తిక్క శంకరాయి ౼ శాంతి, 9.9.1959--అరవై ఏళ్లనాటి బాలల కథలు..10(సేకరణ: డా. దార్ల బుజ్జిబాబు)

  అనగనగా ఓ తిక్కవరం. ఆ ఊళ్ళో ఓ శంకరాయి. వాడు వాళ్ళమ్మానాన్నలకు ఏకైక పుత్రుడవడంవలన చాలా గారబంగా పెంచుకుంటున్నారు. వాడు చిన్నప్పటినుండి కూడా అందరిలా కాకుండా విచిత్రంగా పనులు చేసేవాడు. వాడు చిన్నగా వున్నప్పుడు వాళ్ళమ్మ " మా అబ్బాయికి తెలివిపాలు కొంచెం జాస్తిఅయి అట్లా చేస్తాడు" అనేది. కాని వాడు పెద్దయాక కూడా విపరీతపు పనులు చేస్తూండేసరికి వూరు వాళ్ళంతా 'తిక్క శంకరాయి అనే బిరుదిచ్చేశారు.
       శంక రాయికి వాళ్ళమ్మ రోజు చక్కగా నవ్వారు మంచం మీద పరుపు వేసేది పండుకోవడానికి. ఆదేమో కాస్త కదిలినప్పుడల్లా కిర్రుమనే రకం. నేను కదిల్తీ అది ఎందకు కిర్రుమంటుందో అని చాలా ఆశ్చర్యపోయేవాడు. "అది మనకు అర్ధంకాని మంచాల భాష అయ్యుండాలి. పిచ్చుకలు, మేకలు, అన్నిటికీ మనకర్ధంకాని భాషలున్నట్లుగానే ఈ మంచాలకూ వుంది కాబోలు" అనుకున్నాడు శంకరాయి.
       అలా కొన్నాళ్ళయ్యాక వాళ్ళమ్మ ప్రొద్దుటే నిద్ర లేచేసరికి  శంకరుడు మంచం క్రింద గుర్రు కొడుతూ కన్పించేవాడు. మొదట్ల నిద్రలో దొర్లి పోయాడేమోననుకుందిగాని నాలుగు రోజులు వరుసగా మంచం క్రింద కన్పించే సరికి "ఏమిట్రా నేలమీద నిద్రపోతున్నావు"  అని అడిగేసింది. "అమ్మా! మరేమో ఆ మంచం నన్ను  మొయ్యలేక కాస్తోకూస్తో కదిలేసరికి కిర్రుకిర్రుమని ఏడుస్తుంది. అందుకని నాకు బాగా జాలేసి  క్రింద పడుకుంటూన్నాను" అన్నాడు వాళ్ళమ్మ "నా నాయన కెంత జాలి గుండో" అనుకుందిగాని నలుగురుకితెలిస్తే నవ్విపో తారని మర్నాటి నుండి వేరే మంచం వేసింది.
          ఏ దొంగవాడినా యింట్లోకి వస్తే వుపయోగంగా వుంటుంది కదా అని విలువిద్య నేర్చుకుందా మనుకున్నాడు శంక రాయి. గొడ్లను మేపే పిల్లలంతా వెదురు పుల్లతో తలో విల్లు కట్టుకుంటూవుంటే తానూ ఒకటి కట్టుకున్నాడు. 'ఇరవయ్యేళ్లు నెత్తిమీద కొచ్చి యిప్పుడీ బాణాలేవిట్రా' అనేస్తుందేమో అమ్మ అని బాణాలు వేసుకోడానికి వూరిబయట పొలాల్లోకి వెళ్ళాడు. అక్కడో గాడిద కన్పించింది. వెంటనే ఒక దంటు పుల్లను గురిచూసి గాడిద మీదకు వదిలాడు శంకరాయి. కాని అదిపోయి పొలాన్నుండీ ఇంటికి పోతున్న రెడ్డికి తగిలింది. ఆ రెడ్డికి వీడిసంగతి బాగా తెలుసు. కాబట్టి, కోపం చేసుకోకుండా “ఏరా శంకరాయీ! నీకు గురి బాగా కుదిరినట్లుందే, సరిగా నా మీద కే బాణం వదిలావూ" అన్నాడు. “అయ్యయ్యో మీమీదికి నేను బాణం వేస్తానా? గాడిద మీదకు పోవే అని వదితే మీరు గాడిదలాగా వున్నారనుకుందో ఏమో మీకు తగిలింది. ఈ పుల్ల ఇట్లా చేస్తుందని నాకేం తెలుసూ" అన్నాడు శంకరాయి దీర్ఘం తీస్తూ  "నన్ను గాడిదంటావట్రా'అని శంకరాయి వీపుచక్కగా చదును చేశాడు రెడ్డి వళ్ళుమండి.
        శంకరాయి వాళ్లమ్మ ఓ రోజున వూరికాచివరనున్న వడ్రంగి దగ్గర్నుండి ముక్కాలి పీట తెమ్మన్నది. సరేనని వెళ్లాడు శంకరుడు. పీట తీసుకుని కొంతదూరం వచ్చేసరికి కాళ్లు నొప్పు లెత్తాయి. పీటనుదించి తాను దాని కెదురుగా కూర్చున్నాడు. కాస్త నిదానించి పీటకేసి చూచేసరికి దానికి మూడుకాళ్లున్న విషయం గమనించాడు. అప్పుడా పీటతో ఓ మోసకారిపీటా, నాకు రెండు కాళ్ళేనాయే, నీకేమో మూడు కాళ్ళున్నాయి' కదా నా చేత మాయించు కోవడం నీకు న్యాయం కాదు. జరిగిందేదో జరిగిపోయింది. కాని ఇహనైనా నీవు నడిచి ఇంటికి రా త్వరగారా. నీవు ముందో నేను ముందో ఎవరు బంగారోచ్చి' అంటూ గబగబా యింటికెళ్లి పోయాడు.
          వెళ్లగానే వాళ్లమ్మ 'పీట యేది రా' అన్నది. శంకరయ్య చాలా ఆశ్చర్యంగా
“ ఏమిటీ అదింకా యింటికి రాలేదూ?. మూడు కాళ్ళున్నాయికదా అదే ముందుగా వచ్చేసి వుంటుందనుకున్నానే. పందెం కూడా వేసుకున్నాము"  అన్నాడు. వాడిని నాలుగు తిట్టేసి వాళ్లమ్మే వెళ్లి పీటను తెచ్చుకుంది. ఆ పీట పెట్టిన చోటనే అట్లే వుందిగాని కొంచెం గూడా ముందుకు నడవ లేదట. "నన్ను తిట్టించడానికే అదట్లా చేసింది"  అంటాడు శంకరాయ్. మీరేమంటారు.
    (ఆంధ్ర  - వారపత్రిక, 9.9.1959)
★★★★★★★★★★★★★★★★
కామెంట్‌లు