చెప్పులూ తెలుసా మీకు మీ గొప్పతనం;-- జగదీశ్ యామిజాల
చెప్పుల్లారా!
తెలుసా మీకు మీ గొప్పతనం?

చెప్పుల్లేని మనిషి
బలహీనుడు....

మిట్టమధ్యాహ్నం 
ఉడికించే సూర్యుడి ప్రతాపాన్ని కాదని
ఓ మనిషి 
తారురోడ్డుపై నడవగల సాహసం
చేయగలడా?
అబ్బే, నడక మానుకోవలసిందే
నువ్వు లేకుంటే!

కంకరరాళ్ళూ
ముళ్ళూ నిండి ఉన్న దారిలో
ఈ మనిషి క్షణం 
నడవలేడు నువ్వు తోడ్పడకుంటే

చెప్పుల్లారా 
మీకు ఇంకొక విషయం 
తెలుసా??

ఎదుటివారి పురోగతికోసం 
చెమటోడ్చే మనిషిని
చెప్పల్లే అరిగి తరిగిపోతున్నావు కదరా
అని గంభీరంగా చెప్పి 
మాటలతో సరిపెట్టుకుంటాడు 
ధనవంతుడు

చెప్పుల్లారా!
మీ మీద దుమ్మూధూళీ పడితే 
ఇంట్లోకొస్తే ఏం హాని చేస్తారోనని వాకిట్లోనే 
విడిచిపెడతాడు మిమ్మల్ని ఓ పక్కగా!
తిరిగినంతసేపూ తిరుగుతాడు
మిమ్మల్నేసుకుని ఈ కృతఘ్నుడైన మనిషి!?

మీలాగా 
అహర్నిశలూ కష్టించి
అరిగిపోతున్నట్టు
శ్రమజీవి అలసిసొలసిపోతుంటాడు
అతనిని చూసినప్పుడల్లా
మీరూ గుర్తుకొస్తుంటారు

మిమ్మల్ని
చిన్నచూపుచూసే మనిషిలో 
ఐకమత్యం ఉందో లేదో 
ప్రశ్నార్థకమే కానీ
మీ జత మధ్య ఉన్న ఐకమత్యం 
తలిస్తే
ఆపాటి ఐక్యత 
మాకు లేదే అన్పిస్తుంది
మీ జతలో 
ఒక్కటి తెగితే
మరొకటి పని చేయదు
కానీ 
మనిషలా కాడు
ఎవరి దోవ వాడిదన్నట్టు
పోతుంటాడు
పక్కవాడిని పట్టించుకోడు
అసలు ఆలోచించడు తోటివాడేమైపోతున్నాడో అని!

ఎవరేమనుకున్నా
ఎన్నున్నా
మీరు ఒళ్ళు దాచుకోకుండా
మీ పని మీరు చేసుకుపోతుండటం
చూస్తున్నప్పుడల్లా
నా సోమరితనంమీద 
ఎంత కోపమో తెలుసా
నిజం చెప్పాలంటే
మీరు నాకొక పాఠమే!!
కామెంట్‌లు