రెండు చిట్టికధలు...అచ్యుతుని రాజ్యశ్రీ
 1.చందమామ హఠం!
బుల్లి చందమామ ఆరోజు పున్నమి కావటంతో హాయిగా ఆకాశంలో షికార్లు కొడుతున్నాడు.వెన్నెల్లో భూమి ఎంతో అందంగా కనపడుతోంది.పిల్లలు అంతా చిలోపొలో అంటూ ఆడుతున్నారు. రకరకాల రంగులు డిజైన్లు ఉన్న చొక్కా లు గౌనుల్లో ముద్దు ముద్దుగా ఉన్న వారిని చూశాక చిట్టి చందమామ కి తనకూ అలాంటి దుస్తులు వేసుకోవాలి అనిపించింది. నాన్న దగ్గరికి వెళ్లి అడిగాడు "నాన్నా!ఆపిల్లలు లాగా నాకు చొక్కా తొడుక్కుని తిరగాలి అనిఉంది.కొని పెట్టవూ?" "అరె బాబూ!అసలే ప్రపంచం అంతా కరోనా వైరస్ తో అల్లాడుతోంది.ప్రకృతినికాపాడే పనిలోఉన్నాను.మీ కుట్టిస్తుందేమో అడుగు "అన్నాడు నాన్న. "అమ్మా!నాకు ఎంచక్కా చొక్కా తొడుక్కుని తిరగాలి అని ఉంది. కుట్టించవూ?"తల్లి అంది"నాయనా!నీవు ఒక 15రోజులు పెరుగుతావు.ఇంకో15రోజులు చిక్కిపోతూ మాయం అవుతావు.రోజు రోజుకీ నీసైజు మారిపోతూనే ఉంటుంది. మరి ఏసైజులో కుట్టించాలి?30చొక్కాలు కుట్టే శక్తి ఓపిక నాకు లేవునాయనా!"అమ్మ మాటలు విన్న చందమామ అన్నాడు"పోనీలే అమ్మా!నీవు కష్టపడకు.కోట్లాది భూమి పై ఉన్న పిల్లలను చూస్తూ ఆనందిస్తా!"
2.ఖద్దరు తాను కోరిక!
బట్టల వ్యాపారి దుకాణం లోఖద్దరుతాను ఉంది. కాస్త ఖరీదైనది .మన స్వాతంత్ర్యపోరాట సమయం లో గాంధీజీ పిలుపుతోభారతీయులు ఎవరింట్లో వారు  రాట్నం వడికి  నూలు ఖద్దరు వస్త్రాలు ధరించేవారు.మరి 75ఏళ్ళ క్రితం పరిస్థితులు  మనుషుల ఆలోచనలు మారటం సహజం. ఇప్పుడు రకరకాల రంగులు మిషన్ పై చౌకగా వస్త్రాలు లభిస్తున్నాయి కదా!ఒక రోజు ఆఖద్దరుతానుని చూస్తూ వ్యాపారి బాధపడసాగాడు."అయ్యో!ఈతాను చిల్లులు పడి మాసిపోతే వృధాగా చెత్త కుప్ఫలో పడేయాలి.ఏంచేయాలి?" ఆ ఖద్దరుతాను ఇలా ఓదార్చింది "నీవు బాధపడకు.ఏ వ్యక్తి కీ నేను చొక్కా ధోవతి గామారటం నాకు ఇష్టం లేదు. చేతిరుమాలుగా మారను.చిన్న చిన్న ముక్కలుగా చేసి మూడు రంగుల జెండాలుగా మార్చి  పిల్లలకు ఇవ్వు.ప్లాస్టిక్ జెండా లు వాడుతున్నారు.జాతీయ పతాక నిర్మాత ఆచార్య పింగళి వెంకయ్య తాతను గుర్తు చేసుకుంటూ నాజెండాలు అందరి చేతుల్లో ఎగరాలి."ఆవ్యాపారి దాని సలహాను పాటించాడు.వజ్రోత్సవ శుభవేళ వాటిని జెండాలు గా తయారు చేయించి 15ఆగస్టు కి బడి పిల్లలకి ఉచితంగా ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు.

కామెంట్‌లు