పంజరంలో పక్షులు;-యు.విజయశేఖర రెడ్డి,హైదరాబాద్,9959736475

 ఉదయగిరిని సుశర్మ పాలించేవాడు, అతని కూతురు ప్రభావతికి పక్షులంటే ఎంతో ప్రాణం. దేశ దేశాల నుండి పక్షులను తెప్పించి ఉద్యానవనంలోని స్తంబాలకు పంజారాలను ఏర్పాటు చేయించి, అందులో బంధించింది. పొరుగున ఉన్న సూర్యగిరి రాజకుమారుడు కేశవుడు, ఒక సారి ఉదయగిరి వచ్చాడు.అతను సౌందర్యవంతుడే కాదు పరాక్రమవంతుడు కూడా.   
కేశవుణ్ణి చూసిన సుశర్మ ప్రభావతికి ఇతనే సరి జోడు అని అనుకున్నాడు. యువరాణిని చూసిన కేశవుడు కూడా ప్రభావతినే వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఆమె పక్షులను పంజరాలలో బంధించి ఉంచడం నచ్చలేదు.”మా యువరాణిని ఒప్పించి మీరే వివాహం చేసుకోవాలి” అన్నాడు కేశవుడితో,సుశర్మ.   
కేశవుడు,ప్రభావతితో ఉద్యానవనంలో విహరిస్తూ “మనుషులమైన మనం ఎంత స్వేచ్చగా జీవితాన్ని గడుపుతున్నామో పక్షులు కూడా అంతే స్వేచ్చగా ఉండాలనుకుంటాయి.... వాటిని పంజరాలలో బంధించడం మంచిది కాదు” అన్నాడు కేశవుడు. 
“యువరాజా! పక్షులంటే నాకు ప్రాణం వాటిని పంజారాలలో బంధించకుంటే అవి ఎగిరిపోతాయి?” అని అంది ప్రభావతి. 
“యువరాణి! నాకు పక్షులను మచ్చిక చేసుకునే విద్య వచ్చు... నాకు ఒక వారం రోజుల సమయం ఇవ్వండి వాటిని మచ్చిక చేసుకుని చెప్పిన మాట వినేలా చేస్తాను” అన్నాడు కేశవుడు. 
ఒక వారం తరువాత ప్రభావతితో కేశవుడు ఉద్యానవనం వెళ్ళాడు, అక్కడ అన్ని పంజరాల తలుపులు తీసి ఉన్నాయి. ఒక్క దానిలో కూడా పక్షి లేదు.అది చూసి ప్రభావతి నివ్వెరపోయింది. “కంగారు పడకండి యువరాణి..అన్ని పక్షులూ ఈ వనంలోని చెట్ల మీద ఉన్నాయి” అని కేశవుడు రెండు సార్లు చప్పట్లు కొట్టగానే అవి చెట్లపై నుండీ ఎగిరి వచ్చి ఏ పంజరంలో ఉండే పక్షులు అందులోకి వెళ్ళాయి.
ప్రభావతి ఎంతో సంతోషించింది. కాసేపటికి వచ్చిన రాజు “ఏం ప్రభావతి నువ్వు వివాహం చేసుకుని సూర్యగిరి వెళ్ళినా ఈ పక్షులను పంజారాలలో తీసుకెళ్లి అక్కడి ఉద్యానవనంలో వదిలేస్తే చెట్లపైన స్వేచ్చగా విహరిస్తాయి... నువ్వు పిలిచి నప్పుడు వచ్చి పంజారాలలో ఉంటాయి” అని అన్నాడు. 
ఒక శుభముహూర్తాన ప్రభావతితో కేశవుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
       ***
 
కామెంట్‌లు
Unknown చెప్పారు…
కథ బాగుంది సర్. అభినందనలు