కోయిల రాకకోసం ..!!>డా.కె.ఎల్.వి.ప్రసాద్-- హన్మకొండ .

 కోయిలకూస్తుందేమోనని 
కమ్మని రాగం 
వినిపిస్తుందేమోనని 
ఎదురుచూస్తూనే ఉన్నాను !
కుహుకుహు రావాల 
శ్రావ్య సంగీతం తో 
వేప చిగుళ్ళు తింటూ 
ఆహ్లాదంకలిగించే 
కోయిల రాకకోసం 
కిటికీ పక్కన ....
కనిపెట్టుకుని కూర్చున్నా !
సంవత్సరానికొక మారు 
కొత్తసంవత్సరం పేరుతో 
సందడిచేసే 
తెలుగింటి ఉగాది కోసం 
కుతూహలంగా ఉన్నా ..!
పంతులుగారు వినిపించే 
పంచాంగ శ్రవణం విని 
షడ్రుచుల మేలుకలయిక 
ఉగాదిపచ్చడి సేవించి ...
భవిష్యత్తును 
అంచనా వేసుకొవడానికి 
ఉవ్విళ్లూరుతున్నా ...!
ఆశాజీవిగా బ్రతికేమనిషికి
మంచి-చెడు....
రెండూ సమానమే గానీ 
మనిషిమనసెప్పుడూ 
అంతా మంచికోసమే
గొంతెమ్మకోరికలు కోరుతుంది !
గతంలో ఎదుర్కొన్న 
నిరాశా వైరాగ్యాన్ని సైతం 
పక్కకునెట్టి 
కోర్కెలకొలిమిని రాజేస్తుంది 
గతాన్ని మరచిపోయి 
బంగారుభవితకోసం ,
ఆకాశానికి నిచ్చనలేస్తుంది !
అందుకే --
ఎలాంటి భేషజాలూ లేకుండా 
గతానికి ....
వీడుకోలు పలికేస్తున్నా !
కొత్తసంవత్సరానికి ...
అదే ..శుభకృతు -
నామసంవత్సరానికి 
స్వాగతం పలికేస్తున్నా ..!!
              ***
(అందరికీ ఉగాది శుభాకాంక్షలు )
              2022*
కామెంట్‌లు