"అక్కయ్య";-ఎం బిందుమాధవి
 "సాయంత్రం ఆఫీస్ నించి అటు నించి అటే క్యాంప్ కి వెళ్ళాలి. మనిషిని పంపిస్తాను..నాలుగు రోజులకి సరిపడా బట్టలు, నా షేవింగ్ కిట్, మందులు సర్ది పంపించు" అని విద్యాధర్ సరోజ ఆఫీసుకి ఫోన్ చేసిచెప్పాడు.
ఆదాయ పన్ను శాఖలో పని చేసే విద్యాధర్ కి ఇలా హఠాత్తుగా రైడ్ లకి వెళ్ళటం అలవాటే! ఎక్కడికి వెళుతున్నారో, ఎన్నాళ్ళో అంతా రహస్యంగా ఉంచటం వారి డ్యూటీలో భాగం! భార్యకి కూడా తిరిగొచ్చాక కానీ తెలియదు.
బ్యాంకు లో పని చేసే సరోజ... భర్త పంపే మనిషి వచ్చే సమయానికి పెట్టె సర్ది ఇవ్వటానికి సాయంత్రం పర్మిషన్ పెట్టి త్వరగా వచ్చింది.
"నగేష్..అయ్యగారి మందులు గుర్తుగా ఒక పర్సులో పెట్టాను..చూసుకోమను" అని చెప్పి పంపింది.
                                                    *******
"హలో హలో...." విద్యాధర్ అక్క విజయలక్ష్మి తమ్ముడికి ఫోన్ చేస్తున్నది. ఎంతకీ తమ్ముడి ఫోన్ కలవట్లేదు. గొంతులో బాధ సుడులు తిరుగుతున్నది. తమ్ముడి ఫోన్ కలవక ఆ బాధ రెట్టింపయింది.
ఇద్దరూ చిన్నప్పటి నించీ బాగా ఆత్మీయంగా ఉండేవారు. ఏదయినా తమ్ముడితోనే ముందుగా చెప్పే అలవాటు ఆవిడకి. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని అప్రసన్నమైన సంఘటనలతో తమ మధ్య దూరం ఎక్కడ పెరుగుతుందో అని బెంగ పడిపోయింది.
 "ఇదేంటి..తనకి ఇంత కష్టమొస్తే పంచుకోవటానికి తమ్ముడి ఫోన్ దొరకట్లేదు" అనుకుంటూ చిరాకుగా పదే పదే ప్రయత్నిస్తోంది.
"ఏమ్మా మీ తమ్ముడు ఫోన్ తియ్యట్లేదా? అవునులే నీకున్న ఫీలింగ్స్ ఆయనకి ఉండాలనేముంది. కీచు గొంతు, చీపురు పుల్ల లాగా రోగిష్టి కళతో ఉండే తన  కూతుర్ని చేసుకోనన్నానని మన మీద కోపంతో నీ ఫోన్ కావాలనే తియ్యట్లేదు. వాళ్ళ తత్వమేమిటో తెలియట్లేదా?" అన్నాడు కొడుకు శ్రీధర్. 
విజయలక్ష్మి భర్త కామేశం ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి ఆఫీసులో సీట్ లోనే చనిపోయాడు. ఆ వార్త తమ్ముడికి చెప్పాలని ఇందాకటి నించి ప్రయత్నించి విసిగిపోయి...మరదలికి ఫోన్ చేసింది.
విచిత్రం ఏమిటో మరదలి ఫోన్ కూడా పలకట్లేదు. మరదలి ఆఫీసుకి ఫోన్ చేస్తే, 'ఈ రోజు త్వరగా వెళ్ళిపోయారండి ' అన్న సమాధానం వచ్చింది.
పొరుగూరిలో ఉన్న తమ్ముడి కుటుంబానికి అప్పటివరకు కబురే అందకపోతే, ఇక వారికోసం వేచి చూసే అవకాశం లేదని తరువాయి కార్యక్రమాలన్నీ ముగించారు, విజయలక్ష్మి గారి ఇంట్లో.
మామయ్య రావాలనే పట్టింపూ...రాలేదన్న దుగ్ధా లేకపోయినా
అత్యవసరమైన సమయంలో ఫోన్ మాట్లాడని మామయ్య పట్ల మేనల్లుడు శ్రీధర్ కి కినుకగా ఉన్నది. తన భర్త చావు వార్త చెప్పాలని ఫోన్ చేస్తే పలకని తమ్ముడి విషయంలో  "ఏం జరిగుంటుందబ్బా" అని విజయలక్ష్మి ఆ రోజు నించీ  అన్యమనస్కంగానే ఉన్నది.
