బాల్యం ఒక మథుర స్మృతి: -- కందర్ప మూర్తి , వివేకానంద నగర్ , హైదరాబాదు. మొబైల్ : 8374540331
 నా చిన్నప్పటి  ముచ్చట్లు  జ్ఞాపకం  వచ్చి ఈ రచన చేస్తున్నాను.
            నా బాల్యం ఎక్కువ  మా తాతయ్య  సుబ్బారాయుడి గారింట  అగ్రహారం లాంటి  కొరుప్రోలు గ్రామంలో గడిచింది. మా తాత గారికి   మా అమ్మ  ఒక్కర్తే  కూతురు. తాతయ్యకి అమ్మమ్మకు  పిల్లలంటే  ఇష్టం. వారింట్లో  చిన్న పిల్లలు 
లేనందున  నన్ను  వారి  వద్ద  ఉంచుకున్నారు. తర్వాత
నా చదువు  నిమిత్తం  మా ఊరు  చోడవరం  రావల్సి  వచ్చింది. 
       మా తాతయ్య  భూలావాదేవీలు , ప్రోనోట్లు రాస్తుంటారు.
ఏటవాలుగా  ఒక  కర్ర డెస్కు, కోర్టు స్టాంప్ పేపర్లు రాయడానికి
వీలుగా దాని మీద నల్ల కరక్కాయ ఇంకుసీసా , పాళీ కలంతో 
 వ్యక్తులు  చెప్పింది  పద్దతిగా  రాస్తారు. అందువల్ల ఆయనంటే
ఊళ్లో  గౌరవం  ఉండేది.
       తాతయ్యకి  వ్యవసాయం  అంటే  ఎంతో ఇష్టం. వారి 
 పొలంలో  స్వయంగా  పాలికాపులతో పనులు  చేయించేవారు.
 ఇంటి  పెరట్లో  విశాలమైన  ప్రదేశంలో రకరకాల ఫల వృక్షాలు
కాయగూరలు  పువ్వుల మొక్కలు  గోరింటాకు  అరటి చెట్లు
కొబ్బరి చెట్లు  పక్షుల  అరుపులతో   కళకళలాడుతూండేది.
పెద్ద గట్టుతో  వెడల్పుగా  నుయ్యి  నిండుగా నీటితో  కనబడేది.
   తాతయ్య మడులు గట్టి  వంగ  బెండ  దొండ  పొట్ల బీర కాకర
చిక్కుడు  పచ్చి మిర్చి  వంటి  కూరగాయలు, కరివేపాకు ములగ
వెలగ చెట్లు  ఉండేవి. తాతయ్య  మొక్కలకు  గొప్పులు  తవ్వితే
గోలేల్లోని  నీళ్లు  నేను  సిల్వర్ గిన్నెతో  అందించే  వాడిని.
      వీధిలో ఎవరింట్లోనైన  అనుకోకుండా  అతిథులు  వస్తే 
రాయుడు గారింటికి  పంపితే  ఏదో ఒక  కూర ఇచ్చి పంపేవారు.
  పెరట్లో పండే   కాయకూరలు  రోజుకొక  ఇంటికి  నాచేత 
పంపేవారు. మా అమ్మమ్మ  మల్లెమొగ్గలు కోసి రోజుకొక  ఇంటికి
పంపేది. ఆడపిల్లలు గోరింటాకు  కోసుకోడానికి  వచ్చేవారు.
ప్రతి వారింట్లో పాడి పశువులతో  పాలు పెరుగు  సమృద్ధిగా
ఉండేవి.
   తాతయ్య గారింట్లో  టామీ  అని  పెంపుడు  కుక్క ఉండేది.
నేను  దానితో  బాగా  ఆడుకుండే  వాడిని.
    గ్రామంలో  అప్పట్లో కుల వృత్తులను  బట్టి  బ్రాహ్మణ , వైశ్య ,
శూద్ర , హరిజన వాడ,  చాకలి పేట  ఇలా  వేరు వేరుగా ప్రజలు
జీవనం గడిపేవారు.
       అరమరికలు లేకుండా కష్టసుఖాల్లో ఒకరికొకరు బాసటగా
ఉండేవారు. పెద్దలకు గౌరవం ఉండేది. పండగలు , గ్రామదేవతల
ఉత్సవ  సమయంలో హరికథలు  బుర్రకథలు తోలుబొమ్మలాట
 జానపద  సాంఘిక  నాటకాలు  వంటి  వినోద  వేడుకలతో
 సమయం గడిచేది. కార్తీక పౌర్ణమి  వంటి  పర్వదినాలలో
 ఎడ్ల బళ్లమీద  సముద్ర స్నానాలకు  వెళ్లే  వారిమి.
    ఏవైనా గ్రామ సమస్యలు , తగవులు,  కొట్లాటలు  రచ్చబండ
 వద్ద  గ్రామ పెద్దల సమక్షంలో పరిస్కారమయేవి. కోర్టులు,
 పోలీసు  స్టేషన్ల  వద్దకు  వెళ్లే   అవుసరం  ఉండేది కాదు.
