వాయిస్ మెసేజ్ ద్వారా తన జీవితాన్ని అందమైన భాషలో చెప్పిన కవితలలో తన భావాల పరిమళాలు వెదజల్లిన శ్రీగంగారామ్ గారు ఆదర్శంప్రాయులు.ఆయన ఒక కథ చెప్పుతున్న అనుభూతి పొందాను.పది వాయిస్ మెసేజ్ లను విని సాధ్యమైనంతగా వివరించే ప్రయత్నం చేస్తాను.ఆయన ఎ.పి.ఫెడరేషన్ ఫర్ బ్లైండ్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సోషల్ యాక్టివిస్ట్ గా ఎప్పుడూ బిజీ!కులమత ప్రాంతాల తేడాలేని చూపని కంటి చూపు లేని ఆయన అందరికీ మార్గదర్శి.పాజిటివ్ థింకింగ్ అవసరం.లేని రాని వాటికోసం ఏడవటంతప్పు. ఉన్నంతలో బతుకుతూ మనకన్నా నిస్సహాయులకి చేయూత నివ్వాలి అన్న ఆయనమాట హర్షణీయం!ఆయన ఒక స్ఫూర్తి దాత!రెండేళ్ళు ఆస్ట్రేలియా లో ఉండి రెండు నెలలక్రితం మనదేశం కి తిరిగివచ్చారు64ఏళ్ల గంగా రాం గారు. ఆయనజీవితవిశేషాలు క్లుప్తంగా ఇవి.
ప్రస్తుతం ఆయన ఫెడ్ ఫ్రెండ్లీ ఎన్వైర్మెంట్ ఫర్ ది డిస్ఏబుల్డ్ చైర్మన్ గా ఉన్నారు. తెలుగు లో ఎం.ఎ బి.ఇడి చేశారు. పఠాభికృతులు పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ చేశారు. ఆరుద్ర గారి సలహా పై మైసూర్ లో పఠాభిగారి రచనలు సేకరించటం గొప్ప అనుభూతి అంటారు గంగా రాం గారు. డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ బ్రెయిల్; డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్; యు.ఎన్.ఓ.సర్టిఫికెట్ కోర్స్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ కోర్సు హిందీ ప్రశిక్షణ్ చేశారు. కొన్ని వ్యాసాలు పేపర్లలో ప్రచురింపబడినాయి.కవితలు విద్యార్ధిగా ఉన్నప్పుడే రాశారు.కానీ చాలా వరకు పోగొట్టుకున్నారు.వాయిస్ రికార్డు గా కవితలు ఫోన్ లో ఉన్నాయి. అవి ప్రచురించాలని ఉంది. తనజీవితచరిత్ర రాస్తున్నారు.
ఆయన ఫోన్ 9989900078.
శ్రీమద్దెల గంగారాంగారి బాల్య స్మృతులు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం."నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. 2017లో తెలంగాణా ప్రభుత్వ బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ వచ్చింది.2001నించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి యూత్అవార్డ్ దళితరత్న అవార్డు బెస్ట్ ఆర్గనైజర్;ఔట్ స్టాండింగ్ సోషల్ సర్వీస్ అవార్డులు పొందాను.
: "నేను బోధన్ లో పుట్టాను.నాకు ఒక చెల్లి తమ్ముడు. నాన్న ఒక చోట కుదురుగా పనిచేసే వాడు కాదు.వాటర్ వర్క్స్ లో పనిచేసే వాడు.ఆపై షుగర్ ఫ్యాక్టరీ లో చేరాడు. నేను చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండే వాడిని. పిల్లలు లేని ఫాక్టరీ మానేజర్ నన్ను పెంచుకుంటానంటే మా వాళ్లు ఇవ్వలేదు. నామూడోఏట మశూచి వల్ల కళ్ళు పోయినాయి.మూఢనమ్మకాల వల్ల పసర్లు పిండి చూపు తెప్పించాలని వారు చేసిన ప్ర యత్నాలు బూడిద లో పోసిన పన్నీరు ఐంది.
కొన్నాళ్ళు సిద్ధిపేట లోఉన్నాం.కటికపేదరికం.తిండి లేని రోజులు ఎన్నో!అమ్మ నేను మాంసం చేపలు తినం.ఒట్టి చేపలుతిని బతికింది మాకుటుంబం. మానాన్నకి సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉద్యోగం దొరికింది. డబ్బు లేని స్థితిలో నడిచి పోయిన రోజులు అవి.దారిలో జోరుగా వర్షం!చెట్టు కింద నిలబడింది మాకుటుంబం. దైవం మానుష రూపేణా అన్నది నిజం.ఆపల్లెకి చెందిన ఒక రెడ్డిగారు చలికి నెగడు వేయించారు.వేడిగా అన్నం పప్పు ఆవకాయతో మాకు భోజనం పెట్టారు. నామూడోఏట జరిగింది ఆఘటన!కానీ నాకు ఇంకా జ్ఞాపకం!కాగజ్ నగర్ తోటలో ఉన్న ఆజీవితం స్వర్ణయుగం. మాఅమ్మ నాకు స్నానంచేయించి తెల్ల చొక్కా వేసి బొట్టు పెట్టి ఒక ఎత్తయిన బల్లపై కూచోపెట్టేది.ముద్దు ముద్దుగా తెల్లగా అందంగా ఉండే నన్ను అంతా ఆడించేవారు.ఆరోజు మా అమ్మ బాధగా ఏడుస్తోంది నాకు కంటిచూపు లేదని.ఒక సాధువు నాచేయి చూసి "ఈ బిడ్డ మంచి పేరు సంపాదించుతాడు.బి.ఎ.గొప్ప చదువు చదువు తాడు "అంటే ఎవరూ నమ్మలేదు. అంతా కూలీనాలీ పనులకు వెళ్లితే నేను అలా ఎత్తు బల్ల పై కదలక
కూచునే వాడిని. నాకు ఒక పెద్ద నల్లకుక్క కోడి కాపలాగా ఉండేవి. మా ఇల్లు చెక్క గోడలు.ఎక్కడ పడితే అక్కడ పాములు ఆతోటలో!ఎక్కడినించో ఒక పెద్ద పాము బుసలు కొడుతూ నాచుట్టూ తిరుగుతుంటే నాకు తెలుస్తోంది. కానీ మూడేళ్ళ వాడిని. బల్ల దిగవద్దు అని అంతా హెచ్చరించి కూలీ పనికి వెళ్ళేవారు.ఎవరో అమ్మాయి పాము ని చూసి పెద్దగా అరవటం జనం కర్రలతో రావటం పాము మాయమవటం మరువలేని స్మృతి. ఒకప్పుడు రజాకార్ల టైం లో నాన్న హైదరాబాద్ పారిపోయినాడు.కుదురు లేని ఆయన కాగజ్ నగర్ నించి హైదరాబాదు తీసుకుని వచ్చాడు మాకుటుంబంని.మాఅమ్మ అక్క కూతురు మాకుటుంబం ని పోషించినది.ఆశ్రయం ఇచ్చింది.మానాన్న నన్ను "ఒరే దేవుడి గుళ్ళ దగ్గర కూచోపెడతాను.సాయంత్రంకి బోలెడంత డబ్బు వస్తుంది "అనేవాడు.ఆమాటలు నాకు కోపం జుగుప్స కలిగించేవి.నాన్న అంటే అసహ్యం!నా పదో ఏటనించీ అమ్మకి నీరు కట్టెలు మోసితెచ్చేవాడిని.ఇంటింటికీ తిరిగి పాలసీసాలు ఇచ్చేవాడిని.అమ్మ కూలీ పనిచేసేది.