                                          ********
నాలుగు రోజుల తరువాత క్యాంప్ నించి వచ్చాడు విద్యాధర్. రాత్రింబవళ్ళ పనితో బాగా అలిసిపోయాడు. కొంచెం జ్వరం కూడా తగిలినట్టనిపించింది.
ఆ రోజు ఆఫీసుకి వెళ్ళలేదు.
"సరోజా ఈ ఫోనేమిటో కుంటుతున్నది. రావలసిన మెసేజిలు రావట్లేదు. పొద్దున అనగా కాల్ చేస్తే, కాల్ చేసిన వాళ్ళ నంబర్ తో కాకుండా ఏదో మిస్డ్ కాల్ అంటూ ఏ సాయంత్రానికో ఓ మెసేజ్ వస్తోంది. దానికి పోయే కాలం వచ్చినట్టుంది. కొని అప్పుడే నాలుగేళ్ళు పైనే అయింది. కొత్తది కొనాలనుకుంటా" అన్నాడు.
"అది వరకు ఇలాగే  పని చెయ్యని రిస్ట్ వాచీలని రైల్ పట్టాల మీద పెట్టమని జోకులేసే వారు. ఇప్పుడు ఇదయినా అంతే" అన్నది నవ్వుతూ సరోజ.
రైడ్ కి వెళ్ళొచ్చాక రిపోర్ట్ తయారు చెయ్యటం, సబ్మిట్ చెయ్యటం హడావుడితో మరో నాలుగు రోజులు గడిచింది. అప్పటికి ఫోన్ మొరాయించి షుమారు వారం దాటింది. రెండో శనివారం కాస్త ఊపిరి తీసుకునే టైం దొరికాక వెళ్ళి ఫోన్ కొని తెచ్చాడు. కాంటాక్ట్స్ ఎక్కించటం మిగిలిన అవసరమైన యాప్స్ అన్నీ సెట్ చేసేసరికి ఇంకో రెండు రోజులు పట్టింది.
కొత్త ఫోన్ లో నించి అక్కకి ఫోన్ చేశాడు విద్యాధర్. విజయలక్ష్మి భర్త పోయి అప్పటికి పది రోజులయింది. తమ్ముడి పేరు ఫోన్ మీద చూస్తూనే ఆవిడ ముఖంలో రంగులు మారాయి. ఆనందం, బాధ, కోపం, నిష్ఠూరం కలగలిసి రావటంతో గట్టిగా మాట్లాడింది. తరువాత గట్లు తెగిన వరద ప్రవాహం లాగా ఒక్కసారి ఏడ్చేసింది.
"అక్కయ్యా.... అక్కయ్యా ఏమయింది? అంతా కులాసాయేనా? నేను పది రోజుల నించీ బయటి క్యాంపులో బిజీగా ఉన్నాను. పెద్ద రైడ్...నీకు తెలుసు కదా! అంతా రహస్యంగా జరగాలి. సరోజకి కూడా చెప్పకుండా ఆఫీసు నించి అటు నించి అటే వెళ్ళాను. తరువాత రిపోర్ట్ పంపించటం....ఆ లాంఛనాలన్నీ నీకు తెలుసు కదా" అన్నాడు ఉద్వేగంతో కంగారుగా!
"నీ కూతురిని శ్రీధర్ చేసుకోనన్నాడని అంత కోపమైతే ఎట్లారా? మీ  బావ పోయి ఇవ్వాళ్టికి పది రోజులు. పుట్టింటి వాళ్ళు రాలేదని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. మన మధ్యలో అనేకం ఉండచ్చు. ఇలాంటప్పుడు అవి మనసులో పెట్టుకుంటారా" అంటూ ఆవిడ గట్లు తెంచుకున్న ప్రవాహమల్లే ఊపిరి తీసుకోకుండా మాట్లాడేస్తున్నది.
కత్తి వాటుకి నెత్తురు చుక్క లేనట్టు విస్తుపోయిన విద్యాధర్ భార్యని పిలిచి "సరోజా బావ పోయినట్టు నాకు చెప్పలేదేం? అదేమన్నా మర్చిపోయే విషయమా? ఇంత ముఖ్యమైన విషయం తెలిసీ తెలియనట్టు ఊరుకున్నానని అక్కయ్య నన్ను నిష్ఠూరాలాడుతున్నది. అలా ఎలా మర్చిపోయావ్?" అన్నాడు.
"ఆయన చనిపోయిన రోజు మీకు వాళ్ళు ఫోన్ చేశారుట. మీ ఫోన్ స్విచాఫ్ వచ్చిందిట. మీ ఆఫీసుకి చేశారుట కానీ..మీరు లేరనేసరికి విషయం చెప్పకుండా ఫోన్ పెట్టేసి, తరువాత నాకు కాల్ చేశారుట. ఆ కాల్ అసలు నాకు రాలేదు. ఆఫీసుకి చేశారుట, నేను ఆ రోజు మీకు బట్టలు పంపించాలని త్వరగా ఇంటికొచ్చేశాను కదా!"
"మీరేమో 'పగలు ఇంట్లో ఎవరం ఉండం! మనిద్దరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇక ఇంట్లో లాండ్ లైన్ ఎందుకు, నెలా నెలా రెంట్ దండగ' అంటూ ఉన్న ఫోన్ తీయించేశారు. ఏమనుకున్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్ చెయ్యలేదు."
"తరువాత దహన సంస్కారాలయ్యాక నాలుగో రోజు ఫోన్ చేశారు. మీరు ఆ రోజు రాత్రి లేట్ గా క్యాంప్ నించి వచ్చారు. వస్తూనే నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అలిసిపోయానని జ్వరంతో  పడుకున్నారు. మరునాడు మా బ్యాంకులో జరిగిన ఏదో పెద్ద ఫ్రాడ్ గురించి ఎంక్వైరీ ఉందంటే మీరు నిద్ర లేచే లోపే నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను. తరువాత మీరు రిపోర్ట్ తయారు చేసుకునే హడావుడిలో డిస్టర్బ్ చెయ్యద్దని తలుపేసుక్కూర్చున్నారు."
"వెంటనే చెప్పే అవకాశం రాలేదు. పోనీ నేను ఒక్కదాన్నే వెళ్ళొద్దామా అనుకున్నాను. కానీ మీరు లేకుండా ఒంటరిగా వచ్చిన నన్ను చూసి మీ మేనల్లుడు శ్రీధర్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని మన పూర్ణ 'వెళ్ళద్దమ్మా' అన్నది. ఆ విషయంలో నాకుండే సందేహాలు నాకున్నాయి. మనమ్మాయి పెళ్ళి అప్పటినించీ మీ బావ, మీమేనల్లుడు మనని శతృవులని చూసినట్టు చూస్తున్నారు. వెనకటికి మా అమ్మ చెబుతూ ఉండేది 'తల్లితో పుట్టిల్లు..మొగుడితో అత్తిల్లు ' అని! అందుకే వెళ్ళటానికి సాహసించలేదు.
"ఇది మరచిపోదగిన విషయం కాదు. పొరపాటు జరిగిన మాట నిజమే! కానీ ఇందులో నాకు ఏ దురుద్దేశ్యమూ లేదు. మీకు మీ అక్కయ్యకి ఉన్న అనుబంధం నాకు తెలుసు. బంధువులన్న తరువాత ఏవో చిన్న చిన్న పొరపొచ్చాలుండచ్చు. అంత మాత్రాన, ముఖ్యమైన వ్యక్తి చనిపోతే చెప్పకూడదనుకునేటంత కుసంస్కారిని కాదని మీకు తెలుసు కదా! ఆ మాటే ఆవిడతో శ్రీధర్ తో చెప్పండి. మనకొచ్చిన పరిస్థితులు  అలాంటివి" అన్నది సరోజ.
ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పి సెలవు పెట్టి వెంటనే అక్క ఊరికి బయలుదేరాడు విద్యాధర్. పదో రోజు దాటిపోయాక వచ్చిన మేనమామని నేరస్థుడిని చూసినట్టు ప్రవర్తిస్తున్న కొడుకుతో "నేను చెప్పలేదా..మామయ్యకి కబురు అంది ఉండదు అని. తెలిస్తే ఒక్క నిముషం కూడా ఆగడు" అని తమ్ముడి చెయ్యి అందుకుని లోపలికి తీసుకెళ్ళింది.
మామయ్య రాకతో శ్రీధర్ మనసులో కలిగిన అనుమానం సమసిపోకపోయినా...అక్క విజయలక్ష్మి మాత్రం తమ్ముడిని చూసి, తమ బంధంతెగిపోలేదని మనస్ఫూర్తిగా సంతోషించింది.
[ఈ మధ్య కాలంలో ఫోన్లు చేస్తున్న అరాచకం..సృష్టిస్తున్న అపార్ధాలు, అపోహలు  అందరికీ అనుభవం లోకి వచ్చే ఉంటాయి. సరదాగా దాని ఆధారంగా కధ అల్లాను]

కామెంట్‌లు