తాబేలు మళ్ళీ గెలిచింది (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

 వాసు తెలివైన విద్యార్థి. అతనికి ఆ తరగతిలో పోటీ వచ్చేవారు ఎవరూ లేరు. కానీ ఇటీవల వాసు చదువులో చాలా మార్పు వచ్చింది. రాను రాను మార్కులు బాగా తగ్గిపోతున్నాయి. ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నాడు‌. కారణం అడిగితే స్నేహితుడు రాము ఇంటికి వెళ్ళి కంబైన్డ్ స్టడీ చేస్తున్నా అంటున్నాడు. తల్లిదండ్రులకు ఇదొక బాధ అయింది.
       ఒకరోజు వాసు వాళ్ళ తాతయ్య రామయ్య ఏదో పని మీద బజారుకు వెళ్ళాడు. అక్కడ ఒకచోట వాసు సోము, పాండు అనే స్నేహితులతో కలిసి సెల్ ఫోనుతో కాలక్షేపం చేస్తున్నాడు. రామయ్య చాలాసేపు వాసూకు తెలియకుండా అక్కడే నిలబడ్డాడు. వాసు ఎంతకీ సెల్ ఫోన్ వదిలి పెట్టడం లేదు.
       ఇంతలో దసరా సెలవులు వచ్చాయి. వాసు వాళ్ళ చుట్టాలు అక్కడికి వచ్చాడు. రామయ్య పిల్లలను అందరినీ కూర్చోబెట్టుకుని చక్కని కథలు చెబుతా అన్నాడు. వాసు తనకు నచ్చవని అన్నాడు. కథలు చెప్పాల్సిందే అని పట్టు పట్టింది వాణి. రామయ్య కుందేలు తాబేలు పరుగు పందెం కథ మొదలు పెట్టాడు. "ఇది చాలా పాత కథ. బోర్ కొడుతుంది. అయినా కుందేలు మీద తాబేలు గెలవడం ఏమిటి? ఇదీ కథేనా?" అన్నాడు వాసు. వాసు పరుగు పందెంలో స్కూల్ ఛాంపియన్. మెరుపు వేగంతో పరుగెత్తగలడు. 
       అప్పుడు తాతయ్య మరో కథ మొదలు పెట్టాడు. అనగనగా వాసు అనే అబ్బాయి ఉండేవాడు. అతడు పరగులో పెద్ద ఛాంపియన్. అతని చిన్న పిన్ని చిన్న కూతురు చిట్టి‌. చాలా చిన్నది. బుడి బుడి అడుగులతో చాలా నిధానంగా ముద్దుగా నడుస్తుంది. ఒకరోజు వాసు చిట్టిని హేళన చేస్తూ నాతో పరుగు పందేనికి వస్తావా? అన్నాడు. చిట్టి ఓ వస్తా! నేను నిన్ను చిత్తుగా ఓడిస్తా. అన్నది. వాసు పగలబడి నవ్వాడు. నిజంగా పరుగు పందెం పెట్టుకుందాం అన్నది చిట్టి. పరుగు పందెం మొదలైంది. వాసు అతి వేగంగా పరుగెత్తుతున్నాడు. చిట్టి బుడి బుడి అడుగులతో చాలా నిధానంగా వెళ్తుంది. దారిలో వాసూకు సోము, పాండు అనే స్నేహితులు ఎదురైనారు. వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ చూడగానే పరుగు పందెం మాట మరచిపోయాడు. గంటల తరబడి సెల్ ఫోన్ ఆటలతో కాలక్షేపం చేశాడు. ఈ లోపు చిట్టి గమ్యస్థానాన్ని చేరింది. వాసు పరుగు పందెం మాట గుర్తుకు వచ్చి, గమ్య స్థానానికి చూచి చేరుకున్నాడు. చిట్టితో సహా అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వారు. అని ముగించాడు తాతయ్య. వాసూకు అర్థం అయింది. క్షమించమని తాతయ్యను వేడుకున్నాడు. "చూడు వాసు! నువ్వు ఇలానే కాలక్షేపం చేస్తూ ఉంటే చదువులో ఎంతోమంది నిన్ను దాటేసి వెళ్ళిపోతారు. నువ్వు ఇలానే నవ్వులపాలు అవుతావు." అన్నాడు రామయ్య. అప్పటి నుంచి వాసు పట్టుదలతో చదవడం మొదలు పెట్టాడు.

కామెంట్‌లు