కార్డు ముక్క;- ప్రమోద్ ఆవంచ 7013272452

 తాటి కమ్మల పేద డాబా చూరు నుంచి
జారీపడిందో కార్డు ముక్క
ఏళ్ళు గడిచిపోయాయి...
జ్ఞాపకాల పొరల్లో స్నేహ బంధం ఉత్సాహంతో
తెరుచుకుంది మనసు రెప్ప.
నాలుగు దిక్కుల చతురస్రాకారం రూపం
 నాలుగు మూలలను చెదలు తిన్నాయి
ఎడమవైపు ఊరూ,తేదీలను సగం కొరికేసిన 
ఎలుకలకు,ప్రియమైన మిత్రుడికి అన్న అక్షరాలు   కూడా ఆహారమయ్యాయి.
అందమైన అక్షరాలు అంతే అందంగా రాసాడు
మిత్రుడు
పత్తి పెన్నులో నీలి ఇంకు పోసి,రాసిన 
ఇక్కడ అంతా క్షేమం...
అక్కడ నువ్వు కూడా క్షేమమనీ తలుస్తాను..అన్న
అక్షరాలు వెలిసి పోయాయి
అయినోళ్ళు,చుట్టపోళ్ళు, దోస్తుల నుంచి వచ్చి చేరిన
ఉత్తరాలను ఇనుప సీకుకు కుచ్చి, తాటాకు చూరుకీ
గుచ్చటోళ్ళం.
దులిపితే దుమ్ముతో తెగ తుమ్ములొచ్చేవి
చూరు పంటి వాననీళ్ళు గారి కార్డు మీద అక్షరాలు
కనబడకుండా పోయేవి.
అక్షరాలలో స్నేహ బంధం, కల్మషం లేని మనసు పరుచుకునేది ఆ కార్డు ముక్కులో!
పోస్టు మాన్ రాజయ్య, పోస్ట్ మాస్టర్ ఆమదలి 
ఈ ఇద్దరే దూరంగా ఉన్నోళ్ళ నుంచి మంచి, చెడు
ఉత్తరాలను మోసుకొచ్చేది
టెలిగ్రామ్ వచ్చిందంటే గుండెల్లో గుబులు పుట్టేది
మసకేసిన చీకటి కొత్త కథను భయంతో చెప్పేది
ఇంటింటికో చరిత్ర,ఉంది.చదువుతుంటే,అక్షరం
కన్నీళ్లు పెట్టుకునేది.
అందమైన తీపి జ్ఞాపకాలను తట్టి లేపిందీ కార్డు
ముక్క.
అందులో వుండే విషయం ఎప్పుడూ సశేషమే!
ఇప్పుడేవీ ఆ పోస్ట్ కార్డులు,ఆ ఇంగ్లాండ్ లెటర్లు
ఆ టెలిగ్రాంలు....
ఆదరణ కోల్పోయిన ఆ సంస్థ కథ సమాప్తం
అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
                          
కామెంట్‌లు