బ్యాంకు మేనేజరు మధ్వబ్రాహ్మిన్ కేశవులుగారు నాకు తెలుగు భాష నేర్పారు. శ్యామ్ రావుగారు బ్లైండ్ స్కూల్లో చేర్పించారు.నెలకి20రూపాయలతో 30రోజుల తిండి !హాస్టల్లో నల్లులు దోమలు !ఘోరమైన నరకం చవిచూశాం.పుస్తకం కంటికి దగ్గరగా పెట్టుకుని హిందీ ఆంగ్ల తెలుగు పుస్తకాలు పేపర్లు చదివేవాడిని.3నెలలు ఉర్దూ మీడియంలో చదివాను.శ్రీ నరసింహాచారిగారు తెలుగు మీడియంలో చేర్చారు. బ్రెయిల్ లిపి బాగా నేర్చుకున్నాను. ట్యూషన్ చెప్పేవాడిని.క్లాస్ ఫస్ట్ నేనే ఎప్పుడూ!నేను అంజి ఈత కొట్టేవారం.డోలక్ వాయిస్తూ పాటలు పాడేవారం.హుసేన్ సాగర్ దగ్గర ఆనాటి హిందీ సినీ సంగీత దర్శకులతో పరిచయం ఏర్పడింది. వారి బృందంలోకి రమ్మన్నారు. నేను వెళ్లలేదు. టెన్త్ క్లాస్ విద్యార్ధి గా నా సోషల్ వర్క్ ప్రారంభమైంది. మూడు అంధ జంటలకు పెళ్లి చేశాను. మాస్కూల్ కి మార్వాడీ సేఠ్లు వచ్చేవారు. సహాయ సహకారాలు అందించేవారు.ఆంధ్ర సారస్వత పరిషత్తు లోబి.ఓ.ఎల్.చేశాను. వివేకా మేడం మాకు మార్గదర్శి. గంగరాజు పద్మజ అక్క సాయపడేది.డిప్లొమా ఇంటర్ ఒకేసారి చేశాను. బి.ఎ.నిజాం కాలేజ్ లో చదవాను.ఒకప్పటి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి స్నేహితుడు.మలక్పేట చార్మినార్ రాంకోటి అన్నీ కాలినడక యే!అలాగే మున్సిపాలిటీ చేసేపనులగూర్చి గోడల పై స్లోగన్లు రాశాను.డెహ్రాడూన్ చెన్నైలో స్పెషల్ ట్రైనింగ్ పొందాను. ఎన్.ఐ.ఆర్.డి.ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్లు చాలా పొందాను. ఎన్.టి.ఆర్.ముఖ్య మంత్రి గా ఉన్న కాలంలో కుషాయిగూడ హరిజనవాడలోబస్తీ పిల్లలకు టీచర్ గా పనిచేశాను.బ్రెయిల్ ప్రెస్ లోశిక్షణపొంది స్టీరియో ఆపరేటర్ మీద ఒక చేత్తోబ్రెయిల్ రాసిన ఏకైక వ్యక్తిని ప్రూఫ్ రీడర్ ని కూడా. 1987నించి కౌన్సెలింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫీసర్ గా శ్రీ కాకుళం మొదలు ఆదిలాబాద్ వరకు ఎన్నెన్నో అనుభవాలు. 1990లో పెళ్ళి ముగ్గురు కూతుళ్లు!నారెండో కూతురు హఠాత్తుగా చనిపోయింది. ఆమె పేర బాలామెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. బాలికలవిద్యకై కృషి చేస్తున్నా.19మంది అంధులకి జాబ్స్ రావటంకై కృషి చేశాను.
ఇంకా చాలా చేయాలని ఉంది. ఆస్ట్రేలియా లో రెండు ఏళ్ళు కరోనా కారణంగా ఉండిపోయాను మాఅమ్మాయి దగ్గర. అంతా దైవకృప."ఆయన ఎంతో స్పష్టంగా ఆడియో ద్వారా పంపినది విని రాసుకుని పంపుతున్నా. ఇలాంటి వారిని గూర్చి అందరం తెలుసు కుని తీరాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి