"చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు";-ఎం బిందుమాధవి
 కావేరి కూరగాయల మార్కెట్ కి వెళ్ళొచ్చేసరికి వినయ్ సోఫాలో హయిగా కాళ్ళు చాపుక్కూర్చుని టీవి లో వస్తున్న ఐపిఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
మధ్యలోతినటానికి పక్కనున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నించి సమోసాలు కూడా తెచ్చుకున్నాడు.
"వినయ్...రేపు పరీక్ష ఉందా" అన్నది...అతన్ని టీవిని మార్చి మార్చి చూస్తూ!
"ఆ:(....అవన్నీ ఆల్ రెడీ చదివిన టాపిక్సేనమ్మా! ఇంటర్ లో చదివినవే కొంత ఎడ్వాన్స్ గా ఉంటాయి. ఇప్పటికే బోలెడన్ని సార్లు రివిజన్ అయిపోయింది" అన్నాడు టీవీలోంచి మొహం తిప్పకుండా!
"నాన్నగారు క్యాంప్ కి వెళ్ళారు..హమ్మయ్యా అనుకుంటుంటే అమ్మదొక నస" అని గొణుక్కున్నాడు.
"ఈ టీవీల వాళ్ళకి గానీ, ప్రభుత్వానికి గానీ ఏ సామాజిక బాధ్యతా ఉండదేమో!"
"మా చిన్నప్పుడు సంవత్సరం మధ్యలో క్రికెట్ మ్యాచెస్ పెట్టే వారు కాదు. ఏ పరీక్షలు, ఎలక్షన్స్..ఇలా ఏ ముఖ్యమైన పనులు లేనప్పుడు మాత్రమే పెట్టే వారు."
"పైగా ఇప్పుడు లాగా టీవీలు లేవు కనక పనులు మానుకుని వాటి ముందు కూర్చునే వారు కాదు. నష్టపోయే వాళ్ళు కారు. కామెంటరీ మాత్రం విని తృప్తి పడే వాళ్ళు."
"ఇప్పుడు ఏటి పొడుగునా...కొత్తవో, పాతవో ఏవో ఒక మ్యాచెస్ వేస్తూనే ఉంటారు. పిల్లలకవి ఆకర్షణ!"
"ఓ పక్క పరీక్షల ప్రాముఖ్యతేమో పెరిగింది. ఎప్పుడూ ఏవో ఒక పోటీ పరీక్షలే! పిల్లలకి అవి జీవన్మరణ సమస్యకింద తయారయ్యాయి. అలాంటప్పుడు ఇంట్లో పెద్దలకీ పిల్లలకీ ఘర్షణే" అన్నది వంటింట్లోకెళ్ళి రాత్రి వంట ప్రయత్నం చేస్తూ!
@@@@
మ్యాచ్ పూర్తయ్యేవరకు చూసిన వినయ్ కి పడుకునే సరికి లేట్ అయింది. ఉదయం హడావుడిగా లేచి, టక టకా రెడీ అయి "అమ్మా నేను కాలేజి క్యాంటీన్ లో ఏదో ఒకటి తినేస్తాను. ఎగ్జాం కి లేట్ అవుతుంది" అని పరిగెత్తాడు.
"ఏంటో ఈ కాలపు పిల్లలు, పెద్ద వాళ్ళు ఏం చెప్పినా చాదస్తంగా కనిపిస్తుంది. ఇంజనీరింగ్ లో చేరటానికి ఇంటర్ రెండేళ్ళు నానా కష్టాలు పడతారు. ఒక సారి కాలేజిలో చేరారంటే ఇక పట్టొదిలేస్తారు. ఈ నాలుగేళ్ళు కూడా అదే పూనికతో చదివితే ఇంటర్ రెండేళ్ళు కష్టపడ్డందుకు ఫలితం దక్కుతుంది" అనుకుంది, మడతలు పెట్టిన బట్టలు అల్మరలో సర్దుతూ.
పరీక్ష రాస్తున్నడే కానీ వినయ్ మనసు అక్కడ లేదు. 'అబ్భా...కొహ్లి క్యాచ్ ఎలా వదిలేశాడో! దానితోనే ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. అంతవరకూ బాగా ఆడిన అందరి ఆట వేస్ట్ అయింది. ఛ ఛ ఇంతోటి మ్యాచ్ చూట్టానికి అమ్మతో మాట కూడా పడ్డాను' అనుకుంటూ అదే ఆలోచనతో టైం అయిపోయింది గమనించలేదు.
ఇంకా రెండు క్వెశ్చన్స్ కి సమాధానాలు రాయకుండానే పేపర్ ఇచ్చేశాడు.
మొహం వేళ్ళాడేసుకుని ఇంటికొచ్చిన కొడుకు, పరీక్ష బాగా రాసి ఉండడని ఊహించింది కావేరి.
ఆ అనుభవంతో మిగిలిన సబ్జక్ట్స్ ఒళ్ళు దగ్గరపెట్టుకుని చదివి పరీక్షలు బాగా రాశాడు.
రిజల్ట్స్ వచ్చిన రోజు ఒక సబ్జక్ట్ ఫెయిల్ అయ్యానని తెలుసుకున్న వినయ్ అమ్మా నాన్నకి చెప్పటానికి గిల్టీగా ఫీల్ అయ్యాడు.
సెమిస్టర్ సిస్టంలో ఎప్పుడు చూసినా ఏవో పరీక్షలే!
మొదటి పరీక్ష అనుభవంతో సీరియస్ గా చదువుకుంటున్న వినయ్ ని గమనించిన కావేరి కూడా రిజల్ట్స్ గురించి అడగలేదు.
ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకోని ఆనంద్ కి వినయ్ ఫస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్ గురించి తెలియదు.
సెకండ్ ఇయర్ నించి థర్డ్ ఇయర్ లోకి వెళ్ళాలంటే, ముందు రెండు సంవత్సరాల బ్యాక్ లాగ్స్ అన్నీ క్లియర్ చెయ్యాలి.
ఆ మాటే చెప్పి, మిగిలిన పోయిన సబ్జక్ట్ కి కూడా పరీక్ష ఫీజ్ కట్టాలని అమ్మకి చెప్పేసరికి, కావేరి ఆశ్చర్య పోయింది. "ఫస్ట్ ఇయర్ లో ఒక పేపర్ క్లియర్ అవ్వలేదని అప్పుడు చెప్పలేదేరా" అన్నది.
"అప్పుడు చెప్పటానికి సిగ్గేసిందమ్మా! మిగిలిన అన్ని సబ్జక్ట్స్ లో 90% మార్కులొచ్చి, ఒకటి మిగిలిపోయింది అని చెప్పటానికి గిల్టీగా అనిపించింది. నువ్వు చెబుతూనే ఉన్నా నేను నిర్లక్ష్యం చెయ్యటం వల్ల అలా జరిగిందని చెప్పటానికి ఇంకా మొహమాటం అనిపించింది" అన్నాడు ఎటో చూస్తూ!
"తప్పు అందరూ చేస్తారు. కానీ చేసిన తప్పు తెలుసుకున్న వాడు ప్రయోజకుడు".
"రామాయణంలో సీతా రాముల వనవాసంలో సీతా దేవి బంగారు లేడి కావాలని కోరి తేవటానికి రాముడిని పంపించింది. బంగారు లేడి ఉండదని, అదేదో రాక్షస మాయ అని రామ లక్ష్మణులు ఇద్దరూ చెప్పినా ఆవిడ వినిపించుకోదు. ఆవిడ పట్టుదల చూసి రాముడు ఎలాగైనా దాన్ని తేవాలని అడవిలోపలి భాగానికి వెళ్ళాడు. మారీచుడు రాముడి కంఠ ధ్వనితో అరిస్తే, ఆయనకి ఆపద కలిగిందని లక్ష్మణున్ని వెళ్ళమంటుంది. మా అన్నగారు అజేయుడు..అతనికే ఆపదా కలగదు అని లక్ష్మణుడు చెప్పినా అతనికి దురుద్దేశ్యాన్ని అంటకట్టి నిష్ఠూరంగా మాట్లాడి పంపిస్తుంది."
"పర్ణశాలలో రామలక్ష్మణులిద్దరూ లేని సమయం చూసి మారు వేషంలో వచ్చిన రావణాసురుడు సీతని అపహరించాడు. తరువాత ఎంత విలపించినా ఏం ప్రయోజనం? తన తప్పు తెలుసుకున్నా జరగవలసిన అనర్ధం జరిగిపోయింది".
"అంటే 'చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు అన్నమాట" అన్నది కావేరి.
"అంటే ఏంటమ్మా" అన్నాడు వినయ్ కుతూహలంగా!
"పూర్వ కాలంలో ఇప్పుడున్నట్టు వేడి గిన్నెలు పొయ్యి మీద నించి దింపటానికి పట్కారలు లాంటి సాధనాలు ఇండేవి కావు. కాయితాలు, ఆకులు, పెంకు ముక్కల సాయంతో వేడి వేడి గిన్నెలు దింపేవారు. అనాలోచితంగా అవేవీ ఉపయోగించకుండా వేడి గిన్నె పట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది. ఆ తరువాత ఆకులు పట్టుకున్నా కాలిన చెయ్యి మంట తగ్గదు..అనుభవించ వలసిందే అని అర్ధం" అన్నది కావేరి.


కామెంట్‌లు