చెప్పుడు మాటలు!అచ్యుతుని రాజ్యశ్రీ

 కొంత మంది తమమాటలగారడీతో ఎంచక్కా బురిడీ కొట్టించి మనల్ని చిక్కుల్లో పడేస్తారు. కాస్త పొగడగానే మనం ఉబ్బితబ్బిబ్బు కారాదు.కొత్త వారి మాటలవలలో పడితే ఇంతే సంగతులు! నక్క మాటలకుబోల్తాపడిన పులి ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నదో చూడండి. గుహలోని పులికి  వయసు మీద పడటంతో కాస్త తెలివితక్కువది కూడా! అడవికిరాజైన పులి వెన్నంటి ఉంటూ ఆనక్క దానిని ఊదరగొట్టేది." రాజా!మీకు నీడలాఉండి మీమంచిచెడ్డలన్నీ విచారిస్తాను.మీపాదాలచెంత ఇంత చోటు ఇవ్వండి" అని నమ్మబలికింది.పులి తను వేటాడిన జంతువులో కొంతభాగాన్ని నక్క కోసం ఉంచేది.ఇంకేముంది?కొద్ది రోజుల కే నక్క బాగా బలిసి బద్ధకంతో సోంబేరుగామారింది. ఒక రోజు రాజు రధంపై పోవటం చూసింది నక్క. రెండు బలమైన గుర్రాలు నిగనిగలాడుతూ దౌడుతీస్తున్నాయి.ఎలాగైనా గుర్రం మాంసం తినాలి అనే కోరిక  దానిలో పెరిగింది.అంతే బాగా ఆలోచించి పులిచేతనే గుర్రాన్ని చంపించాలి అని నిశ్చయించుకుంది."పులి రాజా! రాజు గారి గుర్రాలు మన అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ మేస్తున్నాయి.ఓక గుర్రాన్ని చంపి మీప్రతాపం చూపండి  దాని రుచి చూడండి. " పులి కూడా తన తడాఖా చూపాలని గుర్రం పై లంఘించింది.బాగా గుర్రాన్ని గాయపరిచింది.నక్క సాయంతో దాన్ని చంపి కొంత నక్కకోసం అట్టిపెట్టింది."రాజుకన్నా పులి రాజు మీరేమిన్న"అని  తెగపొగిడి పులిని పూర్తిగా  మూర్ఖురాలిగా మార్చింది.ఆమర్నాడు కూడా పులి ఇంకో గుర్రంని చంపటంతో రాజు వేటగాడిని ఆదేశించాడు"బంగారంలాంటి నాగుర్రాల్ని పొట్టన పెట్టుకున్న  ఆపులిని చంపు"అని. పులిని బాణాలతో గాయపర్చి  నిస్సహాయంగా ఉన్న తరుణంలో దాన్ని బల్లాలతో కుళ్ళబొడిచాడు."నక్కా! ఏంటి నిక్కి నిక్కి చూస్తున్నావు? ఇతని బారినుండి నన్ను కాపాడవూ?" అని పులి బావురు మన్నది.నక్క చెప్పిన జవాబు ఏమిటో తెలుసా?"నామాటల్ని ఎందుకు నమ్మావు? నీ ఖర్మ!నీవు అనుభవించి తీరాల్సిందే!"అని తుర్రుమని పారిపోయింది.అందుకే  మనం బడిలో  రోడ్ పై వెళ్ళేటప్పుడు కొత్త వారిమాటలు నమ్మి బోల్తా పడకూడదు. మనం మోసపోయి బలిఅవుతాం🌷
కామెంట్‌లు