అసలైన మమత! అచ్యుతుని రాజ్యశ్రీ

 పిల్లలు అంతా ఆపార్క్ లో చిలోపొలో అంటూ కేరింతలు కొడ్తూ ఆడుతున్నారు. అక్కడ పల్లీలు అమ్మే కుర్రాడు జోరుగా వ్యాపారం సాగిస్తున్నాడు.అక్కడ ఉన్న సిమెంటు బెంచీపై పెద్దలు కబుర్లు చెప్పుకుంటారు. ఆకాలనీకి చెందిన నారాయణని అంతా "తాతా"అని పిలుస్తారు. "అరే పిల్లలూ!మీఅందరి కోసం చాక్లెట్లు తెచ్చాను."వారానికి రెండు మూడు రోజులు వస్తాడు.పిల్లలకు అలా పంచుతాడు.బోలెడంత డబ్బున్న మారాజు.భార్య పోయింది. ఉన్న ఒక్క కొడుకు విదేశంలో ఉన్నాడు.తాత  తను వచ్చినప్పుడు పల్లి ఉండలు  బిస్కెట్లు  చిన్న చిన్న  బహుమతులు వారి పుట్టిన రోజు కి ఇస్తాడు.
 "తాతా!మామంచి తాతయ్య!"అని పిల్లలు అంతా చప్పట్లు చరుస్తుంటే గుబురుమీసాల చాటున నవ్వు కుంటాడు. ఆపిల్లలంతా  డబ్బు దస్కం ఉన్న అపార్ట్మెంట్ పిల్లలు కావటంతో  తాతకి ప్ర త్యేక  అభిమానం.  పార్క్ బైట బస్తీ పిల్లలు  కూలీనాలీ చేసుకునేవారి సంతానం  విప్పారిన కళ్ళతో తాత  రకరకాల  తినుబండారాలు పంచటం చూసి గుటకలేస్తారు.ఒక సారి  తాత వెంటబడి "అయ్యా!మాకో బిస్కెట్టు ఇవ్వవూ?" అని అడిగితే  విసురుగా అన్నాడు"ఒరేయ్!ఎక్కడన్నా  పనిచేసి నాల్గుడబ్బులు సంపాదించండి. సర్కారు బడికి వెళ్లండి రా!" 
తాత ఒక వారంరోజులు  తనబంధువుల ఊరికి పెళ్ళి కెళ్ళాడు.ఆరోజు  తాత  ఊరినించి వచ్చి పార్క్ కి వెళ్లాడు.దూరం గా ఓ యువకుడు పిల్లలకు యోగా వ్యాయామం చేయించడం చూశాడు.ఎంతో క్రమశిక్షణ తో తనని గుర్తించకుండా  పిల్లలు  అందులో మునగటం తాత కి బాధ కలిగించింది. కాసేపటికి తనే వారి దగ్గరకు వెళ్ళి నించున్నాడు."ఏమర్రా పిల్లలూ!బాగున్నారా?"తాత పిలుపుతో  పిల్లలు అంతా బిలబిలలాడుతూ చుట్టూ చేరారు "తాతా!ఎక్కడికి వెళ్లావు?"వారందరికీ  తను తెచ్చిన లడ్డూ చక్కిలాలు పంచి "ఏంచేస్తున్నారు మీరంతా?"అని  ప్రశ్నించాడు. అవి తింటూ అంతా తలా ఒక మాట చెప్పసాగారు."తాతా!ఆ అంకుల్  కొత్తగా వచ్చాడు. మాకు రోజు కధలు వ్యాయామం  ఆటలు నేర్పుతూ మాలో ఉన్న భయం బెరుకు పోగొట్టాడు.మమ్మల్ని రెండు రోజుల కోసారి పచ్చదనం పరిశుభ్రత పేరు తో  పార్క్  ఇళ్ల చుట్టుపక్కల ఆ మురికివాడలలో చెట్లు నాటడం ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని చెప్పటం చేశాము.
ఇంకా  మాకు పనికిరాని వస్తువులు దుస్తులు  మంచివి తెచ్చి  పిల్లలకు పంచుతున్నాము.మాకు అర్ధం కాని పాఠాలు  ప్రయోగాలు చేసి చూపుతాడు అంకుల్. మాకు తెలిసిన పాటలు పద్యాలు  ఈపిల్లలకి నేర్పటం వల్ల  మాలో పోటీతత్వం పెరిగింది.రేడియో పిల్లల ప్రోగ్రాంలో పాల్గొన్నాము."అదంతా వింటున్న తాత కి కాస్త మనసులో ముల్లు గుచ్చుకుంటున్న అనుభూతి కలిగింది. "ఇన్నాళు  నేను పెట్టినవి బాగా మెక్కి ఇవ్వాళ  ఎక్కడినించో వచ్చిన  కౌన్ కిస్కాకి సలాం కొడుతున్నారు  అని మధనపడ్డాడు.పిల్లలు తాత ఇచ్చినవన్నీ తినేసి"బై తాతా!అంకుల్  ఇవ్వాళ మాకు  సామెతలకధ చెప్తానన్నాడు"అని తుర్రు మని పారిపోయారు"అంకుల్ "అని అరుస్తూ. ఆరోజు తాత త్వరగా పార్క్ కి వెళ్లాడు. అంకుల్ అని పిల్లలు పిలిచే రామ్ దగ్గరకు వెళ్ళి "బాబూ!నీవు  ఏంచేస్తుంటావు?వారానికి రెండు సార్లు  వస్తావు?" అడిగాడు. "సర్!నేను అనాధను.బాల్య మంతా అనాధాశ్రమంలో గడిపాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా  పదేళ్ళు విదేశాల్లో ఉండి  నేను పెరిగిన ఈఊరికి ఏదన్నా చేయాలి అని వచ్చాను.ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను.కొత్తగా డెవలప్ అవుతున్న ఈకాలనీలో అద్దెకు దిగాను.మనం పెట్టే బిస్కెట్లు  చాక్లెట్లు  తాత్కాలిక ఆనందం ఇస్తాయి.కానీ
 పిల్లలగుణగణాలు సత్ప్రవర్తన పై దృష్టి పెడితే వారు మంచి పౌరులుగా తయారు అవుతారు.ఆటపాటలలో ప్రోత్సహిస్తూ వారిలో సృజనాత్మకతను వెలికిదీయాలి .అప్పుడే ఆల్రౌండర్లగా పిల్లలు తయారు అవుతారు. "అతని మాటలకు తాత  నిశ్చేష్ఠుడై అలా నిలబడిపోయాడు.
కామెంట్‌లు
Unknown చెప్పారు…
ఈ కథానికలో చివరి వాక్యాలు ఆణిముత్యాలు