గీతా వాణి: విశ్వ రూప దర్శనము!"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67౦98
 👌విభూతులను దాల్చిన
   
     విశ్వ రూపుడ వీవె!
     విశ్వేశ్వరా! హరా!
           శ్రీశివా! కేశవా!
 👌సహస్ర శీర్షుడ వైన    
       పురుషోత్తముడ వీవె!
       జగన్నాధా! హరీ!
             శ్రీశివా! కేశవా!
        
           ( శ్రీ శివ కేశవ పదాలు., శంకర ప్రియ., )
👌పరమేశ్వరుని యొక్క విరాట్ రూపమును దర్శించిన, అర్జునుడు.. ఈ విధముగా ప్రార్ధించు చున్నాడు.
👌పరమేశ్వరా! జ్యోతి స్స్వరూపా! నీ దేహ గేహము నందు సమస్త దేవతలను, స్థావర జంగమాత్మక మగు సకల ప్రాణి కోటిని చూచు చున్నాను. అట్లే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను,  దివ్యులైన మహర్షులను, సర్పములను దర్శించు చున్నాను!
👌ఓ విశ్వేశ్వరా! అనేకములైన బాహువులతో, ఉదరములతో, వక్త్రములతో, నేత్రములతో... విలసిల్లుచున్న, అనంతమైన నీదు స్వరూపమును దర్శించు చున్నాను. ఈ విశ్వ రూపమునకు.. ఆదియు, మధ్యము, అంతములను తెలుసుకొన లేకున్నాను!" అని, ప్రస్తుతిoచు చున్నాడు అర్జునుడు
🚩 "పశ్యామి దేవాన్...!" అని, మరియు, "అనేక బాహూదర....!" అని
 ( 11.విశ్వ రూప దర్శన యోగము.. 15వ. 16.వ. శ్లోకము లందు ) పరమేశ్వరుని ప్రార్ధించాడు!
  🙏విశ్వ రూప ప్రార్ధన
       ( తేట గీత పద్యములు )
       ⚜️వేల్పులను గంటి, నీ మేన వివిధ జంతు
      
       సంతతుల గంటి, వారిజాసనుని గంటి,
        కమల లోచన! ఋషులను గంటి, దివ్య
          ఫణుల గంటిని,   వాసుకి ప్రముఖు లెల్ల !!
⚜️ పెక్కు చేతులు, బొజ్జలు, ముక్కులును, ము
       ఖములు, కన్నులు గల నిన్ను గంటి స్వామి!
      పాప భంజక మీ విశ్వ రూపమునకు,
      ఆది మధ్యాంతములు కాననైతి దేవ!
      ( గీతాదర్శము., 'తెనుగు లెంక' తుమ్మపల్లి సీతారామ మూర్తి., )


కామెంట్‌లు