పిల్లా ఓ పిల్లా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
\ఊసులాడుతావా పిల్లా
ఉసూరుమంటావా పిల్లా
ఉత్సాహపరుస్తావా పిల్లా
ఊదరగొడతావా పిల్లా

చిరునవ్వులు చిందుతావా పిల్లా
చిటపటలు ఆడుతావా పిల్లా
చక్కలిగిలి పెడతావా పిల్లా
చిక్కులలోకి  నెడతావా పిల్లా

దగ్గరకొస్తావా పిల్లా
దూరంగాపోతావా పిల్లా
తన్మయత్వపరుస్తావా పిల్లా
తరిమిపారేస్తావా పిల్లా

ప్రేమిస్తావా పిల్లా
ద్వేషిస్తావా పిల్లా
వయ్యారాలు ఒలికిస్తావా పిల్లా
విరహంతో వేదిస్తావా పిల్లా

ఏటొడ్డుకు వస్తావా పిల్లా
నట్టేట్లో ముంచుతావా పిల్లా
గోడువెళ్ళబోసుకుందామా పిల్లా
గీసులాడుకుందామా పిల్లా

పాటలుపాడి పరవశింపజేస్తావా పిల్లా
ఆటలాడి అవతలకుగెంటేస్తావా పిల్లా
మాటలు చెబుతావా పిల్లా
మూతిని ముడుస్తావా పిల్లా

పెళ్ళిచేసుకుందామా పిల్లా
గోలపెట్టుకుందామా పిల్లా
కొత్తకాపురం పెడదామా పిల్లా
వ్యర్ధజీవితం గడుపుదామా పిల్లా

చేయీచేయీ కలుపుకుందామా పిల్లా
చెట్టాపట్టా లేసుకుందామా పిల్లా
అందాలు చూపిస్తావా పిల్లా
ఆనందము కలిగిస్తావా పిల్లా

రావేరావే పిల్లా
రయ్యనిరావే పిల్లా
తోటకురావే పిల్లా
తోడుకురావే పిల్లా


కామెంట్‌లు