-ప్రియ నెచ్చెలి;-జోషి మైత్రేయి-కలం స్నేహం
జీవితం యాంత్రికమైన వేళలో
కాలం కడలిలో నన్ను నేనే కోల్పోతున్నప్పుడు
నా అంతరంగ పొరల్లో నిక్షిప్తమైన
అగాధాన్ని ప్రేమతో నింపింది  నువ్వు

నిర్నిద్ర రేయిలలో... హృదయ పరితాపాలతో
రెప్పమాటు తడి ఆవిరవుతున్నప్పుడు
వెన్నెల వెలుగులు నింపింది
స్వప్నాల జాడ అయ్యింది నువ్వు

భరింపరాని ఏకాంతాన్ని భారంగా  మోస్తున్న వేళలో
వాసంత సమీరంలా  తాకిన నీ స్నేహంతో
నిద్రాణమైన మనసును మేల్కొలిపి
ఎద వీణియను శృతి చేసింది నువ్వు

మనసును రంజింపజేసే వెన్నెల వాహినిలో
ప్రేమజ్యోతిని వెలిగించె నీ మమతల మాధుర్యంతో
మదినిండిన ఆశల దీపానికి ఆయువు నింపి
మరో ఉదయానికి దారిచూపింది నువ్వు

రంగుల హరివిల్లయిన ఈ సరికొత్త ఉషోదయాన్ని
పల్లవించవా నా గొంతులో... వసంతగానమై
రవళించవా నా బతుకులో... ప్రణయనాదమై
ఆలకించవా నా నివేదన.. ప్రియ నెచ్చెలివై


కామెంట్‌లు