చెప్పుకోండి చూద్దాం;-యలమర్తి అనూరాధహైద్రాబాద్9247260206
  భారతీ కాన్వెంట్ స్కూల్ లో ఒకటవ తరగతి గది. మాస్టారు రావడం ఆలస్యమైంది.పిల్లలు అంతా కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు.
     ఇంతలో మాస్టారు పుస్తకాలు పెట్టుకునే బల్ల మీద నుంచీ ఎవరో " మా పేరు ఏంటో చెప్పుకోండి?" అన్న మాటలు వినిపించాయి అప్పుడే వాటికి భగవంతుడు మాటలు ప్రసాదించినట్లు. 
    ఎవరా అని పిల్లలు అంతా వింతగా చూశారు. ఏమీ కనిపించలేదు. అవి బల్ల మీద పడుకున్న వల్లా లేచి నిలబడ్డాయి నిటారుగా. చాలా చిన్నగా ఉన్నాయి మాటలు వాటి నుండే వస్తున్నాయి కాబట్టి వాటిని చూడాలని పిల్లలు బల్ల చుట్టూ మూగారు.
   అవి అలా మాట్లాడటం కొత్తగా ఉంది. "చెప్పగలరా ఎవరన్నా?" అని అవి అడిగితే అందరూ తలలు అడ్డంగా ఊపారు.
" అవునా మేము ఎవరో మీకు తెలియదా? మళ్లీ అవి అన్నాయి ఆశ్చర్యంగా.
"ఉహు"అన్నారు పిల్లలు ఈ సారి మళ్లీ.   
      ఇంతలో ఓ తెలివైన కుర్రాడు ఏదైనా "క్లూ" ఇవ్వవచ్చుగా అన్నాడు .
       "సూచనా?"అన్నాయి అవి మళ్లీ.
అదేమిటో పిల్లలకు అర్థం కాలేదు. మరి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు.
ఠెల్లముఖాలు వేసిన వారిని చూసి అవి పకపకా నవ్వాయి.
 "మీ మాతృభాష ఏమిటి?" అని
అన్నాయి.
"తెలుగు" అన్నారు అందరూ ఒకేసారి. 
" మరి అది రాకపోతే ఎలా? మీ అందరూ నేర్చుకోవాలి గా" అన్నాయి మళ్ళీ.
"ఏమో?మమ్మీ,డాడీ ఏమీ చెప్పలేదు అలా" అనటంతో
"అవునా! పోనీలే ఇప్పుడు నేను చెప్తున్నాను.ముందు తెలుగు నేర్చుకోండి.అప్పుడు నేను చెప్పేవన్నీ చక్కగా అర్థం అవుతాయి."అన్నాయి
"సరే!"అన్నారు వారంతా.
   అప్పుడు అవి "ఇలా మాస్టారు లేనపుడల్లా వచ్చి బోలెడు కథలు చెబుతాం" అని మాట ఇచ్చాయి.
"భలే !భలే ! అని  పిల్లలు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.
"ఇంతకీ మా పేరు ఏంటో ఉహించండి!"అన్నాయి వాళ్ళను ఊరిస్తూ.
"ఏదైనా హింట్ ఇస్తే చెప్పేస్తాం అన్నాంగా" అన్నారు నిరాశగా వారిని చూస్తూ.
"సరే. మీరు చిన్నపిల్లలు కదా. మీరు మళ్లీ
 అడిగారు అని చెప్తున్నాం. మేము మట్టి లోంచి పుడతాము.గోధుమ రంగు లో ఉంటాం" "అంటే..ఇంగ్లీష్ లో ఏమిటి"అన్నాడు వారిలో ఒకడు.
 " క్లూ కి మళ్లీ క్లూ ఇస్తారా ఎవరైనా?" అన్నాయి అవి తెలివిగా.
   అప్పటికి పిల్లలకు అర్థమైంది తెలుగు నేర్చుకుంటే గాని ఇవి మాట్లాడే మాటలు పూర్తిగా అర్థం కావని.
" ప్లీజ్! ప్లీజ్!మరొక్క హింట్ ఇవ్వు"అని బ్రతిమాలడటం ప్రారంభించాయి.
"ఇదే చివరిది. మళ్లీ మీరెవ్వరూ
అడగకూడదు."అని షరతు పెట్టి "రోజు మీరు మమ్మల్ని తింటారు.ఆ మాత్రం కనిపెట్టలేరా?"అన్నాయి
    " మేము నిన్ను తినమే. ఫ్రూట్స్  తింటాం" అన్నారు.
     "మీకు తెలియదని ఒప్పేసుకుంటే మా పేరు చెప్పేస్తాం"అన్నాయి అవి.   
    అలా ఒప్పేసుకోవాలని పిల్లలుకి అనిపించటం లేదు. కానీ అదే సమయంలో అవి ఏమిటో తెలియడం లేదు. ఏం చెప్పలేనట్లు అలా నిలబడిపోయారు.అలా నిలబడ్డ వాళ్ళని చూస్తే వాటికి జాలేసింది.
" మీరు తెలుగు నేర్చుకుంటాను అన్నారు కదా.అందుకని బహుమతిగా మీరు చెప్పకపోయినా గెలిచినట్టుగా మేము భావిస్తూ చెప్పేస్తున్నాం. సరేనా!" అనగానే
" నిజంగానా?" అన్నారు వారంతా ఆనందంగా.
"ఆ!"అన్నాయి అవి.
"అయితే చెప్పండి! చెప్పండి!" అన్నారు వాళ్ళంతా ఉత్సాహంగా.
"మేము.. మేము.. అని వారిని కాసేపు ఊరించి 'మేము వడ్లగింజలం. పొలంలో రైతులు మట్టిని తవ్వి మమ్మల్ని నాటితే మేము పుడతాం. వాటిని దంచితే  బియ్యం గింజలు గా మారుతాం. వాటిని నీళ్ళల్లో ఉడకపెడితే మీకు అన్నం వస్తుంది."
"ఆ..అవునా..!"అని తెల్లబోయారు పిల్లలంతా.
మరి వారికి బియ్యం బాగా తెలుసు.కానీ వడ్ల గింజలు తెలియవుగా.
దానితో ఆ రోజు వాళ్ళకి అమ్మా నాన్నలు చెప్పని వ్యవసాయం గురించి కూడా తెలిసిపోయింది.


కామెంట్‌లు