కల'వరం';-అల్లాడి వేణు గోపాల్--;-కలం స్నేహం
పరీక్షలలో విఫలమైన పుత్రికను చూసి
షడ్డకుని ఉక్కిరి బిక్కిరి చేయగా ఆవేశం
పైపైకి అయ్యో పాపం అని బుకాయిస్తూనే
లోలోన చెప్పనలవి కానంత సంతోషం

మరదలి కొడుకుకు ఉద్యోగం ఊడగానే 
ఆనందానికి ముమ్మాటికీ అంతరిక్షమే హద్దు
చదువు...సంధ్య లేక ముగ్గురు కొడుకులు
వీధులలో తిరుగుతున్న వైనాన్ని అడగొద్దు

సహోద్యోగి ఇల్లు వర్షానికి  ఉరుస్తుందని
మాటలకు ఏ మాత్రమూ అందని సంబరం
నిండా మునిగిన తన ఇంటి దుస్థితిని మరచి
మిడిసిపాటుతో వ్యవహరించుట అబ్బురం

వ్యవసాయంలో నష్టపోయి తెగ విలపించే
బామ్మరిదిని ఎద్దేవా చేసే చులకన భావం
అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకు పోయినా
తప్పులు వెదుకుట మానని శునక స్వభావం

దేవుడే స్వయంగా  భువికి దిగివచ్చి అడిగినా
మనసు విప్పి కోరుకోకుండా ఏదైనా వరం
తోటివ్యక్తులు బాగుపడుతున్నారని ఏడుస్తూ
కేకలుపెట్టే లోకుల నైజమే నిక్కముగ కలవరం

సర్వేశ్వరుని చెంత అభ్యున్నతిని కోరుకోవడం
ఏనాడో మరచిన నేటి విచిత్ర మానవుడు
సన్నిహితుని పతనానికై నిత్యం పరితపిస్తూ
భక్తుని వలె నటించే ప్రమాదకర దానవుడు


కామెంట్‌లు