శుభ్రత అంటే!;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  శుభ్రత అంటే మన శరీర శుభ్రతే కాదు,మన ఇల్లు,మన చుట్టూ ఉన్న వస్తువులు కూడా శుభ్రంగా ఉండటం.
      మనంవాడే కంప్యూటర్,ఫోను,ఆఖరికి పెన్ కూడా శుభ్రంగా ఉండాల్సిందే!ఈ కరోనాకాలంలో మనం శుభ్రతలను గురించి మాట్లాడుతున్నాంకానీ మనవాళ్ళు ఎప్పుడో శుచి,మడి,కాళ్ళు కడుక్కోవటం తినేముందు చేతుల శుభ్రత,తిన్న తరువాత కంచంలో చెయ్యి కడగకుండా బయట శుభ్రంగా చెయ్యి రద్ది నూనె,ఆహార అవశేషాలు లేకుండా కడుక్కోవాలి అని చెప్పారు..అలానే కాల కృత్యాలు తీర్చుకున్నప్పుడు లిక్విడ్ సోపు చెయ్యి మీద పోసుకుని కడుక్కోవాలి.సాధ్యమైనంతవరకు మనం వాడిన సోపు మరొకరు వాడకూడదు.అందుకే లిక్విడ్ సోపు వాడటం శ్రేయస్కరం.
      నిలువ ఉన్న బ్రెడ్,స్వీట్స్ కొన్నప్పుడు పరిశీలించాలి వాటిమీద ఫంగస్ ఉండవచ్చు.సూక్ష్మజీవులు కంటికి కనబడవు కదా అవి కారు స్టీరింగ్,మోటారు సైకిల్ హాండిల్,నాణేలు,రూపాయల నోట్లమీదకూడా ఉంటాయి.ఎటిమ్ లో బటన్స్ మీదకూడా ఉంటాయి,అందుకే అవి ఉపయోగించిన తరువాత  శుభ్రంగా చేతులు సబ్బుతో కడగాలి.మార్కెట్,మాల్ వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్ళివస్తే ఆ బట్టలు ఇంట్లో వాళ్ళ బట్టలకు దూరంగా తగిలించాలి అసలు డెటాల్ నీళ్ళలో తడిపి వెయ్యాలి.
       మనలో రోగనిరోధక శక్తి ఉన్నంతవరకు సూక్ష్మ జీవులు మనకు రోగాలు కలిగించకపోవచ్చు కానీ రోగ నిరోధక శక్తి తగ్గితే ఇవి రోగాలు కలుగ చేస్తాయి.కరోనా వైరస్ వంటివి శరీరంలోకి ప్రవేశించిన తరవాత రోగనిరోధక శక్తిని నాశనం చేయగల భయంకర జీవులు.
        కూర్చునే చోట, ముఖ్యంగా సభలు సినిమా హాళ్ళలో కూర్చున్నప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలి,గజ్జి,తామర వంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది!కప్పుకునే దుప్పట్లు, పరుపు మీద పరచిన దప్పట్లను మూడురోజులకొకసారి ఎండలో వెయ్యాలి వారానికి ఒకసారి ఉతకాలి.
       మనం బయట తాగే కాఫీ,టీ,జ్యూస్ వంటి కప్పులు,గ్లాస్ ల మీద సూక్ష్మజీవులు ఉండవచ్చు అందుకే డిస్పోజబుల్ కప్పుల్లో తాగాలి.కొన్ని మంచి హోటళ్ళలో వేడినీరుతో కప్పులు,గ్లాసులు కడుగుతున్నారు.
        రోజూ రెండు పూటలా దంతావధానం చెయ్యాలి..అసలు తిండితిన్న తరువాత బాగా పుక్కిలించి ఉమ్మాలి.పిల్లలకు కూడా ఈ అలవాటు నేర్పాలి.పన్ను,చిగురు నొప్పి ఏమాత్రం ఉన్నా వెంటనే దంత వైద్యుణ్ణి సంప్రదించాలి.పళ్ళ మధ్య బాక్టీరియా పెరుగుతే అవి కడుపులోకి వెళ్ళి అనారోగ్యం కలిగించవచ్చు ఒక్కొక్కసారి రక్తంలోకలసి గుండెకు హాని కలిగించి గుండెజబ్బులకు కారణం కావచ్చు. చేతి గోళ్ళు,కాలి గోళ్ళు ఎక్కువగా పెరగకుండా వారానికి ఒకసారి కత్తిరించాలి,చేతి గోళ్ళ వెనుక చేరిన మట్టి ఆహారంతో కలసి కడుపులోకి చేరి హాని కలిగించవచ్చు. 
         తోటలోని మట్టిలో రకరకాల సూక్ష్మ జీవులు ఉంటాయి ఇవి మనకు హానికలిగించవు! హాని కలిగించేవి అయితే అవి ఆమట్టిలో బతకలేవు! అయినా తోట పని చేసిన తరువాత కాళ్ళు,చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
        కొళాయిలో నీరు రంగు మారి వస్తే వాటిని శుభ్రంగా కాచి తాగాలి.కుక్కలు,మేకలు,కోళ్ళు తాకినపుడు తగినంత శుభ్రత పాటించాలి.పెంపుడు కుక్కలకి యాంటీ రాబీస్ వాక్సిన్ వేయించాలి.అందువలన 'రాబీస్' వ్యాధి బారీన పడకుండా మనం రక్షణ పొందవచ్చు.
         ఇటువంటి శుభ్రతలు పాటిస్తే కొన్ని రోగాల బారీన పడకుండా మనం రక్షణ పొంది హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకోవచ్చు.
             

కామెంట్‌లు
Unknown చెప్పారు…
శ్రీ కృష్ణారావు గారు శుభ్రత గురించి చక్కటి విషయాలు తెలియ చేసారు.ముఖ్యంగా పిల్లలు శరీర శుభ్రత పళ్ల శుభ్రత ఇలా అనేక జాగ్రత్తలు వివరించి ఎన్నో మంచి సంగతులు అందచేసారు.