పులిలో మార్పు;-యు.విజయశేఖర రెడ్డి,హైదరాబాద్,9959736475

 ఒక అడవిలో ఎన్నో సాధుజంతువులు ఎంతో సంతోషంగా ఉంటున్నాయి. ఎక్కడి నుండో ఒక పులి,నక్క అక్కడకు వచ్చాయి.”ఇక నుండీ ఈ అడవికి మా పులి రాజుగా ఉంటుంది” అని అంది నక్క. అవును నాకు మంత్రిగా ఈ నక్క ఉంటుంది” అంది పులి. “మా పులి రాజుకు ఆహారంగా రోజుకు ఒక జంతువును పంపాలి” అంది నక్క.
సాధుజంతువులకు పెద్దగా ఉన్న ఒక కోతి అలాగే అని అంగీకారం తెలిపింది.ఒక గుహను చూపించి అందులో పులిని,నక్కను ఉండమని చెప్పింది కోతి. 
మరుసటి రోజు నక్క పులికి ఎవరు ఆహారంగా వస్తారా? అని ఆత్రంగా ఎదురు చూడసాగింది. అంతలో కోతి వచ్చి “ఈ రోజు పులికి ఆహారంగా ఆవు వస్తుంది” అని చెప్పింది. కాసేపటికి ఆవు గుహ ముందుకు వచ్చి “పులి రాజా! ఈరోజు నా వంతు... నాది ఒక చిన్న విన్నపము నా బిడ్డ నిదురపోతోంది... లేవగానే చివరిసారిగా నా పాలు ఇచ్చి వస్తాను” అని అంది ఆవు. “సరే వెళ్లిరా” అంది పులి.
కానీ ఎంత సేపటికీ ఆవు రాలేదు. ఏమై ఉంటుదా? అని నక్క, కోతి వద్దకు వెళ్ళి అడిగింది. “అదిగో ఆవు అక్కడ అమ్మవారి గుడి వద్ద ఉంది... ఆ ఆవుకు ప్రతి రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం అలవాటు... చివరిసారి కదా మ్రొక్కి వస్తుందిలే” అని అంది కోతి.
ఒక సాధువు ఆవుకు పూజ చేశాడు.దూడ ఒక పక్కగా నిలబడి ఉంది.తరువాత ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణలు  చేయసాగింది.నక్క వెళ్ళి పులికి విషయం చెప్పింది. పులి కోపంగా ఆవు ఉన్న చోటుకు వచ్చింది. అప్పటికి ఆవు ప్రదక్షిణలు అయిపోయాయి. దూడ తల్లి వద్దకు వచ్చి ఏడువ సాగింది.సాధువు కూడా కన్నీరు పెట్టుకున్నాడు. “నువ్వు పులి వద్దకు వెళ్లవలిసిందేనా అమ్మా?” అని కన్నీరు మున్నీరు అయ్యింది దూడ. “వెళ్ళక తప్పదమ్మా... పులితో నీకు పాలు ఇచ్చి వస్తానని చెప్పాను... కానీ చివరిసారి కాదా అని అమ్మవారికి ప్రదక్షిణలు చేయడంతో ఆలస్యమయ్యింది... పాపం పులికి ఆకలి వేస్తుంటుంది వెళ్లి వస్తాను” అని ప్రేమతో దూడను నాకింది.
ఆవును,దూడను చూశాక పులి కళ్ళల్లో మొదటిసారి నీళ్ళు తిరిగాయి.”మనమేమో జంతువులను చంపి వాటి ఎముకలను పుర్రెలను లెక్క పెడుతున్నాము..ఆవు పుణ్యలోకాలు చేరుకోవాలని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది..ఇక నుండి నేను జంతువులను ఆహారంగా తీసుకొను సాధుజంతువుగా ఉంటాను”. అని ఆవు వద్దకు వెళ్లి ముందరి  కాళ్ళు ముడుచుకుని నమస్కరించి “నీ బిడ్డతో హాయిగా ఉండు, నేను మీకు అండగా ఉంటాను” అని అంది పులి.ఆ మాటలు విన్న నక్క తోకను ముడుచుకుని వేరే చోటుకు వెళ్లిపోయింది.           
                                        ****
కామెంట్‌లు