జానపదవిజ్ఞాన పరిశోధకులకు, ప్రేమికులకు వందనం.
పల్లెల్లో బతికిన వారికి బొంగరాలాట చిరపరిచితమే. అలనాడు బొంగరం పట్టని మగ బిడ్డ ఉండడేమో. రవ్వంత సమయముంటే చాలు బొంగరాలో, గోలీలో చేత పట్టడమే. పిల్లల పెరుగుదలకు కావల్సిన శారీరిక అభ్యాసమంటూ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. కాలం మారింది. ఆనాటి ఆటలు కనుమరుగైనట్టే. అంటే తద్వారా అందే ఆరోగ్యం కూడా దూరమయినట్టే కదా. చిత్తూరు జిల్లా లోని మహంకాళి దేవి పుత్తూరులో ఆనాడు ఆడుతుండిన బొంగరాలాటల్ని పరామర్శించుకోవడం ఈనాటి మన ముచ్చట. కందాటి మునిరెడ్డి (సంవత్సరం ముందు మనకు దూరమయ్యారు) ఈ ఆటలో దిట్ట. ఆయన అందించిన సమాచారం (9.7.1990) దీనికి ఆధారం.
మూడు రకాలైన బొంగరాలాటల్ని ఈ ఊరిలో ఆడేవారు - బచ్చాట (బచ్చి ఆట), రెండు బచ్చీలాట, నిలువు గుమ్మలాట. ఇద్దరు అంతకు పైబడి ఎంత మందైనా ఆడవచ్చు సంఖ్యా నియమం లేదు. జట్లు లేవు. జట్టు నాయకుడు ఉండడు. ఎవడి పనితనం వాడిదే. ఆటలు ఆడేవారికి మాత్రమే కాదు చూసేవారిలో కూడా ఉత్సాహం, ఆవేశంతోపాటు ఆటగాళ్లని ప్రోత్సహించడం కూడా ఉంటుందన్న విషయం తెల్సిందే. మగపిల్లలు మాత్రమే ఆడేవారు. బొంగరం అంగట్లో దొరికినా సొంతంగా చేసుకోవడానికే ఉత్సాహం చూపే వారు. నేరేడు కొయ్యతో చేసిన బొంగరం గుయ్( మంటూ ఉంటే అదో చెప్పరాని ఆనందం. వేరే కొయ్యతో చేసిన వాటికి ఆ శబ్దం రాదు. బొంగరం బోర్లించిన పిరమిడ్ ఆకారంలో ఉంటూ కింద ఒక చీల దిగగొట్టి ఉంటుంది. ఈ చీలను (ముల్లు అని సాధారణంగా పిలుస్తారు) బట్టే బొంగరం తిరగడం ఉంటుంది. బొంగరానికి చుట్టే దారం మొదట లావుగా చివరికి సన్నగా ఉంటుంది. లావు గా ఉన్న వైపు ముడి, చివర సన్నగా ఉన్న దారాన్ని చీలికలు లేకుండా పేని ఉంటుంది. పేనిన దారాన్ని ముల్లు నుంచి కొద్దిగా బొంగరం మీద అడ్డంగా పెట్టి ముల్లు చివరి నుంచి చుట్టుకుంటూ ముడి దాకా వచ్చి ఆ ముడిని చిటికిన వేలు సందులో ఇరికించి, బొటనవేలు చూపుడు వేళ్లతో బొంగరం అదిమి పట్టుకుని, బొంగరానికి దారానికి సళ్లు (సందు లేకుండా) రాకుండా చూస్తూ చేతిని వెనక్కి లాగి బొంగరాన్ని నేలకి వేగంగా విసురుతారు. ఆ వేగానికి బొంగరం ముల్లు నేలను తాకి తిరుగుతుంది. దీన్నే గుమ్మ వేయడం అంటారు. కొయ్యను బట్టి, ముల్లును బట్టి, చుట్టిన దారాన్ని బట్టి, ఆటగాడు వేసే వేగాన్ని బట్టి, బొంగరం తిరిగే వేగం, తిరిగే సేపు, గుయ్( మనే శబ్దం ఉంటుంది. బొంగరాలన్నీ ఒకే సైజులో ఉండాలన్న నియమమేదీ లేదు. ఆటగాడి నైపుణ్యాన్ని బట్టి అతను చెక్కించుకున్న సైజుని బట్టి బొంగరం ఉంటుంది.
బచ్చాట (బచ్చి ఆట) కోసం ముందు వృత్తాకారంలో ఒక బచ్చి (గీత) గీసుకుంటారు. ఆ బచ్చిలోపల దాదాపు జానెడు పొడుగున్న పుల్లని పెడతారు. బొంగరాలతో అందరూ గుమ్మలేస్తూ ఆ పుల్లని బయటికి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తారు. గుమ్మ పుల్ల మీద పడినపుడే అది కదులుతుంది కనుక గుమ్మలు దాని మీదే వేస్తారు. కొంతమంది గుమ్మలతో కాకుండా తిరిగే బొంగరాన్ని అరచేతిలోకి తీసుకుని దాన్ని పుల్ల మీద వేస్తూ కూడా వెళ్లగొట్టే వాళ్లుంటారు అయితే తర్బీదు ఉంటేనే ఇది సాధ్యం. ఆ పుల్ల బయటికి పోయిన వెంటనే ప్రతి ఒక్కరూ ఫీటు ఎత్తుతారు. ఫీటు అంటే తిరుగుతున్న బొంగరాన్ని దారం సాయంతో పైకి లేపి చేతులతో పట్టుకోవడం.
అలా ఫీటు ఎత్తడంలో ఎవరు వెనకపడతాడో వాడు తన బొంగరాన్ని బచ్చిలో పుల్లకు బదులు పెట్టాల్సి ఉంటుంది. మళ్లీ అందరూ బొంగరాలతో గుమ్మలు వేస్తూ ఆ బొంగరాన్ని బైటకి వెళ్లగొట్టేంతవరకు ఆడుతారు. బొంగరం బైటకు రాగానే ఫీటు ఎత్తాలి. ఫీటు ఎత్తడంలో వెనకబడ్డవాడు తన బొంగరాన్ని బచ్చిలో పెడతాడు. అలాగే గుమ్మ వేసినపుడు ఆ బొంగరం బచ్చిలోనే గాని తిరుగుతూ ఉంటే దాన్ని ఎవరైనా బచ్చిలోనే చేతితో అదిమివేయవచ్చు. అలాంటపుడు బచ్చిలో రెండు బొంగరాలుంటాయి. ఎవరికిష్టమైన దాన్ని వారు గుమ్మలు వేస్తూ వెళ్లగొట్టవచ్చు. బచ్చిలో పుల్ల లేదా బొంగరం ఉంటే మాత్రం ఫీటు అవసరం ఉండదు. ఫీటు ఎత్తేటపుడు నైపుణ్యం ఉన్న ఆటగాడు దారాన్ని బొంగరానికి రెండు మూడు చుట్లు తిప్పి వంగి బొంగరాన్ని ముందుకు వేసినట్టు వేసి దారాన్ని వెనక్కి లాగి బొంగరం తిరిగేటట్టు చేసి ఫీటు ఎత్తుకుంటాడు. ఇక్కడ గుమ్మ వేసి ఫీటు ఎత్తే అంత సమయం అక్కరలేదు. అలా ఆట సాగుతూనే ఉంటుంది.
రెండు బచ్చీలాట లో రెండు మూడు అడుగుల దూరంలో రెండు బచ్చీలు గీసుకుంటారు. ఒక బచ్చిలో ముందు బచ్చీలాటలో చెప్పినట్టు పుల్ల వేసి ఆ పుల్లని బైటకి వెళ్లగొట్టడం, ఫీటు ఎత్తడం, కడాన ఫీటు ఎత్తిన వాడు తన బొంగరాన్ని బచ్చిలో పెట్టడం ఉంటుంది. ఇపుడు బచ్చిలో ఉన్న బొంగరాన్ని గుమ్మలు వేస్తూ దాన్ని మరో బచ్చి దాకా కొట్టుకుంటూపోతారు. రెండో బచ్చి దగ్గరికి పోయినాక అందరూ ఆ బొంగరాన్ని చేతితో పట్టుకుని మరో చేతిలో ఉన్న బొంగరం చీలతో గుద్దుతారు. అలా గుద్దేటపుడు బొంగరం చీల ఆ బొంగరానికి దిగబడి అతుక్కుని ఉంటే అపుడు రాయితో దాన్ని కొడతారు, అలాంటపుడు ఆ బొంగరం చీలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలా కాకుండా కేవలం గాతాలు (దొంకలు) మాత్రం పడితే ఆ బొంగరాన్ని బచ్చిలో పెట్టి ముందు పుల్ల పెట్టిన బచ్చి దాకా తిరిగి కొట్టుకుంటూ వస్తారు. బచ్చి దగ్గరకు వచ్చినాక ఒక్కొక్కరు రెండేసి సార్లు ఆ బొంగరాన్ని తమ బొంగరాలతో గుద్దుతారు. తర్వాత బచ్చిలో పెట్టి ఆట కొనసాగిస్తారు. ఒకవేళ బొంగరానికి ఒక బచ్చి నుంచి మరో బచ్చికి వెళ్లగొట్టేటపుడు వేసే వారి బొంగరాలు తగలకపోతే ఆట ముగిసినట్టే. తిరిగి బచ్చిలో పుల్ల పెట్టి ఆట ప్రారంభిస్తారు. ఇక్కడ ప్రధానంగా బచ్చిలో చిక్కుకున్న బొంగరాన్ని మిగతా వారు గుమ్మలేస్తూ, గుద్దుతూ చీలగొట్టడానికి ప్రయత్నించడం చూడవచ్చు. ఆ బొంగరం చీలిపోతే అది ఆ ఆటగాడికి వేసిన శిక్ష గా మిగిలిపోతుంది. అతను మరో బొంగరం వెతుక్కోవాలి.
నిలువు గుమ్మలాటలో బచ్చి ఉండదు. అందరూ ఒకే సారి గుమ్మలు వేసి ఫీట్లు ఎత్తుతారు. చివరన ఫీటు ఎత్తినవాడు ముందు బొంగరంతో గుమ్మ వేస్తే ఆ తిరిగే బొంగరం మీద మిగతా అందరూ ఒకరి తర్వాత ఒకరు గుమ్మ వేస్తారు. గుమ్మ తగిలితే రెండు బొంగరాలు తిరగకుండా కిందపడిపోతాయి. అపుడు ఆ ఇద్దరు ఆటగాళ్లు అదలాబదలా తమ బొంగరాలని తీసుకుని ఫీటు ఎత్తుకోవాలి. ఎవరు వెనక ఎత్తుతాడో వాడు తిరిగి తన బొంగరంతో గుమ్మ వేస్తే దాని మీద మిగతావారు తమ బొంగరాలతో గుమ్మలు వేస్తూ, అలా ఆట సాగుతూనే ఉంటుంది. ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఆటగాళ్లుంటే అందరూ గుమ్మ వేసేదాకా బచ్చిలోని బొంగరం తిరుగుతూ ఉండడానికి అవకాశం ఉండదు. అలాంటపుడు బచ్చిలో ఉన్న దాని మీద అది తిరగకపోయినా గుమ్మలేస్తూ ఆటని కొనసాగిస్తారు.
బొంగరాలాటలో జట్లు ఉండవు. ఎవడి పనితనం వాడిదే. నేరేడు కొయ్యతో చేసిన బొంగరం, గుమ్మ నిలవేస్తే చాలా గొప్పగా గుయ్( పెట్టుతుంది. అయితే గాతాలు దిగుతాయి కాని ఒక పట్టానా చీలదు. ముష్టి కొయ్యతో చేసిన బొంగరం గుయ్( పెట్టదు కాని గాతాలు ఒక పట్టానా దిగవు. అందుకే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అంగడిలో దొరికే బొంగరాలకన్నా తామే తయారు చేసుకున్న బొంగరాలనే వాడతారు.
ఎవరు ఫీటు ఎత్తడంలో వెనకబడతాడో వాడికి శిక్ష. తన బొంగరాన్ని బచ్చిలో పెట్టాలి. చివరికి బొంగరం చీలిపోతే దాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అదే శిక్ష. మగపిల్లల్లో మగతనం, నైపుణ్యం, సమయానికి తగ్గట్టు స్పందించడం లేకపోతే, అందరి కన్నా ఎక్కువో లేదా అందరితోపాటో పనితనం లేకపోతే అది తన జీవితానికి ఒక ప్రతిబంధకం అన్న సూచన కూడా ఈ ఆట ద్వారా పిల్లల్లో కల్గిస్తున్నారా అనిపిస్తుంది.
ప్రఖ్యాత అంతర్జాతీయ జానపదవిజ్ఞానవేత్త ఆలన్ డండెస్ దీన్ని మగసిరి మీద దెబ్బగొట్టడం -castration గా భావిస్తారు. బచ్చీల ఆకారం, గుమ్మలేయడం, బొంగరం చీల్చడం ఇవి అన్నీ ఏదో విధంగా మగసిరితో సంబంధం కల్గి ఉండడం దానికి కారణాలుగా భావిస్తారు. ఏది ఏమైనా నైపుణ్యం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, వేగంగా స్పందించే నేర్పు ఉండాలి లాంటి విషయాలని, శారీరిక శ్రమతోపాటు ఈ బొంగరాలాట నేర్పిస్తుంది, సూచిస్తుంది అని మాత్రం చెప్పకతప్పదు.
జానపదవిజ్ఞాన పరిశోధకులు, ప్రేమికులు మరిన్ని విషయాలతో స్పందించగలరని ఆశిస్తూ,
***
నాగపట్ల భక్తవత్సల రెడ్డి .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి