భయం (చిట్టికథ);-- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.

 రామాపురం లో అందరూ వ్యవసాయ కుటుంబీకులే. ముఖ్యంగా సగం మందికి పైగా కూరగాయలు పండించే వారే. అలాంటి రైతులలో రామయ్య ఒకడు.
రామయ్య వంగతోటలో వంకాయలు తరచుగా దొంగిలింప బడుతుండేవి. రామయ్య గ్రామ పెద్ద లక్ష్మయ్యకు ఈ విషయాన్ని తెలియజేశాడు. చుట్టుపక్కల కూడా అదే పంట వేసిన రైతులు ఉండటం వలన ఎవరు దొంగిలిస్తున్నది తేల్చడం కష్టమే మరి. 
 ఒకరోజు లక్ష్మయ్య కూరగాయలు పండించే రైతులను సమావేశపరిచాడు. అందరితో ఇలా చెప్పాడు. "ఇన్నిరోజులనుండి నేను గమనిస్తూనే ఉన్నాను. అతడే మానేస్తాడేమోనని ఊరుకున్నాను.కాని అతడు మానలేదు వంకాయలు దొంగిలిస్తూనే ఉన్నాడు.రామయ్యకు నష్టం కలిగిస్తూ తాను లాభపడుతున్నాడు.అది మంచిపని కాదు.ఆ దొంగతనం చేసింది ఎవరో అతడే వచ్చి ఒప్పుకుంటే సరే.ఒప్పుకోకపోతే అతని పొలం జప్తుచేసి, ఆతని కుటుంబాన్నంతా ఈ ఊరినుండి వెళ్ళగొడతాము. తర్వాత అతని ఇష్టం" అన్నాడు.
ఆ గ్రామపెద్ద లక్షయ్యగారి మాటలువిన్న వీరయ్య భయపడుతూ లేచి ఏడుస్తూ నిలబడ్డాడు." ఎక్కువడబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధి వలన నేను ఈ దొంగతనానికి ఒడిగట్టాను. నన్ను క్షమించండి. నన్ను నాకుటుంబాన్ని ఈవూరినుండి పంపించకండి. ఏదో ఇలా సేద్యం చేసుకుంటూ ఉన్నదాంతో తృప్తిపడి ఉంటాను. ఇకనుండి బుధ్ధిగా మసలుకుంటాను"అంటూ లక్మయ్య పాదాలకు, రామయ్యపాదాలకు పదేపదే మొక్కాడు.
దాంతో రామయ్య ,లక్ష్మయ్య ఇద్దరూ వీరయ్యను క్షమించి వదిలేశారు.అప్పటినుండి ఏలాంటి దొంగతనాలూ జరుగలేదు.అంతా హాయిగా ఉన్నారు.

కామెంట్‌లు