కరుణానిధి ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
  "వీరుడు ఒకసారే మరణిస్తాడు.... పిరికివాడు పలుసార్లు మరణిస్తాడు" అన్నది అందరికీ తెలిసిన మాట. దీనినే కళైంజ్ఞర్ కరుణానిధి కాస్త మార్చి చెప్పారు.....
అదేంటంటే "వీరుడికి మరణమే లేదు. పిరికివాడు బతికిందే లేదు" అని!
తమిళనాడులో ఎప్పటికీ పతాక శీర్షికే....కళైంజ్ఞర్ కరుణానిధి! అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన అందరి దృష్టిలో ఉండేవారు.
తొలి రోజుల్లో తనను "తి.ఎం. కరుణానిధి" అనే చెప్పుకునేవారు. అంటే "తిరువారూర్ ముత్తువేలర్ కరుణానిధి". అనంతరం "ము. కరుణానిధి" అని సంతకం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత "ము.క. (மு.க.) అని ఆయన సంతకం మారింది.
"ఆండవరే" అని ఎంజిఆర్ ఈయనను పిలిచేవారు. తర్వాతి కాలంలో మూక్కా అని పిలిచారు. 
"మూనాకానా" అని పిలవడం నటుడు శివాజీ స్టయిల్. 
కాలక్రమేణా ఆయనను కుటుంబసభ్యులతోసహా అందరూ "తలైవర్" అనే పిలవడం మొదలుపెట్టారు.
డైరీ రాసే అలవాటు ఆంతగా లేదు కానీ ఆయనకున్న జ్ఞాపకశక్తీ అపారం. "నా మెదడే నాకొక డైరీ" అనేవారు కరుణానిధి.
రోజూ రాత్రి పూట సిఐటి కాలనీ ఇంట్లోనే నిద్రపోయేవారు. తెల్లవారుజామునే లేచి గోపాలపురం వెళ్ళేవారు. ఉదయం పూట బ్రెక్ ఫాస్ట్ గోపాలపురంలోనే.
"మురసొలి" పత్రికకో "సచివాలయాని"కో వెళ్ళి మధ్యాహ్నం భోజనం సిఐటి నగర్ లో చేసేవారు. అనంతరం ఓ కునుకు తీసి మళ్ళీ గోపాలపురానికి వెళ్ళేవారు. అక్కడి నుంచి అన్నా అరివాలయానికి (డిఎంకె పార్టీ కార్యాలయం) వెళ్ళేవారు. రాత్రి సిఐటీ నగర్లో భోంచేసేవారు. (ఈ పార్టీ కార్యాలయ ఆవరణలోనే సన్ టీవీ కార్యాలయం ఉండేది. వీరి గ్రూప్ లోని జెమినీ టీవీ న్యూస్ విభాగంలో దాదాపు పదేళ్ళు పని చేశాను. ఇక్కడ పని చేస్తున్న రోజుల్లోనే కరుణానిధిని చూసిన రోజులనేకం).
కరుణానిధి తెల్లవారుజామున లేవడంతోనే అన్నా అరివాలయానికి వెళ్ళి వాకింగ్ చేసేవారు. వెన్ను నొప్పికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాకింగ్ మానే సారు.
కరుణానిధికి యోగా నేర్పించింది టి.కె.వి. దేశికాచారి.
కరుణానిధికి శంఖుమార్క్ పంచలు ఇష్టం. ఇవే బాగున్నాయనేవారు.
తొలిరోజుల్లో మాంసాహారం ఇష్టపడి తినేవారు. అయితే తర్వాత్తర్వాత  శాకాహారమే ఎక్కువగా తినసాగారు. నిత్యమూ ఏదో ఒక ఆకుకూర తప్పక ఉండాల్సిందే. ఈయనకు ఇడ్లీ, సాంబార్ ఇష్టం. 
ఓమారు ఈయన డిఎంకె ఎన్నికల ఖర్చుకు ఊహించని రీతిలో విధంగా పదకొండు లక్షల రూపాయలు వసూలు చేసిచ్చినప్పుడు అన్నాదురై ప్రశంసించి ఓ ఉంగరం తొడిగారు. ఆ ఉంగరాన్ని ఆయన వేలి నుంచి తీయనేలేదెప్పుడూనూ. బంగారు గొలుసుని ఎప్పుడూ వేసుకోలేదు.
ఆయన చిన్న వయస్సులో ఇష్టపడి ఆడిన ఆట హాకీ. తిరువారూర్ బోర్డు హైస్కూల్ హాకీ టీము తరఫున ఆడారుకూడా. పెద్దయ్యాక క్రికెట్ పోటీలను ఇష్టపడి చూసేవారు.
గోపాలపురం ఇంట్లో సెయల్మణి, అన్నా అరివాలయంలో నీలమేఘం ఈయనకు సహాయకులుగా ఉండేవారు. ఇద్దరికీ వయస్సుపైబడటంతో నిత్య అనే యువకుడిని నియమించుకున్నారు.
తొలి రోజుల్లో మరవన్ మడల్ అని రాస్తూ వచ్చిన కరుణానిధి అన్నాదురై మరణానంతరం "ఉడన్ పిరప్పే" అని మొదలుపెట్టి లేఖలు రాస్తూ వచ్చారు. 
లేఖారచనతోనే నేను నా మానసిక వత్తిడులను, బాధలను తగ్గించుకుంటున్నానని చెప్పుకునేవారు.
జవాబు చెప్పలేని ప్రశ్నలకు ఎదురు ప్రశ్నించడం ఆయన ధోరణి. "భగవంతుడిని స్వీకరిస్తారా?" అని ఓమారు ఎవరో ప్రశ్నించారు. 
అప్పుడీ ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు "ఇది సమస్య కాదు. భగవంతుడు మనల్ని స్వీకరిస్తున్నాడా అని ప్రశ్నించుకోవాలి" అని ఎదురు ప్రశ్నించారు.
కరుణానిధి నలభైకిపైగా సినిమాలకు కథ, మాటలు రాశారు. వీటిలో ఆయనకు ఎంతగానో నచ్చిన వచనం ఒకటుంది. అది ఇదే...
"మనస్సాక్షి నిద్రపోతున్న సమయంలోనే మనసు కోతి ఊరు చుట్టిరావడానికి బయలుదేరుతుంది" 
"విశ్రాంతి లేకుండా కష్టించిన ఇతను ఇదిగో విశ్రాంతి తీసుకుంటున్నాడు" అని తన సమాధిపై రాసి ఉంచాలని కరుణానిధి తన మనసు మాటను వెల్లడించారు.
పూజగదిలాంటి గదిలో ఆయన తండ్రి ముత్తువేలర్, తల్లి అంజుగం, మొదటి భార్య పద్మావతి ఫోటోలు ఉండేవి. ఈ ఫోటోలకు తప్పనిసరిగా నమస్కరించి బయటకు వెళ్ళేవారు.
కథ‌, నవల, నాటకాలు, కవితలు, సినిమా కథ, మాటలు, పాటలు, కార్టూన్ అంటూ ఇలా అన్నింట్లోనూ తనదైన శైలిని చూపించారు కరుణానిధి!
"గాలిని గిల్లింది లేదు. కానీ నిప్పుని దాటాను...." 
"ఆలయం వద్దని కాదు. అది క్రూరుల గుడారంగా మారిపోకూడదు...."
"పడిపోయేది మనమైనప్పటికీ బతికేది తమిళమై ఉండనీ..." 
- ఈ మూడూ ఆయన మాటలు. ఈ మాటలు తమిళనాడులో ఎక్కువగా చెప్పుకునే మాటలు.
తమిళనాడురాజకీయ చరిత్రలో పన్నెండు సార్లు ఎమ్మెల్యే, అయిదుసార్లు ముఖ్యమంత్రి, పదిసార్లు డిఎంకె అధ్యక్షుడిగా ఇంకెవరూ సాధించలేని ఘనతను కరుణానిధి సాధించారు. భవిష్యత్తులో ఇంకెవరైనా ఇది సాధించగలరా అనేది ప్రశ్నార్థకమే.
పక్కమీద కూర్చుని పరీక్ష్ ప్యాడ్ పెట్టుకుని రాయడం ఆయన అలవాటు. ఎత్తుకోసం రెండు తలగడలు ఉంచుకునేవారు. ఆయన తన రచనలకు ఇంకు పెన్నునే వాడేవారు.
ఆయన రాక కోసం నిత్యమూ నిరీక్షించేవి అయిదు. అవి, గోపాలపురం, సిఐటి నగర్, సచివాలయం, అన్నా అరివాలయం, మురసొలి.
సముద్రతీరాన ఇసుకపై కూర్చుని గాలిని ఆస్వాదిస్తూ మాట్లాడటమంటే ఆయనకెంతో ఇష్టం. అయితే రోజూ  అది సాధ్యం కాకపోవడంతో మామల్లపురం జి.ఆర్.టి హోటల్లో సముద్రాన్ని చూస్తూ అక్కడి గదిలో గడిపేవారు. తరచూ ఈ హోటల్ గదికి వెళ్ళేవారు.
ఆయనకు తమిళ కావ్యాలలో "శిలప్పదికారం" అంటే మహా ప్రియం. మహాభారతం అంటే ఇష్టం. ఆయన టేబుల్ మీద ఎప్పుడూ ఉండేది తిరుక్కురళ్ పుస్తకం!
ఏకాంతం నచ్చదు. ఎప్పుడూ చుట్టూ మిత్రులు ఉండాలనుకునేవారు. అది ఆయనకిష్టం. వారితో సరదాగా మాట్లాడుతూ గడపడం మరీ మరీ ఇష్టం









కామెంట్‌లు