నిదానం ప్రధానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఊరిపెద్ద మహాకోపిష్టి! పెద్ద కొడుకు చెప్పే మాటలు పట్టించుకోకుండా విసుక్కుంటూ ఉండేవాడు.అందుకే దత్తుడు  తల్లికి చెప్పి వేరే చోటికెళ్లి తనకాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు.తల్లి అతనిచేతికి బంగారు నాణాలు ఉన్న  చిన్న మూట ఇచ్చి అంది
"నాయనా!ఎందుకు మీనాన్న సంగతి తెలిసి ఎదురు తిరిగావు? జాగ్రత్త!ఎక్కడ ఉన్నా జాగ్రత్త గా మసలుకో!అందరినీ గుడ్డిగా నమ్మకు" "అమ్మా! నాన్న ప్రతివారితో పోట్లాడుతాడు.అన్యాయం అక్రమపనులు చేయటం నాకు నచ్చదు.అందుకే నాకాళ్ళ పై నేను నిలబడుతా"అని తల్లి కి చెప్పి గుర్రం పై బైలుదేరాడు. ఆఅడవిలో చిన్న కుటీరం కనపడితే అక్కడ ఆగాడు. ఓసాధువు తన ఇద్దరు శిష్యులతో నివసిస్తున్నాడు.బాగా దాహంగాఉంది.కొన్ని బంగారు నాణాలు సాధువుకి ఇచ్చి తన కథ వివరించాడు."నాయనా!నీకు మూడు విలువైన మాటలు చెప్తాను. అవి నిజమైన బంగారు నాణాలు. నీవు ఎవరింట్లో నైనా నిద్ర పోవాలనుకుంటే మంచంపై దుప్పటిని బాగా దులుపుకో.నీదగ్గరున్న బట్టని  మంచంపై పరుచుకో.ముక్కుమొహంతెలీనివారి వద్ద  ఏమిపెట్టినా తినవద్దు.మన దగ్గర డబ్బు దస్కం ఉంటేనే ఎవరైనా ప్రేమ కురిపిస్తారు.ధనంమూలం ఇదంజగత్."దత్తుడు ఆయన ఆశీస్సులు అందుకుని బైలుదేరాడు. ఆరాత్రి  దూరంలోఉన్న ఒక గుడిసె కనపడటంతో అక్కడ నిద్ర పోవాలనుకున్నాడు.అందులో ఒక అవ్వ ఉంది.
ఆమె ఓమాయలమారి.అలసిన దత్తుడు "అవ్వా!ఈరాత్రికి పడుకోటానికి చోటుఇవ్వు"అని పది మొహిరీలు ఆమె ఎదుటే మూట లోంచి తీసి ఇచ్చాడు. ఆమెకళ్లు తళుక్కుమన్నాయి.గబగబా ఆపక్క గదిలోకి పోయి మంచంవాల్చి "అక్కడ పడుకోనాయనా!"అంది.దత్తుడు సంశయిస్తూనే ఆగదిలో అడుగు పెట్టగానే అవ్వ  తలుపు కి గొళ్లెం పెట్టబోయింది.ఠక్కున ఆమె చేయి పట్టి గదిలోకి గుంజి మంచంపై దుప్పటిని తీసి ఆమెపై కప్పాడు.దుప్పటిపై మత్తు కలిగించే ద్రావకం చల్లిన అవ్వ తనగోతిలో తానే పడింది  .స్పృహ కోల్పోయిన ఆమెను  మంచంపై పడుకోబెట్టి గదికి గొళ్లెంపెట్టి  నిశ్చింతగా నిద్ర పోయాడు దత్తుడు. సాధువు చెప్పిన తొలి మాట పాటించాడు.బాగా తెల్లారగానే  గుర్రంపై పయనం సాగించాడు. కరకర ఆకలి వేస్తోంది. దూరంలో ఓఇల్లు పొలంమధ్య కనపడటంతో దత్తుడు అక్కడికెళ్లాడు.ఓస్త్రీ ఇద్దరు పురుషులున్నారు. ఆమె దోసెలు పోస్తుంటే  వారు తింటున్నారు. "అమ్మా!నాకూ దోసెలు వేసివ్వు."అని రెండు బంగారు నాణాలు ఆమె ముందు పెట్టి  మొహం కడిగి వచ్చేప్పటికి దోసెలు సిద్ధంగా ఉన్నాయి.కానీ సాధువు మాటలు గుర్తు వచ్చాయి. కొత్త వారు ఇచ్చే ఆహారం తినవద్దు అని. అందుకే  వాటిని పొట్లం కట్టి గుర్రం పై కూచుని దౌడు తీశాడు. కొంతదూరం పోయాక ఒక దోసె ముక్కను అక్కడ కనపడ్డ కుక్కకి వేశాడు.అది ఆబగాతిని స్పృహ కోల్పోయింది.ఆమె మత్తు మందు కలిపి బాటసారులను దోచే ముఠాది అని  ఆఇద్దరు  మగవారు ఆమెకు అనుచరులు అని తెలిసిపోయింది. ఆనగరం చేరి తన బాబాయి ఇల్లు చేరాడు. తండ్రితో వచ్చిన గొడవగూర్చి చెప్పాడు. "బాబాయ్!ఈబంగారు వరహాల మూట లో కేవలం ఇరవై మాత్రమే మిగిలాయి"అని దారిలో తన అనుభవాలు చెప్పాడు. అదిచూసిన పిన్ని "నేను ఆమూటను దాచిపెడతాను"అని తీసుకుని  ఓరెండురోజులు కమ్మగా తిండి పెట్టి ఆదరించింది.ఆమరునాటి నించి తనకు ఒంట్లో బాగా లేదని ముసుగు తన్నింది.తన దగ్గర ఎర్రని ఏగానిలేదు.బాబాయి భార్య చేతిలో కీలుబొమ్మ అని గ్రహించిన దత్తుడు  ఆఊరిలోనే ఉన్న  తన బాల్య మిత్రుడు శ్రీపాదుని కలిశాడు.అతని సాయంతో ఆనగరపెద్ద వద్ద  ఉద్యోగం సంపాదించి నగరాభివృద్ధి కి పాటుపడి మంచి పేరు సంపాదించాడు.ఆశ్రేష్ఠి తన కూతురుని దత్తుడికి ఇవ్వాలి అని సంకల్పించాడు.కాబోయే అల్లుని తో వారి ఊరుకి వచ్చాడు.అప్పులు అహంకారంతో  తండ్రి అందరిచేత ఛీ ఛీ అనిపించుకుని చనిపోయాడుఅని తెలుసు కున్నాడు దత్తుడు. తల్లిని తన బాల్య మిత్రుడు పోషిస్తున్నాడు అని తెలుసు కుని  ఆమెని కలిశాడు.శ్రేష్ఠి కూతురు తో దత్తుని పెళ్లి అని తెలుసు కున్న ఆతల్లి మురిసిపోయింది. తల్లిఆరోజు  ఇచ్చిన బంగారు నాణాలమూట ఎలా ఆధారంగా మారింది  సాధువు మూడు మాటలు ఎలా తను పాటించిఉన్నత స్థితిలో ఉన్నాడో తల్లి కి  వివరించాడు.మిత్రుని కుటుంబం  తల్లిని తీసుకుని కాబోయే మామగారితో కలిసి నగరంచేరిన దత్తుడు పెళ్లి కొడుకై తల్లి ఆశీస్సులు పొందాడు.ఆమెను ఆదరంగా చూస్తూ తల్లి ఋణం తీర్చుకున్నాడు.🌹
కామెంట్‌లు