కులూదేవత! అచ్యుతుని రాజ్యశ్రీ

 తరతరాలుగా హిమాచల్ ప్రదేశ్ లో వాడుకలో ఉన్న వాస్తవ గాధ ఇది! కొన్ని వందల ఏళ్ళ క్రితం అప్పటి కులూరాజు జగత్ సింహ్ అన్నివిధాల ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. మంచి బుద్ధి విచక్షణ గలవాడు. ఒక సారి రాజు కి ఓవిషయం తెలిసింది. తనరాజ్యంలోని ఓ  బ్రాహ్మణుని వద్ద ఒక అమూల్య రత్నం ఉంది అని. ఇంకేముంది?భూపతి తనుకాబట్టి  అది తనకేచెందాలనే పట్టుదల తో బ్రాహ్మణుని తన దర్బార్ కిరమ్మని కబురంపించాడు. దేవుని ముందు తప్ప ఎవరిదగ్గరకు వెళ్లి తలవంచని ఆత్మాభిమానం గల ఆయన రాజదర్బారుకు రాలేదు.రాజు కి కోపంవచ్చింది.రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవా? "ఆఅమూల్య రత్నం తీసుకుని రాకపోతే నీకు కఠిన శిక్షవిధిస్తాను"అని రాజు శాసించాడు.రాజు దగ్గర అవమానం పొందేబదులుప్రాణత్యాగం పొందటంమేలు అనుకున్నాడు.వెంటనే తన ఇంటికి నిప్పు అంటించి కుటుంబంతో సహా అగ్ని కి ఆహుతి ఐనాడు.ఆరోజు రాజు భోజనం చేయటానికి కూచోగానే కంచంనిండా పురుగులు కనపడినాయి.నోట మెతుకు పెట్టుకోలేకపోయాడు.ఇంకో అన్నంకంచంలో కూడా లుకలుకలాడుతూ పురుగులు కనపడినాయి.ఆరోజు అంతా తిండి లేక బాధపడ్డాడు. అది అంతటితో ఆగలేదు. ఇలా రోజు జరగటంతో రాజు ఖంగారు పడినాడు.చేసిన పాపం ఊరికే పోదుగా!జ్యోతిష్కులను సంప్రదించాడు."ప్రభూ! మీకు బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది."అన్నారు వారంతా. "మరి దీన్ని ఎలాపోగొట్టుకోవాలి?"ఖంగారు గా అడిగాడు.  "రాజా! అయోధ్య నించి  ఏదైనా ఆలయంనించి రామవిగ్రహం తెప్పించి మీరాజ్యాన్ని ఆవిగ్రహానికి అప్పగించి దైవం పేరు మీదుగా పరిపాలన చేయండి. అప్పుడు బ్రహ్మ హత్యాపాతకం పోతుంది. "
 రాజు వెంటనే అయోధ్య కి ఓపూజారిని పంపాడు ఓరామ విగ్రహాన్ని తెమ్మని.అక్కడి పూజారి "ససేమిరా  నాగుడిలోని విగ్రహాన్ని ఇవ్వను పో"అన్నాడు.కానీ కులూ పూజారి ఎలాగో ఆవిగ్రహాన్ని తీసుకుని పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది. కులూ అయోధ్య పూజారుల మధ్య మాటలయుద్ధం జరిగింది. చివరికి ఒప్పందానికి వచ్చారు.విగ్రహాన్ని మధ్యలో ఉంచి దాన్ని ఎత్తే ప్రయత్నం చేశారు. అయోధ్య పూజారి ఎత్తబోతే విగ్రహం అస్సలు కదలలేదు.కానీ కులూ పూజారి చేత్తో పట్టుకోగానే తేలికగా చేతిలోకి వచ్చింది.ఇక స్వయంగా దేవుడే ఒప్పుకుంటే  చేసేది ఏంఉంది?కులూ లో ఆవిగ్రహాన్ని ప్రతిష్ఠించి రాజు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.అప్పటి నుంచి సకలదేవతలు కులూ లో నివాసం ఉంటున్నారు అని అక్కడి జనం నమ్మకం. దసరాలో తమపూజలు గైకొంటారని వారు నమ్ముతారు. అందుకే  మనదేశం భిన్నత్వంలో ఏకత్వం గా చరిత్రలో స్థానం సంపాదించింది.
కామెంట్‌లు