.హిందీ ని మొదట చంద్రయ్య గారు  ఆతరువాత ఆరెకపూడి నాగభూషణం గారు నేర్పుతూ బాగా ప్రచారం చేశారు. రాజకీయాలు  ఉద్యమాలు జాతీయవాదం ఝాన్సీ రాణిగాధలతో  అందరిలో స్వాతంత్ర్యంకోసం పోరాడాలి అనే చైతన్యం రగిలింది.నాలుగేళ్ల వయసులో నేను గాంధీజీ ని చూశాను. ఎడ్లబండి పై రైలుస్టేషన్ కెళ్ళి మరీ చూసిన స్త్రీ లు  ఒంటి పై నగలుతీసి బాపూజీకి ఇచ్చారు. మాపల్లెలో  5వక్లాస్ దాకానేఆడపిల్లలకి చదువు.అందుకే సంగీతం ఇంటిపనిలో ఆరితేరేవారం.జైల్లో రాజకీయ ఖైదీలకు చిలుంపట్టిన పాత్రలలో వండిపెట్టడం తో చాలామంది చనిపోయారు. నాకు బాధ అనిపించేది.కుంటాట రాళ్ళాట చదరంగం బాగా ఆడేదాన్ని.నా15వ ఏట స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న నన్ను కూడా జైల్లో పెట్టారు. వారంరోజులు  హాయిగా గొంతెత్తి దేశభక్తి గీతాలు పాడుతుంటే పోలీసులు వచ్చి వినేవారు.ఆరోజుల్లో  స్త్రీ లు స్వయంగా జాకెట్ ఎలాకుట్టుకునేవారోతెలుసా?కత్తిపీటతో బట్టను కట్ చేసి సూది దారంతో కుట్టుకునేవారు.స్నానం చేసేటప్పుడు గాజులు చప్పుడు కాకుండా చేతికి బట్ట చుట్టే వారు. తలకు నెయ్యి రాసుకునేవారు.కొత్త బట్టలుకొంటే నిజాం పాలనలో ఉన్న ఎర్రుపాలెం రైల్వే సిబ్బంది  లగేజీ చెక్ చేసి శిస్తు కట్టించుకునేవారు.మాఊళ్లో కాంగ్రెస్ మహిళా మండలి  కమ్యూనిస్టు మహిళా మండలి ఉంటే రెండు చోట్లకి వెళ్లి పేపర్లు  పత్రికలు చదివి వినిపించి పాటలు నేర్పేదాన్ని.నా16వ ఏట మేనమామ నారాయణ రావు గారి తో మేళతాళాలు లేకుండా గ్రామ పెద్దలముందు  కుర్చీలో కూచోపెట్టి దండలు మార్పించారు. మద్రాసు లో ఉన్న నాభర్త దగ్గరకు వెళ్లాను. హార్మనీతో హిందీ తెలుగు పాటలుబాగా పాడేదాన్ని.శ్రీ శ్రీ పాటలు ఇష్టం. నేను  మహానటి సావిత్రి కలిసి రేడియో లో పాడేవారం."నిజంగా  ఆమె చెప్పి న విషయాలు ఆశ్చర్యంగా అద్భుతంగా లేవూ!?
కామెంట్‌లు