తమిళ సినిమాలో మొదటి సూపర్ స్టార్ త్యాగరాజ భాగవతార్, ఆయన సమకాలీన నటుడు పి. యు. చిన్నప్ప ఎవరికి వారే అగ్రనటులుగా ప్రేక్షకాదరణ పొందినవారే. కానీ వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగారు. కానీ ఇద్దరూ కలిసి ఒక నాటకంలో నటించారు. ఆ నాటకం పేరు పవళక్కొడి.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్టే ఇద్దరు అగ్రనటులుకూడా కలిసి నటించడం అరుదైన విషయమే. ఆ ఘనత ఎంజిఆర్, శివాజీలకు దక్కింది. వీరిద్దరూ కలిసి ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఆ సినిమ పేరు గూండుక్కిళి (అంటే పంజరంలోని చిలక అని అర్థం). ఈ ఇద్దరు హీరోలు దాదాపుగా ఒకే సమయంలో వెండితెరకెక్కినవారే. కాస్త అటూ ఇటూ కావచ్చు.
వీరిద్దరూ కలిసి నటించిన గూండుక్కిళి 1954లో విడుదలైంది.
తన సోదరుడు టి. ఆర్. రామణ్ణాను దర్శకుడిగా చూడాలనుకున్న నాటి గ్లామరస్ నటి టి. ఆర్. రాజకుమారి శివాజీ - ఎంజిఆర్ లతో మాట్లాడి ఒక సినిమాలో నటించేందుకు ఒప్పించారు. ఇద్దరూ ప్రముఖ నటులే కావడంతో అప్పట్లో ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. దాంతో రాజకుమారి, రామణ్ణాలు ఈ సినిమా వసూళ్ళపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. కమర్షియల్ గా ఈ సినిమా ఫెయిలైంది.
విడుదలయ్యాక ప్రేక్షకులు ఇది ఎంజిఆర్ సినిమాగానూ లేదని, ఇటు శివాజీ సినిమాగానూ లేదనుకున్నారు. సినిమా మధ్యస్తంగా ఉందనుకున్నారు. ఇద్దరికీ కథ సరిపోలేదని భావించారు రామణ్ణా.
"కథలో కొత్తదనం ఆశించే ప్రేక్షకులు అటంవంట సినిమలు రావడం లేదే అని విమర్శిస్తారు. తీరా ఇలా ఇద్దరు హీరోలను కలిపి సినిమా తీస్తే కొత్తదనం లోపించింది అని పెదవి విరుస్తారు. అదే జరిగింది ఈ గూండుక్కిళి సినిమా విషయంలో" అని దర్శకుడు రామణ్ణా మాట.
గూండుక్కిళి కథా రచయిత విందన్. ఈయన ఆరోజుల్లో ప్రముఖ రచయితలలో ఒకరు. శివాజీ ఇష్టపడిన ఓ అమ్మాయిని పరిస్థితుల కారణంగా ఎంజిఆర్ పెళ్ళి చేసుకుంటారు. దీంతో మనసు విరిగి ఆత్మహత్య చేసుకోవడానికి శివాజీ ప్రయత్నించగా ఎంజిఆర్ శివాజీ ఇంటికి వెళ్ళి ఆయనను తన ఇంట్లో ఉండనిస్తారు.
ఎంజిఆర్ కి శివాజీ ప్రేమ కథ తెలీదు. ఎంజిఆర్ కొన్ని కారణాలతో జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు మిత్రుడి భార్య అనే విషయాన్ని కూడా మరచి హద్దు మీరడానికి శివాజీ ప్రయత్నిస్తారు. ఇటువంటి కథతో సాగినదే ఈ గూండుక్కిళి చిత్రం. ఈ చిత్రంలో రామణ్ణా భార్య బి.ఎస్. సరోజ కథానాయికగా నటించారు.
ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చారు. పాటలూ బాగున్నాయి. ఎం.ఎ. రెహ్మాన్ ఫోటోగ్రఫీ. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, సాంకేతికత ఇలా ప్రతి అంశంలోనూ ఎన్నో ప్రత్యేకతలున్నప్పటికీ ఇవేవీ విజయం సాధించి పెట్టపెట్టలేకపోయాయి.
ఎంజిఆర్ పాత్ర పేరు తంగరాజ్. శివాజీ పాత్ర జీవా. ఊహించని రీతిలో శివాజీ విలన్ పాత్రలో నటించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న శివాజీ అపపటికే మనోహరా వంటి సినిమాలతో తన ఇమేజ్ పెంచుకున్నప్పటికీ ఈ సినిమాలో విలన్ పాత్రలో చూడలేకపోయామన్నారు ఆయన అభిమానులు. నిజానికి అంతకుముందే శివాజీ తిరుంబిప్పార్, అంద నాళ్ వంటి సినిమాలలో శివాజీ విలన్ గా నటించారుకూడా.
ఇద్దరు అగ్రనటులు కలిసి నటించిన సినిమా కావడంతో విడుదలైన తొలి రోజుల్లో ప్రేక్షకులు సినిమా చూడటానికి మొగ్గుచూపారు. కానీ తామూహించినట్టుగా తమ హీరో లేడన్న కారణంగా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో సినిమా ఓటమి చవిచూసింది.
శివాజీ తన జీవిత చరిత్రలో నిజ జీవితంలో నటులకు పలు చెడు అలవాట్లున్నా సినిమాలలో మంచివాడిలా నటిస్తూ రాజకీయాలలో ప్రవేశించి ప్రజల మనసులో సుస్థిర స్థానం పొందాలన్న విషయం నాకప్పుడు తెలీలేదు అని రాసుకున్నారు. నాకు సంబంధించినంతవరకూ విలనా హీరోనా అనేది ముఖ్యం కాదని, నేను నటుడినేగా అనేదే ప్రధానం అని కూడా చెప్పుకున్నారు శివాజీ.
శివాజీకి తర్వాతి కాలంలోనూ ఓ ఓటమి తప్పలేదు. కె. బాలచందర్ దర్శకత్వంలో శివాజీ ఎదిరొలి అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకూడా ఆడలేదు. ఏ ఖారణంగానో ఇది విజయవంతం కాకపోవడంతో వీరిద్దరి కలయికలో తమిళంలో ఇంకొక సినిమా రాలేదు. మరోవైపు ఎంజిఆర్ మాత్రం తన ఇమేజ్ కి భంగు కలిగిస్తుందనుకునిపిస్తే అటువంటి సినిమాలలో నటిఉచనని నిర్మొహమాటంగా చెప్పేసేవారు. కనుక కథ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తారు.
హీరో అనే వాడు ఎప్పుడూ మంచి గుణాలు కలిగి ఉండాలని, మంచి పనులే చేయాలని, చెడు తలపెట్టకూడదనేది ఎంజిఆర్ అభిప్రాయం.
గూండుక్కిళి;-- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి