*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౮౨ - 82)*
 *మహాప్రళయకాలమందు కేవలము సద్బ్రహ్మయొక్క శక్తిని ప్రతిపాదించుట - నిర్గుణ నిరాకార బ్రహ్మచేత యీశ్వరమూర్తి ప్రాకట్యము - సదాశివుని ద్వారా స్వరూపభూతశక్తి ప్రాకట్యము - వీరి ద్వారా ఉత్తమక్షేత్రమైన కాశీ లేక ఆనందవనము ప్రాదుర్భావము - శివుని వామాంగము నుండి విష్ణువు ఆవిర్భావము - వర్ణన*
*శివ మహాదేవుడు, జగన్మాత ప్రకటితమయ్యారు, "శివలోకం", సృష్టి జరిగింది. ఆపైన...*
*ఈ "శివ లోకము" ఎంతో ఉత్కృష్ట మైనది. ఇది నిర్వాణ క్షేత్రము, మోక్ష ప్రదము అని సదాశివుని వాక్కు. ఈ శివ క్షేత్రమునకు "ఆనందవనము" గా కూడా ప్రసిద్ధి. శక్తి-శివుడు, ప్రియా-ప్రియతములకు మారు రూపములు. ఆది దంపతులు. వారు నిత్యులైన పరమానంద స్వరూపములు. ఒకరి యందు ఇంకొకరు అనురాగ బద్దులై, ఆనందవనమనే మనోహర క్షేత్రమైన కాశీలో విహరిస్తూ వుంటారు. శివ-శక్తుల స్థిర నివాసము కాశీ. ప్రళయము వచ్చినా కూడా శివా, శివులు ఈ పరమానంద స్వరూపమైన ఈ కాశీ క్షేత్రాన్ని విడువక, తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వుంటారు. ఈ కాశీ క్షేత్రము ఆనందాన్ని కలుగ జేస్తుంది. పినాకధారి ఈ క్షేత్రాన్ని "ఆనందవనము" అన్నారు.*
*ఇంత అత్యంత అద్భుతమైన, మనసులను ప్రభావితం చేయగలిగిన ఆనందవనములో సేద దీరుతున్న శివపార్వతులకు ఎవరినైనా రెండవ పురుషుని పుట్టించ వలెనని కోరిక కలిగింది. ఈ రెండవ పురుషునితో సృష్టి కార్యము చేయించి, వీరు ఇద్దరూ ఆనందవనములో ప్రశాంతముగా వుండాలి అనుకున్నారు. నిర్వాణమును శివపార్వతులు తమ అధీనములోనే వుంచుకున్నారు.*
*ఈ రెండవ పురుషుడు సృష్టి చేసి, సంహారము గూడా చేయగలడు. ఈతని మనసు సముద్రము వంటిది. ఆ మనసులో, సత్వగుణ రూపమైన రత్నము, తమోగుణ రూపమైన గ్రాహము అనబడే మొసలి, రజోగుణ రూపమైన ముత్యము వున్నాయి. ఈ ఆనందవనము అనే కాశీ పట్టణం ఎంత ప్రత్యేకం అంటే, ఇక్కడ సత్వ రజస్తమోగుణములు అన్నీ నాశనము అయి కేవలము పరమాత్ముని యందే మనం ఆకిర్షితులము అవుతాము. అటువంటి ఈ కాశీ పట్టణంలో మనం వుందాము.*
*ఈ విధంగా నిర్ణయించుకున సదాశివుడు తన వామాంగమునుండి పదవ అంగమును రెండవ పురుషుని సృష్టి కి వుపయోగిస్తారు. వెంటనే సర్వసుందరుడైన ఒక పురుషుడు ప్రత్యక్షం అయ్యాడు. ఈయన మూర్తీభవించిన సత్వగుణ రూపము. సముద్ర మంత గంభీరుడు. ఆతనే క్షమాగుణమునకు రూపము. ఈ రెండవ పురుషుడు సర్వగుణ శోభితుడు. ఈతని అంగములు ఎంతో సుందరముగా వుండి, పీతాంబరాలు కట్టుకుని వున్నాడు. ఇంద్రమణి కాంతితో సమానమైన శరీరకాంతి వున్నవాడు. ఈతడు ప్రచండ వీరుడు. అపరాజితుడు.*
*ఇలా అన్ని శుభలక్షణ శోభితుడు, అపరాజితుడు అయిన ఈ రెండవ పురుషుడు, సదాశివునుకు, అంబకు నమస్కారం చేసి - "సదాశివా! నమస్కారం. నన్ను ఏపేరుతో పిలిస్తారో తెలపండి. నా చేత చేయబడవలసిన పని కూడా తెలియ జేయండి." అని అనేక ప్రణామాలతో వేడుకుంటాడు.
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు