వాసు పదవ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి అతడు తరగతిలో మొదటి ర్యాంకే. కానీ అతనికి కోపం చాలా ఎక్కువ. చిన్న పొరపాటుకే తోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టేవాడు. అదే తరగతిలో రాము రెండవ ర్యాంకు వచ్చేవాడు. చాలా మృదు స్వభావం కలవాడు. స్నేహశీలి. అందుకే అందరూ రాము చుట్టూ చేరి తమకు తెలియని విషయాలు చెప్పించుకునేవారు. సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకునేవారు. వాసులో ఉన్న ఆ కోపం అనే లోపాన్ని సవరించుకోమని ఎవరైనా స్నేహ పూర్వకంగా సలహా ఇస్తే వారిపై అగ్గి మీద గుగ్గిలం అయి, వారికి దూరంగా ఉండేవాడు. ఉపాధ్యాయులు ఎవరైనా పిల్లలు తమకు తెలియని విషయాలను వాసు చేత చెప్పించుకోమంటే వారంతా రాము చుట్టూ చేరేవారు. వాసు రాముపై ఈర్ష్యను పెంచుకున్నాడు.
తనకు అందరూ దూరం కావడం వాసును బాధపెట్టింది. కానీ తనలోని లోపాన్ని తెలుసుకోలేక పోతున్నాడు. ఆ పాఠశాలకు కొత్తగా సదానందం అనే తెలుగు ఉపాధ్యాయులు వచ్చారు. విద్యార్థులకు మంచి నీతీ కథలను చెబుతూ, జోకులు వేస్తూ, అందరితో ప్రేమగా ఉండేవాడు. సదానందం అందరికీ ప్రియమైన గురువు అయ్యారు. వాసుకు ఆ తెలుగు ఉపాధ్యాయులు అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆ ఉపాధ్యాయుని దగ్గరకు చేరి, తన బాధను చెప్పుకున్నాడు వాసు. మిగతా విద్యార్థులను విచారించి, వాసులోని లోపాన్ని తెలుసుకున్నాడు.
ఒకరోజు వాసును పిలిచి, "నీకు ఏ ఉపాధ్యాయులు అంటే చాలా ఇష్టం?" అని అడిగాడు. మీరేనని సమాధానం చెప్పాడు వాసు. ఎందుకని అడిగారు సదానందం గారు. "మీరు ఎప్పుడూ సరదాగా ఉంటారు. నవ్విస్తూ ఉంటారు. మీకు కోపమే ఎప్పుడూ రాదు." అన్నాడు వాసు. "మరి నేను చెప్పినట్లు వినాలి. అప్పుడు అందరూ నీ చుట్టూ చేరుతారు." అన్నాడు మాస్టారు. ఏమిటని అడిగాడు వాసు. "సహన వ్రతం చెయ్యి. అంటే ఒక నెల రోజుల పాటు ఎవ్వరు ఏమన్నా కోపం తెచ్చుకోవద్దు. నీలోని లోపాలను ఎత్తి చూపితే వాటిని నువ్వు నవ్వుతూ స్వీకరించి, సవరించుకోవాలి. అకారణంగా నీతో ఎవరైనా గొడవకు దిగితే వారిని శాంతపరచాలి. లేదా వారికి దూరంగా పోవాలి. నన్ను ఆదర్శంగా తీసుకుని అందరితో నువ్వు సరదాగా ఉండాలి. చదువు రాని వారితో ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తూ సహనంతో వారికి చదువు నేర్పాలి." అన్నారు సదానందం గారు. గురువు గారు చెప్పినట్టు నెల రోజులు నడుచుకున్నాడు వాసు. అందరూ ఆశ్చర్యపోయారు. వాసుకు మంచి స్నేహితులు అయినారు. వాసు తన తప్పు తెలుసుకుని కోపాన్ని శాశ్వతంగా వదిలేశాడు. రాము, వాసులు ప్రాణ స్నేహితులు అయినారు.
సహనం విలువ (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి