ఆడజన్మ..మణిపూసల బాలగేయం ;-P. చైతన్య భారతి 7013264464
అమ్మ నన్ను పుట్టనివ్వు 
నాన్న నన్ను ఎదగనివ్వు 
ఆడపిల్ల ఆశలనూ 
సాధించీ చూపనివ్వు 

కట్నాలకు భయపడుతూ 
కామాంధులకు బెదురుతూ
అన్యాయం చేయొద్దు 
పురిటిలోనే చంపుతూ 

నవమాసాలు మోసి 
రక్తం ధారవోసి 
మాతృమూర్తి ప్రేమను 
పోవద్దు త్రుంచేసి 

బుడిబుడి అడుగులతో 
ఉన్నత చదువులతో 
లోకానికి చూపుతాను 
శక్తీ  యుక్తులతో 

సంస్కృతిని మరువొద్దు 
ఆంక్షలను పెట్టొద్దు 
సృష్టికి మూలం తానే 
అపురూపమే కద్దు 

లింగనిర్దారణలతో 
స్త్రీ జాతిని చులకనతో 
భవితనడ్డుకుంటున్నరు 
ప్రగతి కవరోధమెంతో 

మానవజన్మ విశిష్టము 
స్తీ జన్మే అపురూపము 
పవిత్ర భారతoలో 
ఘోరమైనా తప్పిదము

అమ్మ ఒడిల బజ్జుకొని 
నాన్నతోను  ఆడుకొని 
ఇల్లంత సందడితో 
నింపుతాను అల్లరిని 

అన్నయ్యకు తోడబుట్టి 
ప్రేమతోడ రాఖి కట్టి 
అనుబంధమై నిలుస్తా
మమతలనే మూటగట్టి 

సంక్రాంతీ ముగ్గులతో 
అవనియంత వెలుగులతో 
ఇంద్రధనసు  నేలదింపి 
గెంతుదను సంబరంతో.. (127-137)


కామెంట్‌లు