గుర్తుకొస్తున్నాయి-- ఎ.పి.ఎస్ .పి.లో సినీమా;-- సత్యవాణి 8639660566
 ఎ.పి.ఎస్ .పి. సినీమాలు. నిజంగా మాకు  ఎప్పటికీ మరచిపోలేని ,మధురమైన అనుభూతులే మిగిల్చేయి..
      కొన్ని సంవత్సరాల క్రిందట ,బహుశా కలర్ టీ.వీల్లో విస్తృతంగా ఛానల్స్ రానిక్రితం మా కాకినాడలోవున్న ఎ.పి.ఎస్.పి. మూడవ బెటాలియన్  ఓపేన్ గ్రౌన్డులోని ,ఓపెన్ దియేటర్లో ప్రతీ శనివారం రాత్రి తెలుగు సినీమాలు వేసేవారు.ఆ సినీమాలు బెటాలియన్ వారికోసం వేసినా, నాకు తెలిసీ చుట్టుపక్కల పది పదిహేను గ్రామాలనుంచి ఆ సినీమాలు చూడడానాకి జనాలు విపరీతంగా వచ్చేవారు. సినీమాకి వెళ్ళే టప్పుడు అంతజనం ఎప్పుడు వెళ్ళేవారో  ,ఎలా వెళ్ళేవారో తెలియదుకానీ, సినీమా అయిపోయి విడిచిపెట్టేకా వెనక్కి వారివారి గ్రామాలకు వెళ్ళేవారిని చూస్తుంటెే,"హమ్మో ఇంతజనమమా ?ఇసకేస్తే రాలకుండావుంది."అని ఆశ్చర్యంగా వుండేది. మాకాకినాడలోటౌన్లో అప్పట్లో పద్నాలుగో, పదిహేనో సినీమా దియేటర్లు వుండేవి. అలా అన్ని దియేటర్లుా ఒకే వీధిలోవుండడం అరుదు.అందువలన దాన్ని సినీమాహాళ్ళవీధి అనిపిలుస్తారు ఇప్పటికీ,సినీమా హాళ్ళన్నీ షాపింగ్ మాల్స్ ,కళ్యాణమండపాలూ అయిన,ఆ పదిహేను దియేటర్లనూ ఆరోజుల్లో ఒకేసారి వదిలిపెట్టినా అంత జనంవుండరు ఏపి ఎస్ పి సినీమాచూడ్డానికి వచ్చినంతమంది జనంముందు.రోడ్డు క్లియర్ అవ్వడానికి గంటకు పైగా సమయం పట్టేది.బస్సులూ ,లారీలూ హారన్స్ కొట్టినవి కొట్టినట్టుండేవి, ఆ రద్దీలో ఇరుక్కుపోయి కదలడానికి కుండేదికాదు .పిల్లలు తప్పిపోతుండేవారు ,ఆ జనంలో.తల్లులు ఆర్తనాదాలు చేస్తూ,పిల్లలను పేర్లు పెట్టి  పిలుస్తుండేవారు.అంతా జాతర్లలోలా కోలాహలంగా వుండేది రోడ్డంతా ఆసమయంలో.
      శనివారం సాయంత్రం మా ఇంటికి ఎవరైనాచుట్టాలు ,స్నేహితులు వస్తే, సినీమాకి వెళ్ళడం ఎక్కడ మానెయ్యవలసివస్తుందో వీళ్ళవల్ల అని గుండెలు పీచుపీచుమనెేవి .అలావచ్చినవారివల్ల సినీమా మిస్సైపోకుండా,వారినికూడా మావెంట సినీమాకు తీసీకొని పోయేవారం.అలా ఆ ఓపేన్ గ్రౌడులో సినీమా చూడడమన్నది వచ్చినవారికి కూడా బాగానచ్చడంవలన ,వారు మళ్ళీ మళ్ళీ  ఏ.పి.ఎ స్,పి  సినీమాకు రావడమే కాకుండా,మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ బంధువులనూ స్నేహితులనూ వెంటబెట్టుకు తీసుకొనివచ్చేవారుకూడా  ఏ.పి.ఎ. పి సినీమాకి  టౌన్ నుంచి..పైగా సినీమాలకు గ్రేడింగులిచ్చి,ఆ సినీమా డబ్బులిచ్చి  హాలులో చూడక్కర్లేదు. ప్రీగా ఏ.పి. ఎస్ .పిలో చూసెయ్యొచ్చు అనేసుకొనేవారు చాలామంది.
