'చెర'వాణి-డాక్టర్ అడిగొప్పుల సదయ్య, కరీంనగర్-చరవాణి:9963991125
మధుర మంజులవాణి! మాయ కర్మల శ్రేణి!
కరపద్మముల ఖమణి!, కలువ కన్నుల రమణి!

చంటోడు,ముసలోడు,చదువుకుంటున్నోడు
నీ మత్తు మునిగిరే  నెరజాణ వారుణీ!

లోకమందలి జనుల నేకాకిగా చేసి
బంధాల తెంపితివి పాపివే దొరసాని!

మొగుడు-పెళ్ళాలకిల మోహమును తగ్గించి
కయ్యమును పెంచితివి గయ్యాళివే యరణి!

ఉద్యోగ స్థానాల నొడుపుగా చొరబడియు
పనితనము,సమయముల పాడుచేస్తివె సాని

కాలహారిణి నీవె, కాలపాలిని నీవె
కాల స్రంసిని నీవె, కాల ధ్వంసిని నీవె

నీవెంట ముక్కోటి నేరాలు చేరాయి
నీవుంటే యొక్కోటి నియమాలు మారాయి

తిండి వేళలు మారె,పండు వేళలు మారె
పండుగలు,పబ్బాలు దండుగై మూలపడె

తెరపైని పాఠాలు దేవదేవుండెరుగు
మరుగైన పాఠాల మరుగె బాలకులంత

టక్కరీ,నీకెంత మక్కువలు మాపైన
రవ్వంత క్షణమైన దవ్వుండగాలేవు?

తెరపైన కరశాఖ తేతెయ్యలను చేయ
జనుల జవసత్వాల కనుమరుగు మొదలయ్యె 

నయనాలు నాల్గొచ్చె,నాడులే వాడినవి
కరములో నరములే కంపించి చెడె ధమని

చాటింగుతో చదువు చట్టుబండలు చేసి
మీటింగుతో మమ్ము మీటావు కరవాణి!

బేంకింగు,షాపింగు,పేమెంటు సేవలను
తోడుగా నిలిచావె తొయ్యలీ,చరవాణి!

చరవాణి, మా బతుకు చెర బట్టితివిగదనె
పరవాణి వదలవే పదివేల సన్నుతుల్

----------------------------------------------



అర్థాలు::

ఖమణి=సూర్యుడు
వారుణి=మధ్యము
అరణి= చిచ్చు
సాని=స్వామిని
కరశాఖ=వ్రేలు
తేతెయ్యలు=నాట్యము
పరవాణి =శీఘ్రము
కామెంట్‌లు