ఫిజీ ద్వీపంలో ఉత్సవం!; -అచ్యుతుని రాజ్యశ్రీ

 మన దేశంలో కణకణమండే నిప్పులపై నడుస్తారు దేవుని మొక్కు చెల్లించుకోవాలని.అలాగే ఫిజీ ద్వీపంలో బెకా అనే ప్రాంతంలో నివసించే ఆదివాసీలు ప్రతిఏడూ ఓ ఉత్సవాన్ని ఉత్సాహంగా చేసుకుంటారు.ఆమరుగుజ్జు వేలుగాడికి తమకృతజ్ఞతలు అర్పిస్తారు.దాని కథాకమామీషు తెలుసుకుందామా? ఒకానొక గ్రామంలో ఓతాత పిల్లలకి కథలు కబుర్లు కాకరకాయల్తో వారిని  బాగా అలరించే వాడు.అలా వీనులవిందుగా బహుపసందుగా కథలు చెప్పటంకూడా ఓకళయే సుమా! ఆపిల్లలు ఇచ్చే డబ్బుతో తన బతుకు వెళ్లదీయసాగాడు.ఆరోజు పిల్లల తో బాటు ఓయువకుడు కూడా కథ విన్నాడు.తాత కి తనదగ్గిర ఉన్న నాణాలు ఇచ్చి ఇంటికి వెళ్తూ అనుకోసాగాడు" సరే!రేపు ఆతాతకి ఇవ్వటానికి డబ్బు ఎలా సంపాదించాలి?" ఆచిట్టడవిలో ఓప్రాణి సరాసరా పాకుతూ కనపడింది. అది పాము కనుక ఐతే దాన్ని పట్టి  పాముల్ని ఆడించేవాడికి అమ్మితే కొంత డబ్బు వస్తుంది అని ఆలోచించాడు.దాని వెనకే పరిగెత్తాడు. అది ఓ గుహలోకి జారుకుంది.ఆకుఅలములున్న కుప్పలో దూరింది.యువకుడు ఆకుప్పని పెళ్లగించాడు.హఠాత్తుగా  అందులో ఓబుల్లి ఇల్లు   అక్కడే కూచున్న ఓవేలుగాడు కనపడ్డాడు.
: "ఏయ్ చిట్టి పొట్టి బొట్టిగాడా!ఆపాము ఇక్కడే ఆకుల కుప్పలోకి చరచరా దూరటం చూశాను. దాన్ని ఎక్కడ దాచావో చెప్పకపోతే నిన్ను నాచేతులతో నలిపిపడేస్తాను."ఆవేలుగాడు వినయంగా అన్నాడు "అయ్యా!ఇక్కడ పాము గీము ఏమీలేదు. పాతాళ దేవత అనుగ్రహం తో నేను కోరుకున్న రూపాన్ని ధరించగలను.నన్ను చంపకు.నీకు కావాల్సినది ఇస్తాను ". "సరే నాకు చావులేకుండా వరం ఇవ్వు." "ఇదిగో అబ్బాయ్!నీతో పాటు నీపల్లెవాసులందరికీ ఓగొప్ప బ్రహ్మాండ శక్తి ఇస్తాను. కణకణమండే నిప్పుల పై  ఎంచక్కా మీరు నడవగలరు.కాలికి ఎలాంటి బొబ్బలు ఎక్కవు."అంతే! వేలుగాడు మాయమైనాడు.ఆయువకునిలో ఏదో కొత్త  ఉత్తేజం శక్తి వచ్చాయి. వెంటనే అతను  ఆగుహలోంచి బైట కొచ్చాడు. తన పల్లెవాసులకి  ఆశక్తి  వచ్చిందో లేదో అని పరీక్షించాలనుకున్నాడు.ఊరిబైట ఓపెద్ద గొయ్యి తవ్వాడు.దానిలో కట్టెలోవేసి నిప్పు పెట్టాడు. ఊరంతా తరలి వచ్చింది.ప్రతి ఒక్కరూ ఆనిప్పుపై నడిచారు.ఎవరికీ ఏమీకాలేదు.అప్పటినుంచి  ఫిజీవాసులకి అది ఒక వేడుకగా మారింది. 🌹
కామెంట్‌లు