    ఏ శనివారం ఏ సినీమాలు  వేయాలో  ఏ.పి.ఎస్ .పి క్వార్టర్స్ లోని కినిస్టేబుల్స్ కిచెందిన ఆడంగులు  సినీమా లపేరులున్న లిష్ట్ చూసి నిర్ణయించేవారనుకొంటా.వారిలో ఎక్కువమందికి ఏ సినీమా నచ్చితే ఆ సినీమా ఆ శనివారం ఆసినీమాను వేసేవారు.
     ఆ ఓపెన్ ప్లేస్ లో ఆడియన్స్ సిట్టింగ్  అరేంజ్ మెంట్స్ గురించి తప్పక చెప్పాలి.
      ఏ.పి.ఎస్ .పి బెటాలియన్ గ్రౌడ్ లో  ప్రాథమిక పాఠశాలతోపాలటుగా అతిపెద్ద హైస్కూల్ వుండేది. అప్పటికి కాకినాడలో, నారాయణాలు,శ్రీచైతన్యాలు,ఆదిత్యాలు లేనందున ఆ ఏ.పి.ఎస్ .పి హైస్కూల్లో వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు చుట్టుప్రక్కల ఊర్లనుంచి కూడావచ్చి  చదువుకొనేవారు. మా ప్రభాకర్ ,సాయీ కూడా ఆ స్కూల్లో చదువుతుండేవారు.
    శనివారం వేసే సినీమాకోసం,సాయంత్రం హైస్కూల్ వదిలిపెట్టగానే,పొలోమంటూ సినీమావేసే గ్రౌడ్ లోకెళ్ళి,అక్కడవున్న ఇసుకను తమబంధువులూ,స్నేహితులూ రాత్రి సినీమాకు వచ్చి కూర్చుని సినీమా చూడడానికి దిబ్బలు  దిబ్బలుగా చెేసేవారు.తమాషా ఏమిటంటే,వారిపెద్దలు సినీమాకు వచ్చినప్పుడు,ఎవరు పోగుపెట్టిన ఇసుకగుట్టలమీద వారి బంధువులనూ స్నేహితులనే కూర్చోపెట్టెేవారు. .అంతగ్రౌడ్ లో ,అదరు జనాలమధ్యన ,వారు వాళ్ళ వారికోసం ఎక్కడ ఇసుక గుట్టపెట్టేరో ఆ చీకటిలోకూడా గుర్తుపట్టగలగడం ఒక గొప్పవిషేషం.
     ఇక శనివారం పొద్దు పోయేకా సినీమాఅంటే, ఆ మధ్యాహ్నంనుంచీ హడావిడే ఇంట్లో..శనివారంకనుక పెందరాళే టిఫిన్ల్ చేసుకొని తినేసి,ఆరుగంటలయ్యేసరికే సినీమాకి సిధ్ధమైపోయేవాళ్ళం.సినీమాకెళ్ళేసమయానికి చుట్టాలెవరూ దిగబడకూడదని వెయ్యిదేవుళ్ళకు దణ్ణాలు పెట్టుకొనేవాళ్ళం. ఎన్ని దణ్ణాలెట్టినా ,ఒకొక్కప్పుడు  చటుక్కున ఎవరో ఒకరు సరిగ్గా సమయానికి తయారయ్యేవారు.వచ్చినవాళ్ళు ఎప్పుడెళతారురా దేవుడా! అని అన్యమనస్కంగా వారితో మాట్లాడుతూ వారిని తొందరగా పంపించడానికి చూసేవారం. బాగా దగ్గరచుట్టాలైతే, సినీమాకి రమ్మని కూడా తీసికొనిపోయేవారంకూడా.
