కార్తీకం పరమ పవిత్రం;-కవిరత్న నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్య పర్యవేక్షకులు,చిట్యాల,నల్గొండ, 8555010108.
నెలరాజు కృత్తిక తారతో 
కలిసుండే మాసం
బ్రహ్మి కాలం భక్తి పారవశ్యం 
చన్నీటి స్నాన ప్రాధాన్యం
క్షీర సాగర మథనం 
శుక్ల పక్ష ద్వాదశి దినం
ఆధ్యాత్మికానందం
అమృత వాహిని పవిత్ర కార్తీకం...

శుక్ల పక్ష శరత్ చంద్రుని
వెన్నెల జలపాతం
ఉసిరి పూజ సకల సౌభాగ్యకరం
శివ కేశవుల ప్రీతికర మాసం
సిరి సంపదల మూలం
విశిష్ట కేదారేశ్వర వ్రత ఫలం...

కార్తీక వనవిహార భోజనం
పరమ పవిత్రం
జన్మజన్మల పాప ప్రక్షాళనవకాశం
కార్తీక దీపారాధన
సర్వ మంగళ దాయకం
స్నాన దాన జపాల 
ఉపవాస వ్రత మహాత్యం...

కఠిన నియమ నిష్ఠల
మహిమాన్విత మాసం
అనుక్షణం శివనామ స్మరణం 
ఆత్మ సంతృప్తికరం
నాగుల కొలిచే చవితి పంచమి
పరమ శుభకరం
ప్రతి రోజు పర్వం 
పవిత్ర దామోదర మాసాంతం...

తులసి కోట ముందు 
గౌరీ దేవికి దీపాలంకరణం
హృదయ గదుల నిండుగా 
హరి హరుల భక్తిరసం 
సంస్కృతీ సంప్రదాయాలు 
వికసించే పుణ్యకాలం
దానధర్మం దయాగుణం 
ఙ్ఞాన మోక్ష ప్రాప్తికి మార్గం
సోదరి ప్రేమతో 
ఆనందకర భగినీ హస్త భోజనం... 


కామెంట్‌లు