     నగదు  డబ్బు  అవుసరం తక్కువ. కుల వృత్తుల వారికి
తిండిగింజలు , వస్త్రాలు  ఇతర  వస్తు రూపంలో  జీతాలుగా
ఇవ్వడం జరిగేది. అక్షరాస్యత తక్కువ. యువకులు ఇంటి
పెద్దల  వద్ద  కుల  విద్య  నేర్చుకుని  అదే బ్రతుకు తెరువుగా
ఉండేది. వైద్య సౌకర్యం  లేనందున మంత్రాలు , విభూదులు
తావీజులు , పసర్లు , మూలికా తైలాలు , పొడులు  వంటి
నాటు వైద్యాలతో  రోగాలకు పరిస్కారం జరిగేది.ఆయుర్వేదంలో
అనభవమున్న  గుడి ఆచార్యులు వైద్యులుగా చలామణి
అయేవారు. ఆడవారికి  ప్రసవాలు  మంత్రసానులు  అనే  అనభవమున్న  వృద్ధ మహిళలు నర్సులుగా వ్యవహరించేవారు
బాల్య వివాహాలు జరిగేవి.ఇతర కులాల వధూవరులు పెళ్లయిన
తర్వాత  మా తాతయ్యకు  కాళ్లు  మొక్కడానికి  తీసుకు వచ్చేవారు. అమ్మమ్మ  వారికి  బట్టలు  మిఠాయిలు ఇచ్చేది.
  మట్టితో కుండలు గోలేలు చేసేవారు ,ఊరివారి మురికి బట్టలు
చెరువు వద్ద ఉతికే చాకళ్లు ,ఇళ్లకు వచ్చి క్షుర కర్మలు చేసే
మంగళ్లు , రైతుల  వ్యవసాయ  పనిముట్లు  చేసే కమ్మర్లు ,
కలపతో ఇంటి పనులు చేసే వడ్రంగి వారు ,పూజలు వ్రతాలు ,
శుభకార్యాలతో పురోహితులు , వర్తక వాణిజ్యాలతో  వైశ్యులు,
 నువుల నుంచి  నూనె  తీసె  తెలుకులవారు  గానుగలతో
 రోజంతా సందడిగా కనబడతారు. జంతు చర్మాలతో చెప్పులు
కుట్టే  హరిజనులు  వేరుగా  ఉండేవారు.
  గొల్లవారు మేకలు గొర్రెలు కొండకు తోలుకుపోయి సాయంకాలం
తిరిగి  వచ్చి  వాటిని  కంపలతో  చేసిన   దడులలో రాత్రి ఉంచుతారు.
    వారంలో  కూరగాయలు  ఇతర వస్తువులతో  ఊరి బయట
 కాళీ ప్రదేశాలలో  సంత  జరుగేది.  సంతలో కూరగాయలు
ఆకుకూరలు , మాంసాహారం, తాటి రేకులతో చేసిన నీటి చేదలు,
 పడుకునే చాపలు ,వ్యవసాయ పనిముట్లు , చేతితో నేసిన
తాళ్లు అమ్ముకుంటారు.
     గ్రామ ప్రజలకు రాజకీయాలతో సంబంధం ఉండేది కాదు. 
ఎన్నికల సమయంలో ఊరి సర్పంచి ఎవరికి  ఓటు వెయ్యమంటే
వారికే  ఓటు  పడేది. ఊరి  బాగోగులు  చూసేది  సర్పంచే.
 ఆర్థికంగా బలంగాను, రాజకీయంగా  పలుకుబడి ఉన్నవారినే
ఊరి  సర్పంచిగా ఎన్నుకుంటారు.
      జాతీయ రహదారి  నుంచి  ఊరికి  మట్టిరోడ్లే ఉండేవి.
అప్పట్లో  అందరూ  కాలినడకనే  ప్రయాణాలు సాగించే వారు.
కొత్త వ్యక్తులు  చేతిలో బరువున్న మహిళలు  ఊళ్లోకి రావాలంటే
గుర్రాలు లాగే  జట్కా బళ్లు ఉండేవి. ఊళ్లో వ్యక్తుల పేరు చెబితే
చాలు  వారిని  గుమ్మాల  ముందు  దింపేవారు.
  బ్రాహ్మణ వీధిలో సాయంకాలమైతే  వాకళ్లు  తుడిచి  కల్లాపు
జల్లి   తెల్ల  ముగ్గుపిండితో  ఆడపిల్లలు  చక్కటి ముగ్గులు
పెట్టేవారు.
   బ్రాహ్మణ వీధిలో  పూజలు వంటలు  మగవాళ్ల  పిల్లల భోజనా
లవగానే  ఆడవారంతా ఏదో ఒక గుమ్మంలో కూర్చుని కబుర్లు
చెప్పుకునేవారు. పెళ్లి  కాని  పిల్లలు  రకరకాల  ఆటలు , పరుగులతో  సందడిగా కనబడేవారు. అట్లతద్ది, వ్రతాలు ,పూజ
లప్పుడు  పండగల  సమయంలో  వారికి  సందడే  సందడి.
    కార్తీక మాసం  వంటి  పర్వదినాల్లో భక్తులతో గుళ్లు కళకళ
లాడుతుంటాయి. గ్రామ దేవతల  పండగల  సమయంలో మొక్కులు పెట్టుబడులు జంతు  బలులతో  కోలాహలంగా
పరిసరాలు  కానొస్తాయి.
     గ్రామాల చుట్టూ పచ్చని పంటపొలాలు , అరటి తోటలు, కొబ్బరి తోటలు ,  మామిడి  తోటలతో  రకరకాల  పక్షుల
 కిలకిలారావాలతో  పచ్చని  ప్రకృతి   స్వాగతం  పలికేది.
  చెరువులలో  పుష్కలంగా  నీటితో  కలువలు  పద్మాలతో
కొంగలు  పాలపిట్టలు  పక్షులతో  ఆహ్లాదకరంగా  కానొస్తాయి.
    అప్పటి  గ్రామాలు  అరమరికలు లేని  అమాయక  జనుల
జీవన  విధానం  తలుచుకుంటే  అలాంటి  రోజులు  మళ్లీ చూడ
గలమా అనిపిస్తుంది.
                 *               *              *
       


కామెంట్‌లు