నిజాయితీ విలువ (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

   శ్రీహరి 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచీ చదువులో వెనుకబడి ఉండేవాడు. తల్లిదండ్రులు, గురువులు సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా శ్రీహరిలో మార్పు రాలేదు. ఇప్పుడు శ్రీహరి 9వ తరగతిలోకి వచ్చాడు. ఒకరోజు తండ్రి శ్రీహరిని పిలిచి, "నువ్వు వచ్చే సంవత్సరం 10వ తరగతి చదువబోతావు. ఇప్పటి నుంచి కష్టపడి చదవకపోతే 10వ తరగతి ఫెయిల్ కావడం ఖాయం. నీ తోటి వాళ్ళంతా నిన్ను హేళన చేస్తుంటే తట్టుకోగలవా? బయటికి వెళ్ళడానికి ముఖం చెల్లదు. నీ తల్లిదండ్రులం అని చెప్పుకోవడానికి మాకూ అవమానం. మరి 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థి తల్లిదండ్రులం అనిపించుకునే అపకీర్తి మాకు ఎందుకు? రాబోయే అర్థ వార్షిక పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో నూటికి 80 శాతానికి పైగా మార్కులు రావాలి. లేదంటే తక్షణమే నిన్ను చదువు మానిపించి ఏదైనా పనిలో పెడతాం." అన్నాడు. అక్కడే శ్రీహరి క్లాస్ మేట్ రాజేశ్ ఉన్నాడు. 
       శ్రీహరి ఆ తరగతిలో అందరికంటే బాగా చదివే సతీశ్ దగ్గరకు చేరాడు. తన సమస్యను చెప్పుకొని సలహా అడిగాడు. " నువ్వు ఎవరైనా ఒక కథ చెబితే దాన్ని పూర్తిగా ఇంకొకరికి చెబుతావు కదా! నువ్వు ఏదైనా సినిమా చూస్తే దాని స్టోరీ పూర్తిగా చెబుతావు కదా! దానికి కారణం ఏమిటి? వాటిపై ఇష్టంతో చాలా ఆసక్తిగా శ్రద్ధగా వాటిని వింటాను, చూస్తావు. అలాగే ఆయా సబ్జెక్టులపై ఇష్టాన్ని పెంచుకొని శ్రద్ధగా విను. ఏరోజు విన్న పాఠాలను ఆరోజు ఇంటివద్ద చదువు. నీకు తిరుగు లేదు." అన్నాడు సతీశ్. శ్రీహరి సతీశ్ చెప్పినట్లే చేసి కొద్ది రోజుల్లోనే తెలివైన విద్యార్థి అయ్యాడు. అర్ద వార్షిక పరీక్షలు మొదలైనాయి. 
       "ఒరేయ్ శ్రీహరీ! నీకు అన్ని విషయాల్లో ఎనభై శాతానికి పైగా మార్కులు వస్తాయని నమ్మకం ఉందా?" అన్నాడు రాజేశ్. "లేదురా! యాభై శాతం వరకు రావచ్చు." అన్నాడు శ్రీహరి. "అయితే ఓ పని చేయరా. నా వెనుకే నీ నంబర్ కదా! నా జవాబు పత్రాలలో చూస్తూ జవాబులు రాయి. ఇంకా నేను ఉపాధ్యాయులకు తెలియకుండా కాపీ కొడుతుంటాను. నన్ను చూసి నేర్చుకో. లేకపోతే మీ నాన్న నిన్ను చదువు మానిపిస్తాడు." అన్నాడు రాజేశ్. "నేను చిన్నప్పటి నుంచి పాఠాలను శ్రద్ధగా వినకపోవచ్చు. కానీ చూసి రాసి తెచ్చుకునే 70 మార్కుల కన్నా కష్టపడి చదివి తెచ్చుకున్న 30 మార్కులు మిన్న అని మన తెలుగు మాస్టారు చెప్పిన మాటలు నా మనసులో నాటుకొని పోయాయి. రాజా లాగ కష్టపడి చదివి మార్కులు తెచ్చుకోవాలి కానీ, సోమరిపోతులా దొంగలా అడ్డదారులు తొక్కి మార్కులు తెచ్చుకోవద్దు. ఇక మా నాన్న సంగతి అంటావా. ఇంతకు ముందు నాకు పాస్ మార్కులు అయినా రాలేదు. ఇప్పుడు యాభై శాతానికి పైగా మార్కులు వస్తే మా నాన్న ఖచ్చితంగా నన్ను మెచ్చుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది." వార్షిక పరీక్షల వరకు మరింత కష్టపడి చదివి ఎనభై శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంటా." అన్నాడు శ్రీహరి. "నీ మాటలు నాకు కనువిప్పు కలిగించాయిరా! ఇప్పటి నుంచి నేను కూడా రాజా లాగ కష్టపడి చదివిన మార్కులతోనే తృప్తి పడుతా. మరింత కష్టపడి చదివుతా." అన్నాడు రాజేశ్. సంతోషించాడు శ్రీహరి.
కామెంట్‌లు