కున్నైక్కుడి వైద్యనాథన్ సంగతులు;-- యామిజాల జగదీశ్
 ఆయనను స్ఫురణకు రావడంతోనే నాకు కనిపించేది నుదుట విబూదిపై పెట్టుకున్న పెద్ద బొట్టు. తర్వాతది ఆయన పలికించే వయొలిన్ నాదం. ఒకటి రెండు సార్లు కచ్చేరీలో చూసినట్టు గుర్తు. అలాగే రేడియోలో ఆయన వయొలిన్ కచ్చేరీ ప్రసారమైతే విన్నాను. త్యాగరాజు ఆరాధన ఆయన సారథ్యంలో జరిగినప్పుడు బుల్లితెరపై కన్నాను....ఆయనే సుప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు పద్మశ్రీ కున్నైకుడి వైద్యనాథన్. 
1935 మార్చి రెండున తమిళనాడులోని శివగంగై జిల్లా పరిధిలోని కున్ డ్రైక్కుడిలో రామస్వామి శాస్త్రి, మీనాక్షి అమ్మయార్ దంపతులకు జన్మించారు. తండ్రి సంగీత విద్వాంసులు. వేణువు, గిటార్, మృదంగం, వయొలిన్ వంటి వాయిద్యాలను వాయించేవారు. తండ్రి దగ్గరే వైద్యనాథన్ పాడటం నేర్చుకున్నారు.
షణ్ముగనాథపురం పాఠశాలలో ప్రాథమిక విద్య కానిచ్చాక తండ్రి నిర్వహించిన షణ్ముగ విద్యాశాలైలో సంస్కృతం చదువుకున్న వైద్యనాథన్ అన్నయ్య గణపతి సుబ్రమణ్యం. ఈయన సంగీత విద్వాంసుడు. ఆయన సోదరీమణులు సుబ్బులక్ష్మి, సుందర లక్ష్మి 'కున్నైకుడి సిస్టర్స్' గా కర్ణాటక సంగీత కచ్చేరీలు చేశారు. ఒకమారు వీరి కచ్చేరీకి వయొలిన్ కళాకారుడు రాలేదు. కారణం అడిగితే "ఎందుకూ...మీ ఇంట్లో చివరి సంతానాన్ని కూడా వయొలిన్ విద్వాంసుడిని చేసెయ్యాల్సిందిగా" అన్నారట హేళన స్వరంతో. ఆ మాటను సవాలుగా తీసుకున్న తండ్రి ఎనిమిదేళ్ళ వైద్యనాథన్ కి వయొలిన్ చేతపట్టించి నేర్పించారు.
ఎంతో శ్రద్ధగా అంతకన్నా ఎక్కువ భక్తితో వయొలిన్ పాఠాలు నేర్చుకున్న వైద్యనాథన్ పన్నెండో ఏట మొదటీసారిగా ఓ సంగీత కార్యక్రమంలో వయొలిన్ వాయించినప్పుడు తండ్రి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. 
అరియక్కుడి రామానుజ అయ్యంగారుకి పక్క వాయిద్యంగా వయొలిన్ వాయించడాన్నే వైద్యనాథన్ అరంగేట్రంగా భావించేవారు.
ఆరంభంలో సేమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మహారాజపురం సంతానం, శూలమంగళం సిస్టర్స్, శీర్కాళి గోవిందరాజన్ తదితరు కచ్చేరీలలో వయొలిన్ వాయించిన వైద్యనాథన్ 1976లో ఆయన ఒక్కరే వయొలిన్ సంగీతాన్ని ప్రధానంగా వాయించారు. 
తిరువయ్యారు త్యాగబ్రహ్మం మహోత్సవ సభకు 28 ఏళ్ళు కార్యదర్శిగా ఉండిన ఆయన తమిళనాడు ఇయల్ ఇసై నాటక మండ్రానికి అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు.
రాగాల పరిశోధన కేంద్రాన్ని స్థాపించి సంగీతంలో వ్యాధులను నయం చేసే విషయమై పరిశోధనలు చేసారు.
ప్రముఖ డోలు విద్వాంసుడు వలైయపట్టి సుబ్రమణ్యంతో కలిసి మూడు వేలకుపైగా కచ్చేరీలు చేసిన వైద్యనాథన్ తోడి రాగం వాయించడంలో దిట్ట. 
తమిళ భక్తి సంగీతానికి ఎనలేని సేవ చేసిన వైద్యనాథన్ 1969లో "వా రాజా వా" అనే సినిమాకు మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు.ఆ తర్వాత దైవం, అగత్తియర్, తిరువరుళ్, తదితల సినిమాలకు కూడా ఆయన సంగీతం సమకూర్చారు. తిరుమలై తెన్కుమరి సినిమాకు సంగీతదర్శకత్వం వహించినప్పుడు ఆయనకు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం లభించింది.
ఆయన. 1983లో సొంతంగా ఒక సినిమా నిర్మించారు. ఆ చిత్రం పేరు  "తొడిరాగం" (1983). ఇందులో శేషగోపాలన్ ప్రధాన పాత్ర పోషించారు. 
కున్నైకుడి వైద్యనాథన్ కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించారుకూడా.
ఇసై పేరరిజ్ఞర్, సంగీత నాటక అకాడమీ, సంగీత కళాశిఖామణి, కళైమామణి, పద్మశ్రీ వంటి అనేక అవార్డులు అందుకున్న వైద్యనాథన్ వయొలిన్ పై కొత్త కొత్త ప్రయోగాలు చేశారు.ఆయన వయొలిన్ మాట్లాడుతుంది. పాడుతుంది. కర్నాటక సంగీతం, లలిత సంగీతం, సినీసంగీతంతోపాటు పక్షుల కూతలను, జంతువుల అరుపులను, ప్రకృతి శబ్దాలను ఆయన వయొలిన్ పై వాయించేవారు.
కర్నాటక సంగీతం తెలియని వారుకూడా ఆయన సంగీతాన్ని ఆస్వాదించగలరు. 
ఆరుదశాబ్దాలకుపైగా తమ సంగీతంతో ప్రేక్షకులను రంజింపచేసిన వైద్యనాథన్, చెన్నైలోని పోరూర్‌లో గల రామచంద్రా ఆసుపత్రిలో 2008 సెప్టెంబర్ 8వతేదీ రాత్రి తొమ్మిది గంటలకు గుండెపోటుతో మరణించారు. 
కామెంట్‌లు