కుళ్ళుబుద్ధి! అచ్యుతుని రాజ్యశ్రీ

 లోకం లో రకరకాల మనుషులు!విభిన్న రుచులు. కొంతమందికి తాము ఒక్కరే గొప్ప ఇతరులని అణగదొక్కాలి అనే నీచబుద్ధి ఉంటుంది. మర్రిచెట్టు లా తామే విస్తరించాలి వేరే వారి కి అవకాశం ఇవ్వరాదు అనేది చాలా తప్పు. పిల్లలకి ఇలాంటి బుద్ధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం బాగుపడాలి. ఇతరులకీ చేయూత నిచ్చిప్రోత్సహించాలి.అందరూ సర్వనాశనమై తను తనవారు అనే శాడిజం పనికిరాదు.అది ఒక మానసిక రోగంలా మారుతుంది. మరి ఈకథలో కుటిలుడి కపటం ఎలా తన మెడకే చుట్టుకుందో చూద్దామా?స్వార్థం కాస్త క్రూరత్వం మిళాయించిన స్వభావం వాడిది. చిన్నప్పుడు బాటపై వెళ్లే జంతువులపై రాళ్లు వేసి కొట్టడం కుక్క పిల్లలని బంతిలా ఎగరేసి ఆడటం చేసేవాడు. పెద్ద ఐనాక ఇరుగుపొరుగుతో పోట్లాడి నోరు పారేసుకోవటం అతని నైజంగా మారింది. ఓరోజు రాత్రి తన పొలంకి చేతిలో లాంతరుతో బైలుదేరాడు.ఒక చేతిలో కర్రకూడా ఉంది. అతని వెనకాల ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారు. కుటిలుడికి వారి నీడలు కనపడితే దొంగలు ఏమోనని భయపడ్డాడు. కానీ వారు అమాయకపు కూలీలు.నెత్తిన తట్ట పార పెట్టుకొని వెనుక లాంతరు వెలుగులో నడుస్తూ ఉన్నారు. "బాబూ!మీదీపం వెలుగులో మేము హాయిగా తొందరగా అడుగులు వేయగలుగుతున్నాము.దేవుడే మీరూపంలో మాకు దారి చూపుతున్నాడు"అని మెచ్చుకున్నారు. "హత్తెరీ!నేను డబ్బు ఖర్చు పెట్టి కిరసనాయిలు కొని లాంతరులో నింపి వెలిగించాను.పైసా ఖర్చు లేకుండా నాదీపంవెలుగులో మీరు నడుస్తున్నారా?నాకు చెరో పదిరూపాయలు ఇవ్వండి. "కుటిలుడి వాదనతో వారు బిత్తరపోయారు."అదేంటి బాబయ్యా! మీరు వెళ్లే పొలంవైపే మేము వెళ్లాలి.పగలంతా చాకిరీచేసి అలసిపోయాం.రోజూ మేము నడిచే దారి మాకు కొట్టిన పిండి. ఊరకుక్కలు వెంటబడుతాయి.అవి కరిస్తే సూది మందు వేయించుకోవాలి.అందుకే  మాకు మీ వెలుగు ర క్ష" అంతే !కుటిలుడు వారికి  దీపం వెలుగు ఎందుకు చూపాలని ఠక్కున లాంతరు గ్లాసుని పగలగొట్టి వత్తిని ఆర్పాడు.కూలీలు గబగబా అతనిని చీకటి లో దాటుకుంటూ ముందు కి వెళ్లటం ఆలస్యం కుటిలుడు ధబ్ మని ఓగొయ్యిలో పడి "అమ్మా!చచ్చానురా దేవుడా!"అని గావుకేక వేశాడు.ఆఇద్దరూ గబగబా వెనక్కి వచ్చి  గుంటలోంచి అతని ని  బైట కి లాగారు. కాలికి వీపుకి బాగా దెబ్బలు తగిలాయి.పావుకిలో మీటరు దూరం లో ఉన్న ఊరికి నడవలేని స్థితిలో ఉన్న కుటిలుడిని ఒకడు తన భుజాలపై ఎక్కించుకుంటే రెండో వాడు అతని తట్టను మోశాడు.ఆపల్లె ఆయుర్వేదం డాక్టర్ కి కుటిలుడిని అప్పగించి తమదోవన తాము వెళ్లారు.కుటిలుడి లో పశ్చాత్తాపం దు:ఖం పొంగివాగులై ప్రవహించింది.అంతేమరి!ఒకరికి సాయంచేయాలి కానీ నావల్ల ఇంకోడు బాగుపడకూడదు అనే బుద్ధి మంచిది కాదు సుమా 🌷
కామెంట్‌లు