. వెన్నెల జలతారు ;- కలావతి కందగట్ల;-;-కలం స్నేహం
నవమి నాటి వెన్నెల
 కురుస్తుంది చల్లగా...
 వెన్నెల జలతారు లో
 తడుస్తున్న పుడమి
 కొత్త అందాలతో మెరిసిపోతుంది...

నేలపై పచ్చని తివాచీ లా పరుచుకున్న పచ్చిక బయలు
పచ్చిక మొనలపై నిలిచిన తుషార బిందువులు
తళుక్కుమని కాంతులీనుతున్నాయి....

ఆ పక్కనే
నిర్మల తటాకంలో
హొయలు ఒలుకుతూ
జల విహారం చేస్తూ సాగిపోతున్న రాజహంసలు.,...

కీచు రాళ్ల రొద కు
గుబురు కొమ్మల్లో
గువ్వల జంట....
వెన్నెలను ఆస్వాదిస్తూ 
గుసగుసలాడుకుంటున్నాయి...

తారలతో సయ్యాటలాడుతున్న
శశాంకుడి అందానికి మైమరచిపోతూ...
సిగ్గుతో తలలు వాల్చిన
 సుమ బాలలు....

వర్ణించతరమా జాబిల్లి అందం 
చూడగలమా చందమామ లేని ఆకాశం....!!


కామెంట్‌లు