పుస్తకమా నీవెక్కడ?;-మంజీత కుమార్-బెంగళూరు
ఓ పుస్తకమా!
ఎటు కనుమరుగయ్యావు?
ఏమైపోతున్నావు?

ఆలోచనల అక్షర సాగరంలో పుట్టి
భావ అమృత జల్లులు కురిపించి
అంతులేని మనో వికాసాన్ని అందించి
ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి
అక్షరాస్యుల హస్త భూషణమై
అవధులు లేని ఊహలకు రెక్కలు కట్టి
నేడు కనిపించవేం?

టెక్నాలజీ ఉచ్చులో చిక్కుకుని
సెల్ ఫోన్ మాయలో ఇరుక్కుని
పుస్తకపఠనాన్ని మరచిన నేటి తరానికి
నీ విలువ ఏం తెలుసు?

ఏవీ అలనాటి మధుర జ్ఞాపకాలు
అరలో అందంగా పేర్చిన పుస్తకాలు
చదువుకున్న వారికి చదివినంత
జ్ఞానాన్ని పంచే సాధనాలు
మనసులో పదిలమైన అక్షరాలు

మరోసారి పుస్తక ప్రపంచంలోకి అడుగుపెడదాం
చక్కని పుస్తక తోటలో హాయిగా విహరిద్దాం
భావి తరాలకు తరగని నిధిని అందిద్దాం
పుస్తకాలకు గత వైభవాన్నీ తీసుకువద్దాం
చదువుదాం
చదివిద్దాం




కామెంట్‌లు