     ఎక్కడ సినీమా మొదలైపోతుందోనని ఆదరాబాదరాగా హడావిడి పడుతూ నడిచి వెళ్ళి,మా పిల్లలు మాకోసం పోగుజేసిన ఇసుకదిబ్బలను వాళ్ళుచూపిస్తే, హమ్మయ్య అంటూ కూలబడడానికి లేదుకదా!కూలబడితే ఇసుకదిబ్బ కూలిపోతుందికనుక, నెమ్మదిగా జాగ్రత్తగా కూర్చొనేవారం .
    అయితే మొత్తం సినీమాకి వచ్చే అన్నివెెేలమంది పిల్లలూ ఏ.పి.ఎస్ .పి స్కుల్లో  చదవరుగదా! అలాంటివారంతా చాపలో ,గోనెసంచులో,బరకాలో,దుప్పట్లో చంకల్లో పెట్టుకు తెచ్చుకొని వేసుకొని కూర్చొనేవారు.చాలామంది తినడానికి ఏవైనా కరకరలూ,ఫరఫరలూ ,మరచెంబులతో మంచినీళ్ళూకుడా తెచ్చుకొనేవారు సినీమాకు.                          ఎప్పుడెప్పుడు రీలువస్తుందా?ఎప్పుడెప్పుడు కమాండెంట్ దొరవారొస్తారా?అప్పుడెప్పుడు  సినీమావేస్తారా? అనుకొంటూ కళ్ళుకాయలుకాసేలా ఎదురు చూస్తూంటే, కమాండెంట్ దొరగారూ,వారి ఫామిలీ వస్తేకానీ సినీ మా మొదలు పెట్టరుకనుక.. దూరంనుంచి ఏ జీపులైట్లు కనిపించినా,"అదిగో దొరగారొచ్చెేస్తున్నారు .అంటూ సరిగ్గా సర్దుకొని కూర్చుంటే,అది మరో ఆఫీసరుగారి జీపుఅయ్యేది.అలా అదిగో వచ్చేస్తున్నారు,ఇదిగొ వచ్చేస్తున్నారు దొరగారంటే,దొరమ్మగారెప్పటికో తీరిగ్గా మేకప్పైనాకా,వందిమాగదుల్లా,కానిస్టేబుల్స్ వెంటనడవగా,దొరగారూ భార్యా జీపుదిగి,'రాజువచ్చె -రవితేజములదరగ'అన్నట్లు వచ్చి,వారికోసమని వేసిన మెత్తని సోఫాల్లో ఆసీనులైయ్యేకా సినిమా మొదలుపెట్టేవారు.దొరగారితోపాటుగా వివిధరకాల కేడర్లలో పనిచేసే ఉన్నతోద్యోగులకి కూడా వారిస్థాయికి తగినట్లు సిట్టింగ్ అరేంజ్ మెంట్లు వేసేవారు.
     తమాషా ఏమిటటే,ఆటమొదలైయ్యేదాకా ,సినీమాఏంటో తెలియదు.చిన్న క్లూకూడా మాలాంటి బయటవాళ్ళకు తెలియదు.బహుశా వాళ్ళలో కూడా చాలామందికి సినీమా ఏమిటో తెలియకపోవచ్చు.
   ఆలస్యంగా ఆటమొదలవ్వడానికి మరోకారణం,కాకినాడ టౌన్లో, ఇక్కడవేసే మొదటిరీలు అక్కడ ఆడేసాకా, ఏ.పి.ఎస్ .పి  కానిస్టేబుల్స్ వేనుమీద వెళ్ళి,ఆరీలు తెచ్చి వెేసెేవారు.
       ఇకసినీమా మొదలైయ్యేవరకూ,అది ఏ.ఎన్ ఆర్ దో-ఎన్ .టి .ఆర్ వాడిదో-,కృష్టదో-,చిరంజీవిదో-మరెవరిదో  తెలియదు. సినిమా మొదలవ్వగానే,  సంతోషతో వేసే విజిల్స్ తో గ్రౌడు మారుమోగిపోయేది .అయితే మంచి సస్పెన్స్ లోవుండగా .పావుగంటకూ,పావుగంటకూ పెద్ద బ్రేకు వచ్చేది.ఎందుకంటే,ఆడేసిన 'రీలు' ఇచ్చెేసి,తరువాత రీలు కాకినాడ టౌన్లో ఏసినిమాహాల్లోనుండో తేవాలిగదా మరి.
