ప్రయత్నం జీవలక్షణం ;--ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
పంచ భూతాలకైనా ప్రయత్నం ఉండాలి... 
నీరు ప్రవాహిని,గాలీ సర్వవ్యాప్తి,భూమి 
ఉత్పత్తి,నింగి మేఘవర్షిణి, అగ్ని దహనం... 
ఏదైనా తత్వం ప్రదర్శన చేస్తూ 
పోవడానికి యత్నం!

చీమలకి సైతం నిత్యప్రయత్నం 
భారీ కాయం సీల్ జంతువు 
కాళ్ళవంటి అవయవాలు లేకున్నా 
కాయాన్ని కదిలించే ప్రయత్నం... 
ఒకచోటు నుండి ఇంకో చోటుకి !!
మనుగడ కోసమే వలస పోయే యత్నం పక్షులది !
దిగుబడి స్వల్పమైనా రైతు 
మలిపంటకి ప్రయత్నం మానడు!
అనుకున్న ఆకారం వచ్చేవరకూ 
శిల్పి ఉలిని వదలడు !
ఆలాపనలో పరిణితి వచ్చేదాకా 
గాయకుడు సాధన వదలడు!
ప్రయత్నం హిమగిరినీ చేర్చగలదు!
సముద్రం లోతును కొలవగలదు!!


కామెంట్‌లు