జాతిపితపై నూటయాభై నెలలు:-- యామిజాల జగదీశ్

ఆస్తికుడు నాస్తికుడైనట్లు
నాస్తికుడు ఆస్తికుడైనట్లు
అననుగానీ
గాంధీ మహాత్ముడిపై 
ఎటువంటి అభిప్రాయం
లేని రోజులు పక్కన పెడితే 
చిన్నప్పుడు 
అక్టోబర్ రెండో తేదీ అంటే
ఇష్టముండేది
కారణం
ఆరోజు ఆయన జయంతితో
మా నాన్నగారు
యామిజాల పద్మనాభస్వామిగారు
గాంధీజీ జీవిత చరిత్రను
సంస్కృతంలో రాసిన శ్లోకాలను
ప్రముఖ గాయకుడు పి.బి. శ్రీనివాస్ గారు
ఆలపించినప్పుడూ
ప్రముఖ పాత్రికేయులు, మా మావగారైన
జి. కృష్ణగారు గాంధీజీపై పుస్తకం రాసినా
సీరియస్సుగా అటుకేసి చూడని నేను
గాంధీ మహాత్ముడిపై 
పుస్తకాలు తిరగేయడానికి
ముఖ్యకారకులు
బుజ్జాయి పిల్లల మాసపత్రిక
అధిపతి అయిన జి. అప్పారావుగారే!
బుజ్జాయి మాసపత్రికలో మొదటి పేజీ
గాంధీజీకి సంబంధించిన సమాచారంతోనే
వెలువడేది
ఈ పేజీని మధురాదర్ గారే రాస్తూ వచ్చారు
ఆయన అస్తమయం తర్వాత
ఆ పేజీన రాసే అవకాశం
కల్పించినది అప్పారావుగారే!
అప్పటి నుంచి 
క్రమం తప్పక
నూటై యాభై సంచికలపైనే
గాంధీజీ జీవిత సంఘటనలను
రాసే భాగ్యం కలిగింది!
ఇందుకోసం
గాంధీజీ జీవిత చరిత్రను
తమిళంలో చదవడం 
మొదలుపెట్టాను
ఒకటి రెండు తమిళ పుస్తకాలు 
కొన్నాను! చదివాను!
మహాత్ముడైన గాంధీజీని
విమర్శించిన నోళ్ళున్నాయి
గర్వంగా చెప్పుకున్నోళ్ళూ ఉన్నారు
ఏదేమైనా
దేశ స్వాతంత్ర్యం కోసం
ఆయన ఇచ్చిన పిలుపుకి
స్పందించి 
ఉద్యమానికి దిగిన వారెందరో
ఎందరెందరో
ఆయన జీవితం 
ఓ ఆదర్శం
లక్ష్యసాధన కోసం
అడ్డంకులను
అధిగమించిన 
ఆయన అహింసావాదం
అసలైన సత్యాగ్రహం
అసలైన నిరాహార దీక్ష
ఎప్పటికీ చిరస్మరణీయం
 
కామెంట్‌లు