      వేసవికాలంలో, చల్లని పిల్లగాలులు వీస్తుంటే,ఓపేన్ గ్రౌడ్ లో ఇసుకతిన్నెలమీద కూర్చొని,పైనవున్న చందమామ వెన్నెలకురిపిస్తుండగా, ,మనకిష్టమైన హీరో, హీరోయిన్ల సినీమాలు చూడ్డంమంత మహాభాగ్యం మరొకటుందా  అనిపించేది అప్పట్లో."ఏమిహాయిలే యిలా"అని మనసు పాడుకొనేది.
      సీనీమాలో విలన్ హీరోను కొట్టినప్పుడు,"చొచ్చొచ్చొ"అనే శబ్దాలు విషాదసూచికంగా వినిపిస్తే, హీరో విలన్ని తన్నినప్పుడు,""తన్ను,బాగాతన్ను, దంచికొట్టై వెధవని "అటూ ఉత్సాహంతో ఆడియన్స్   జనాలు ఊగిపోయేవారు.మా సాయైతే, విలన్ హీరోను కొడుతుంటే, "ఇప్పుడేమంతుందమ్మా? మరిప్పుడెలాగమ్మా? ఇప్పుడు వాడు చంపేస్తాడా అమ్మా?"అంటూ ఎక్కడ హీరోను నిజంగా విలన్ చంపేస్తాడోనని తెగ భయపడిపోయి,నా ఒడిలోకొచ్చి,కళ్ళుమూసేసుకొని కూర్చొనేవాడు.హీరో విలన్ ని తంతున్నాడు చూడు అని చెప్పెదాకా కళ్ళు విప్పేవాడెేకాదు.
     అలా ఇష్టగా, సీరియస్ గా సినీమా మేము చూస్తున్నప్పుడు, హఠాత్తుగా వాన చినుకులు  పడడం మొదలు పెట్టగానే,అదెేదో సినీమాలో బ్రహ్మానందంలా, ముందుజాగ్రత్తకలవాళ్ళు తెచ్చుకొన్న గొడుగులు చటుక్కున తీసి చిటుక్కున వేసేసుకొంటే,వెనకాలవాళ్ళకి సినీమాకనపడక, "దించండి గొడుగులు దింపండి,దింపండి" అంటూ వెనకాలవున్నవాళ్ళు గోలగోలచెేసేవారు. మరీ వర్షం ఎక్కువైతే,సినీమా ఆపేసి,మర్నాడు అదే సినీమా ,ముందురోజు  ఎక్కడాగిపోయిందో అక్కడనుంచి మళ్ళీ వెేసేవారు.అంటే మాకు ఆదివారంకూడా సినీమా హడివిడే అన్నమాట. నిన్నటితరువాయిభాగం ఎక్కడమొదలైపోతుందోనని చచ్చే కంగారు పడి వెళ్ళవలసివచ్చెేది..ఒకొక్క సందర్భంలో మంచిసినీమా  మధ్యలో వర్షవల్ల కనుక ఆగిపోతే, మూడు నాలుగు రోజులు అదెసినీమాను వేసిన సందర్భాలుకుడావున్నాయి. . కొన్నిరోజులతరువాత  కమాండెంట్ దొరవారు మారి వేరెవారు వచ్చినప్పుడల్లా,ఆ వచ్చిన దొరగారి మార్క్ కనబడాలని, రకరకాల ఆర్డర్ ర్లు వేసేవారు.అలా వచ్చిన ఒకకమాంన్ డెంట్ దొరవారొకరు "బయటవాళ్ళను సీనీమాకు రానీయకండి " అని ఆజ్ఞాపించారు. అంటే ఓన్లీ,బెటాలియన్ కి సంబంధించినవాళ్ళే సినీమాకి రావాలి అని.అదీ ఆ ఏ.పి. ఎ. పికీ సంబంధించిన నంబరు చెబితేనే రానిచ్చేవారు.  మా ఇంట్లో అద్దెకనిదిగి,మా సొంతమనిషిలామారిపోయిన మా మరదిగా చేదోడువాదోడుగావుండే, ఏ.పి.ఎస్ .పి కానిస్టేబుల్ పున్నంరాజు కామేశ్వర్రావు వున్నాడుకనుక మాకు,మాచుట్టాలు బంధువులకు సినీమాకు ఎలావెళ్ళాలన్న సమస్యలేదు ఆయన నంబరు చెప్పి లోపలకు వెళ్ళెవాళ్ళం.
         ఒకసారి మా వీధిలోవుండే పోష్ట్ మాష్టారి పిల్లలు పాపాయి,నాని ,శ్రీను వాళ్ళూకూడా మాతోపాటే వచ్చెేవారు సినీమాకు ... ఒకసారి ఒక తమాషాజరిగింది.శనివారం సినీమాకి మాతోపాటు బయలుదేరి వచ్చేరు పాపాయీవాళ్ళు. బెటాలియన్ గేటుదగ్గరవుండే గార్డ్ లు ,ఎవరితాలూకు,నెంబరు చెప్పండి  అన్నారు.మేము మా కామేశ్వర్రావు నంబరు చెప్పేము.పోష్ట్ఋమాష్టారి  నాని తడుముకోకుండా ఏదో నోటికి వచ్చిననంబరు చెప్పాడు.అది తమాషాగా ఆ అడిగిన గార్డ్ నంబరే. అతడు నవ్వేసి",బాబూ!అది నానంబర్ " అన్నాడు. నిజానికి పాపాయీవాళ్ళూ,ఏ. పి.ఎస్ .పి.కి చెందిన పోష్ట్ మాష్టారి పిల్లలే.ఆ విషయంచెపితే, "అయితే మీరు వెళ్ళవచ్చు ,వెళ్ళండి "అని లోపలికి పంపించాడు. అప్పటికింకా పోష్టాఫీసు ఏ.పి.ఎస్ .పిలో కట్టలేదు.మావీధిలోనే వుండేది.
     అయితే చాలామంది సినీమాప్రియులు , ఏ..పి.ఎస్ .పి గ్రండ్ కి మూడుపక్కలా వున్న ఫెన్సింగ్ లోంచి దూరి చక్కావచ్చేసేవారు.
     ఆవిషయం కనిపెట్టిన దొరవారు అలా జనం రాకుండా,అక్కడకూడా బందోబస్తు ఏర్పాటు చెసేసేకా బయట జనం రావడం మానేసేరు. అంతమందితో కూర్చుని సినీమాచూసేకిక్కు లేక మేముకుడా వెళ్ళడంమానేసాము.ఈలోగా,కలర్ టీ.వీలు చూడగలిగినవాళ్ళకు చూడగలిగినన్ని సినీమాలూ ఇళ్ళలోవుండే చూసే అవకాశం వచ్చింది.
     ఆరోజుల్లో అందరాకీ సినీమాలంటే అంత ఇష్టముండేది. ఒక్కవారం సినీమా చూడకపోతే ఏదో వెలితిగా వున్నట్లుండేది.అడపాతడపా మంచి సినీమాలొస్తే, టౌన్ కెళ్ళి క్యూలలో నిబడి,కష్టపడి టికెట్  సంపాదించి చూసేవాళ్ళం.
   ఇప్పుడు టౌన్ కెళ్ళి సినీమాలు చూడడంమాట అటుంచి ఇంట్లో 'చెరువంత' టీ.వీ వున్నా, రోజు మొత్తంలో అన్ని చానల్సూ కలిపి నలభైఐదు,ఏభై సినీమాలు వేస్తున్నా, ఒక్కటంటే సీనీమా కూడా చూడాలని కోరికెే వుండటంలేదు.'పెరుగుట విరుగుట కొరకే' అన్నమాట నిజమై కూర్చుంది సినీమాలవిషయంలో.  మా వయసువారికైతే,పాతరోజుల్లోని,పాతసినిమాలను మళ్ళీ మళ్ళీ తలచుకొంటూ ,వాటిల్లోని పాటలను బాత్ రుమ్ముల్లో పాడేసుకోవడమే బాగుంది.
          

కామెంట్‌లు