పక్క వాటాలో ఓ చిన్నోడు. పేరు తనీష్. వాడు నాలుగు భాషలు మాట్లాడతాడు. ఇంగ్లీషు, ఒరియా కొంచెం కొంచెం. తెలుగు, హిందీ బాగా మాట్లాడతాడు. రెండు భాషలలో రాస్తాడు. ఇప్పుడిప్పుడే తెలుగులో అఆలు తెలుసుకోవడం కోసం మా ఇంట్లోకొస్తుంటాడు పెన్నూ పేపరూ పట్టుకుని. అఆల అక్షరమాల పుస్తకం కొనిద్దామనిపించి ఓ బుల్లి పుస్తకం తీసుకున్నా. అది చూస్తుంటే నేను ఆరో ఏట చదివిన ఒకటో తరగతి తెలుగు పుస్తకం గుర్తుకొస్తోంది. స్కూలుకి వెళ్ళడానికి ముందరే ఇంటి దగ్గర అమ్మ పలకమీద అఆలు రాసిస్తే వాటిపైన దిద్దక వాటిని చూసి కింద రాస్తూ నేర్చుకున్నాను తెలుగు అక్షరమాలను. ఈ విధంగా నాతో బలపం పట్టించిన తొలి గురువు నాకు మా అమ్మే. రెండక్షరాల మాటలూ మూడక్షరాల మాటలూ నేర్పిందీ అమ్మే. అదలా ఉండనిస్తే...ఇప్పుడీ అక్షరమాల పుస్తకం చూస్తుంటే ఎంత ముచ్చటేసిందంటే మళ్ళా చిన్నవాడైపోయి అఆలురాద్దామా ఒకటో క్లాసు చదువుదామా అన్నంత ఆశ కలిగింది. ఒకటో తరగతి డిగ్రీ వరకూ ఎట్లా ప్యాసయ్యానో తలచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. కారణం, నేనెప్పుడూ సగటు లేదా సగటుకన్నా తక్కువ మార్కులతోనే ప్యాసవుతూ వచ్చాను. ఎందుకో చదువుమీద ఆసక్తి ఉండేది కాదు. ఒక్కటేంటంటే ఎక్కడా ఫెయిలవలేదు. అదొక్కటే ఆనందం. అంతకన్నా నేను నా చదువుసంధ్యల గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. కానీ ఏ ముహూర్తాన మొదటిసారిగా అచ్చులో నా పేరు చూసుకున్నానో అప్పటి నుంచి ఈరోజు వరకూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను. నేనెవరికీ తెలియకపోయినా నా వరకూ నాకు తెలిసిన నాలుగు ముక్కలూ రాయగలుగుతున్నానంటే అందుకు కారణం మా అమ్మ నాతో పట్టించిన బలపమే. అందుకే అమ్మకెప్పుడూ పాదాభివందనమే.
ఇది చూస్తుంటే మళ్ళీ చదవాలని ఆశ;-- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి