ఆవిష్కరణల మాంత్రికుడుథామస్ ఎడిసన్ !!;-- యామిజాల జగదీశ్
 "ఒక పోస్టు కార్డుమీద ఆయన బొమ్మను గీసి పోస్టుబాక్సులో వేస్తే అది మెన్లో పార్క్ లో ఉండే ఆయనకు చేరిపోతుంది" అని ఆయన గురించి అనుకునే వారట సరదాగా. అంటే ఆయన ఎంత సుప్రసిద్ధులో ఆలోచించండి.  
ఇంతకూ ఆ ప్రముఖ వ్యక్తి మరెవరో కాదు, శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్!
ఎడిసన్ 1847 ఫిబ్రవరి 11వ తేదీన శామ్యూల్, నాన్సీ దంపతులకు ఓహియో రాష్ట్రంలోని మిలాన్లో జన్మించారు. వీరికి ఎడిసన్ ఏడవ, ఆఖరి సంతానం.
ఆయనను అయిదో ఏట స్కూల్లో చేర్పించగా కొంత కాలానికే వొట్టి మొద్దు, ఏమీ రాదు - తెలీదు అంటూ  ఇంటికి పంపించేసారు.
అయితే ఆయన తల్లి ఓ టీచర్ కావడంతో ఏమాత్రం కృంగిపోకుండా ఇంట్లోనే తన ముద్దుల కొడుకుకి పాఠాలు చెప్పారు. తల్లి దగ్గర ఎంతో శ్రద్ధాసక్తులతో చదువుకున్నారు ఎడిసన్.
పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను కూడా చదివిన ఎడిసన్ లోని కుతూహలాన్ని గ్రహించిన తండ్రి స్థానికంగా ఉండే ఓ లైబ్రరీలో ఆయనను సభ్యుడిగా చేర్పించారు. దీంతో ఆయన పుస్తకపఠనం మరింత పెరిగింది. ముఖ్యంగా సైన్స్ పుస్తకాలను ఎంతో ఆసక్తితో చదవసాగారు.  చదివిన విషయాలను అలాగే విడిచిపెట్టకుండా వాటిని పరిశోధించడం మొదలుపెట్టారు. చేతికి అందిన వస్తువులతో తన ఇంటి ఆవరణలోనే ప్రయోగాలు చేస్తూ వచ్చారు. అయితే వాటికి డబ్బులు కావాలిగా? ఎలా అని ఆలోచించారు.  తల్లిదండ్రులను శ్రమ పెట్టకూడదనుకున్న ఎడిసన్ రైళ్ళల్లో పత్రికలు, స్వీట్స్, కాయగూరలు అమ్మగా వచ్చిన డబ్బులను తన ప్రయోగాలకు వినియోగించారు.
రైలులో పత్రికలు అమ్ముతూ వచ్చిన ఎడిసన్ కి ఓ ఆలోచన వచ్చింది.  తానే ఓ పత్రిక ఆరంభిస్తే ఎలా ఉంటుందనుకోవడంతో "వీక్లీ హెరాల్డ్" అనే పత్రికను ప్రారంభించారు. ఈ పత్రికతో ఎడిసన్ అనతి కాలంలో ఎదిగారు. కాలక్రమేణా ఎడిసన్ పద్నాలుగు సంస్థలకు యజమాని అయ్యారు.
రైల్వే స్టేషన్ మాస్టరు ద్వారా సమాచారాన్ని చేరవేసే విధానం గురించి తెలుసుకున్న ఎడిసన్ ఇందులో ఆధునికతకోసం కృషి చేసారు. 
న్యూజెర్సీలో ఎడిసన్ ఏర్పాటు చేసిన మెన్లో పార్క్ పరిశోధనా కేంద్రంలో ప్రయోగాలు జోరుగా సాగాయి. పదకొండు రోజులకొక చిన్న పరికరం, ఆరు నెలలకొకసారి ఓ పెద్ద పరికరం కనుగొనాలనే లక్ష్యంతో ఎడిసన్ అనేక ప్రయోగాలు చేస్తూ ఎన్నెన్నో కనిపెట్టారు. ఈనాడు మనం అనుభవిస్తున్న ఆనందాలెన్నింటికో మూలాలన్నీ ఆయన కృషి ఫలితమే.
1889లో పారిస్ లో భారీ ఎత్తున ఓ ప్రదర్శన నిర్వహించారు.అందులో ప్రదర్శింపబడిన పరికరాలలో తొంబై శాతానికిపైగా ఎడిసన్ కు చెందినవే.
టెలిగ్రాఫ్, విద్యుత్ బల్బు, థర్మో అయానిక్ ఎమిషన్, టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమేరా, ఫోనోగ్రాఫ్, సిమెంట్ కాంక్రీట్ వంటివెన్నో కనుగొన్న ఎడిసన్ ని "మెన్లో పార్క్ మాంత్రికుడు" అని అభివర్ణించారు. ఈ క్రమంలో ఎడిసన్ చవిచూసిన ఓటములనేకం. అంతమాత్రాన డీలా పడిపోకుండా తన ప్రయోగాలను కొనసాగించి విజయాలు సాధించడం విశేషం. 
ఎడిసన్ మనకు చెప్పక చెప్పిన విజయ రహస్య సూత్రం ....
చెయ్యాలనే తపన ఒక శాతం, తొంబై తొమ్మిది శాతం కృషి కలిస్తే వంద శాతం విజయం తథ్యమన్న ఎడిసన్ మాట అక్షరసత్యం.
1871 డిసెంబరు 25న ఎడిసన్ 16 ఏళ్ళ మేరీ స్టిల్ వెల్ ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు.
1931 అక్టోబర్ 18వ తేదీన వెస్ట్ ఆరెంజ్ లో మరణించే వరకూ కొత్త కొత్త ఆవిష్కరణల కోసం అనుక్షణం ఆరాట పడుతూ వచ్చిన సాటి లేని మేటి శాస్త్రవేత్త ఎడిసన్!!
కామెంట్‌లు