పుడమి ఎదన
పచ్చదనం పరిచినట్టు
రంగురంగుల పుష్పాలు
వికసిత ప్రదర్శనలు చేస్తూ
పరిమళ సుగంధాలు వెదజల్లుతున్న తరుణం లో
ప్రకృతి కన్య సరికొత్త
సొగసులతో ముస్తాబైన వేళ
కోయిలమ్మ
సుస్వర మధుర
గానాలతో
మనసు పరవశించి
పులకరించిన వేళ
హరివిల్లును వంచిన హేళ
వసంతఋతువు
ఆగమనానికి సంకేతమై
వికాసాలన్ని ఏకమై
ఆవిష్కరిస్తున్న
శుభవేళ
పాల్గుణ మాస పౌర్ణమి రోజు
కొత్త రంగుల కళ
తొలి వేడుక హోలీ
అగ్నితో పునీతమైన జీవితాలు
పురాణ ఇతిహాస ఘట్టాలు
హోలిక దహనాలు
చెడుపై మంచికి విజయాలు
మానవాళి జీవిత పరమార్ధాలు
తెలుగు సంస్కృతికి ప్రతిబింబాలు
ధవళ వస్త్రాలు ధరించి
వాటర్ గన్స్ తో ఉపక్రమించి
రంగులు చల్లే వేడుక కాదు
ప్రేమ ఆప్యాయతల కానుక
డోలికోత్సవ వేడుకలలో
అనురాగపు పొంగులు
ఊరు వాడ ఉత్సవాలు
చిన్న పెద్ద కేరింతలు
సందడి చేసే ఉత్తేజాలు
ప్రేరణ అందించే నేస్తాలు
సామరస్యాన్ని కాంక్షించి
సోదరభావాన్ని విశ్వసించి
సమైక్యత కుసుమాలు పూయించి
విశ్వ జగతికి పంచి
దరిత్రికి సప్త వర్ణోత్సవ సందేశం
అందించే కేళి
ఐక్యమత్యాన్ని కి చిహ్నమైన
జీవితాన రంగుల మేళవింపు
మమతల గుబాళింపు
ఆనందపు లోగిలిలో
అనురాగపు రంగుల హంగులద్ది
పన్నీటి వర్ణాలతో తడిసి
ముద్దైన వేళ
వసంతోత్సవ వేడుక
సహజ రంగుల సమ్మిళితం
మానవాళికి సురక్షితం
ఏడు రంగుల సంకేతమై
సమరసత దర్పణ మై
సిరులు కురిపించే ముంగిలిలో
జీవితాన తెచ్చే
రంగుల పువ్వులతో రమణీయ ఉత్సవం
ప్రేమ సౌభాగ్యాల తరుణం
ఆనందోలికల్లో తేలియాడే ఉల్లాసం
రంగు రంగుల హోలీ
సంతోష నృత్యాల కేళి
రంగుల హోలీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి