ప్రతిభకు పట్టం కడదాం...;-విష్ణు ప్రియ-కలంస్నేహం
పచ్చని ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన, స్వేచ్ఛా వాతావరణంలో...
సమాజానికి దూరంగా సద్గురువుల సేవలో
ఆశ్రమ పాఠశాలలో ఆనందంగా
క్రమశిక్షణతో సాగే విద్య...

ఆంతర్లీనమైన సృజనాత్మకతను వెలికితీస్తూ...
ఎన్నో కళలను నేర్పేది....
సకల విద్యావంతుడుగా నిలిపేది..

అవన్నీ అంతరించి నేడు...
కేవలం పుస్తకాలలోని పాఠాలనే బట్టీ పద్దతిలో అభ్యసిస్తూ
ర్యాంకులకై పోటీపడుతూ స్వేచ్ఛ కరువై పంజరంలో చిలుకలా మారి....

తనకిష్టమైనది కాక పెద్దల ఆదేశానుసారం చదువుతూ..
కొందరు ఉన్నత స్థితికి చేరినా...
వృత్తిపట్ల నిబద్ధత లేక కాసుల సంపాదనలో మునిగినవారెందరో!

నిమ్నస్థితిలో ఉండి ఎంతో జ్ఞానమార్జించిన వారిని,
పైకి రానీయని స్వార్థ పరుల కోరల్లో చిక్కి...
నలిగిపోయే చదువు బిడ్డలెందరో!
డబ్బులేక విద్యకు దూరమైన మట్టిలో మాణిక్యాలెందరో!!

కొనుక్కునే చదువులు కాక...
కులమతాలకు అతీతమై...
ప్రతిభకు పట్టం కట్టిన నాడే...
నిజమైన జ్ఞానసంపన్నులు నైతికతతో కూడిన మానవత్వపు విలువలు కలిగిన సమసమాజ స్థాపన చేయగలరు...


కామెంట్‌లు