తొలి బోనస్ ;-- యామిజాల జగదీశ్

 నిజానికి ఈ మాటలు విజయదశమి రోజే రాయవలసింది. ఎందుకారోజు రాయలేదో కానీ ఇప్పటికైనా ఆలస్యం కాదనిపించి ఒకటి రెండు విషయాలు చెప్పాలనిపించింది.
నా ఉద్యోగ జీవితం మూడు దశాబ్దాలపైనే
కొనసాగింది. 
మిలియన్ జోక్స్, బాలానందం, బాలభరతి, బుజ్జాయి, ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త, జెమినీ టివి, సాక్షి ఇలా అనేక సంస్థలలో పనీ చేసాను. కానీ బోనస్ అంటూ అందుకున్నది రెండు సంస్థల నుంచీ. 
అవి,  బాలభారతి పిల్లల మాసపత్రిక.  జెమినీ న్యూస్ ఛానెల్.
బాలభారతి నుంచి ఓ విజయదశమికి మొదటిసారిగా నేనందుకున్న బోనస్ ముప్పై ఏడున్నర రూపాయలు. దీంతోపాటు, ఓ బత్తాయి పండు, బొరుగులు, తాంబూలం. ఇది 1978 నాటి మాట.
బాలభారతి యజమాని వి.వి. నరసింహారావుగారు. అమ్మవారికి పూజ చేసి బోనస్ ఇచ్చారు. అప్పట్లో నా జీతం డెబ్బై అయిదు రూపాయలు. ఇందులో హాఫ్ మంత్ సేలరీగా ముప్పై ఏడున్నర రూపాయలిచ్చారన్న మాట. ఈ బోనస్ చిరస్మరణీయం. నా జీవితంలో ఓ సంస్థ నుంచి బోనస్ అందుకోవడమనేది ఇదే మొట్టమొదటిసారి.
ఈ ముప్పై ఏడున్నరా మా అమ్మకిస్తే నాకందులో పాకెట్ మనీగా అయిదు రూపాయలిచ్చింది. జీతం డబ్బులోనూ మా అమ్మ నెలకు అయిదు రరూపాయలిచ్చేది. వీటితో ఒకటి రెండు మాసపత్రికలు కొనేవాడిని. మిగిలిన డబ్బులతో పచ్చరటిపళ్ళు కొనుక్కుతినేవాడిని. 
ఇదీ నా తొలి బోనస్ జ్ఞాపకం!!
కామెంట్‌లు