ఆచరణ! అచ్యుతుని రాజ్యశ్రీ
 
ఊరికే నోటి తో చెప్పటంకాదు.చేతల్లో చూపాలి.అప్పుడే ఆవ్యక్తి ఆదర్శప్రాయుడవుతాడు. ఆరోజు పొద్దున్నే అందరూ నల్లాకింద నీళ్లు పట్టుకోవాలని  హడావిడి పడుతున్నారు. బకెట్ తో సిద్ధం గా నించున్నారు లైన్ గా.గజ్జన్ అనేవాడు  హడావిడిగా పరుగులుపెడుతూ బాల్చీతో నీరు పడుతూ భవనంవైపు పరుగులుదీస్తున్నాడు.భుజం పై తువ్వాల చేతిలో ధోవతి లోటా తీసుకుని పెద్దమనిషి  ఒకాయన అతన్ని "బాబూ! నాకో చిన్న బకెట్ నీరు ఇస్తే  స్నానం చేస్తా"అన్నాడు."అబ్బ!నీకు ఏంతొందర!?కాసేపు ఆగలేవా?మేము ఆభవంతిలోకి  నీరు మోయాలి."విసుక్కున్నాడు గజ్జన్. "బాబూ!పోనీ నాల్గు చెంబుల నీరు ఇవ్వు. స్నానం  ఐంది అనిపిస్తాను" "ఏమయ్యోపెద్దమడిసీ! సెప్తే ఇనపడటంలేదా? లోన చాలా మంది పెద్దలు కూచున్నారు.ఈడ జరిగే సభకు వచ్చారంతా! వారందరికీ నీరు అందించాలి.నీకేంటి హడావిడి?"విసుక్కున్నాడు. "సరే నేను కూడా నీకు సాయం చేస్తాలే!"అంటూ ఆపెద్ద మనిషి  బకెట్ వెనక బకెట్ పెట్టి నీరు నింపుతుంటే నౌకరు వాటిని లోపలికి చేరవేశాడు.అన్నిగదుల్లో నీరు నింపాక "హమ్మయ్యా!అలసిపోయాను"అంటూ కూలబడ్డాడు."థాంక్స్ బాబూ!"అంటూఆపెద్ద మనిషి  తనబకెట్ నింపి మోసుకెళ్లి స్నానం చేశాడు. కాసేపటికి సభ ప్రారంభమైంది. స్వయంసేవకులు నేతలకు షర్బత్తు గ్లాసులలో పోసి అందిస్తున్నారు. గజ్జన్ ఉత్సాహం గా అందరికీ ఇస్తూ ఆపెద్ద మనిషిని చూసి విస్తుబోయాడు.అరె!తనకు పొద్దున నీరు నింపి సాయంచేసిన వ్యక్తి! తనని రెండు సార్లు నీరు ఇవ్వమని అడితే తను తిరస్కరించాడు. అక్కడే ఉన్న పండిట్ మదన్మోహన్ మాలవ్యా"ఏంటోయ్!అలా చూస్తావు?ఈయన మన రాజేంద్ర ప్రసాద్!గొప్ప నేత దేశభక్తుడు."అనగానే గజ్జన్  బాబూజీ కాళ్ళపైపడి వలవలా ఏడవసాగాడు.అతనిని లేవనెత్తి గుండెలకు హత్తుకున్నారాయన.అంతసీదాసాదాగా ఆడంబరం పటాటోపంలేని మనతొలిరాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయన తర్వాత చెప్పుకోదగిన వారు లాల్ బహదూర్ శాస్త్రి. దురదృష్టం ఏమంటే ఇలాంటి వాటిని  బడిపిల్లల పాఠ్యపుస్తకాలలో మోరల్ సైన్స్ లో అచ్చువేస్తే వారి గొప్పతనం తెలుస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న చరిత్ర నే మీడియాలో తలాఒక రకంగా చూపుతున్నారు. భావితరాలకు అసలు చరిత్ర తెలీదు ఇంక.

కామెంట్‌లు