విద్య అంటే? అచ్యుతుని రాజ్యశ్రీ

 కేవలం చదువు  డిగ్రీ మాత్రమే విద్యకాదు.లలితకళలు ఉపాధి చూపే వృత్తి విద్యలు కూడా సంపాదన తోపాటు పేరు తెస్తాయి.ఎంతోమంది సంగీత కళాకారులు వృత్తులలో ఆరితేరిన వారు  పర్యావరణ రక్షకులు కూడా మనకు విద్యనుబోధించే గురువులుగానే మనం భావించాలి సుమా! కుటుంబ పోషణకై కులవృత్తికూడా ఓమార్గం.డబ్బుందికదా అని పిల్లలని సోంబేర్లుగా పెంచితే వారు  దేనికీ కొరగాకుండా పోతారు.
 సుబ్బయ్య మంచి వ్యాపారవేత్త. కొడుకు రాము మాత్రం  వ్యాపారంలో  సులువులు నేర్చుకోకుండా ఆటపాటలు  చదువుముఖ్యం అనేవాడు.ఉన్న ఒక్క కొడుకు తనవ్యాపారంలో సాయంచేయకపోతే ఎలా అనే బాధ పీడిస్తోంది తండ్రిని. లోకంపోకడ తెలియాలనే ఉద్దేశం తో రాముకి వంద వెండి నాణాలు చేతిలో పెట్టి "నాయనా!దీన్ని పెట్టుబడిగా పెట్టి  నీచిత్తం వచ్చిన వ్యాపారం చెయ్యి "అన్నాడు. సరే అని బైలుదేరిన రాము టెన్త్ పాసైనాడు.కాలేజీ లేదు  వేరే పట్టణంలో  ఒక్కడినీ ఉంచటం ఇష్టం లేక కడుపులో చల్లకదలకుండా కొడుకు తన ఎదురుగా ఉండాలి అని సుబ్బయ్య మనసులోని మాట! చుట్టుపక్కల గ్రామాలు చూస్తూ ఒక చోట గురుకుల విద్యాలయం పిల్లలు అంతాహాయిగా చెట్ల కింద కూచుని పాఠాలు వినటం ఆపై కంచాలు గ్లాసులతో  వరుసగా కూచోటం చూశాడు. కొందరు పిల్లలు వడ్డిస్తున్నారు.ఇద్దరు ముగ్గురు అధ్యాపకులు  పర్యవేక్షిస్తున్నారు.రాము కి ఆవాతావరణం నచ్చింది. అక్కడి మాష్టార్ని బతిమాలాడు"సార్!ఒక పదిరోజులు ఇక్కడే ఉంటాను.నాకు ఇష్టమైనవి నేర్చుకుంటాను"అన్నాడు. స్నేహితులు అంతా కలిసి నడుపే ప్రైవేటు బడికాబట్టి  వంద వెండి నాణాలు తీసుకుని  చేర్చుకున్నారు .రాము తనకిష్టమైన ఆటపాటలు  చిత్ర లేఖనం నేర్చుకుని విద్యార్ధులకి పెట్టిన  పోటీల్లో  బహుమతులు గెల్చి ఆపై తన ఊరుబైలుదేరాడు.మాష్టార్లు పిల్లలు  ఆప్యాయంగా వీడ్కోలు ఇచ్చారు. సుబ్బయ్య ఆనందంగా కొడుకు ని పలకరించాడు."నాన్నా!నీవిచ్చిన నాణాలు సద్వినియోగం చేసి ఆటపాటలు  చిత్రలేఖనం లో బహుమతులు పొందాను.ఇన్నాళ్లు ఒంటికాయ సొంఠికొమ్ములాగా పెరిగాను.ఆపిల్లల సార్ల ప్రేమాభిమానాలు మరవలేను"అంటున్న కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసి  మనసులో బాధపడ్డాడు."నాన్న!ఇంకోచోటికెళ్లి కొత్త అనుభవాలు సంపాదిస్తా" అని తండ్రి ఇచ్చిన వంద వెండి నాణాలు తీసుకుని  నగరం చేరాడు.వింతలు విశేషాలు చూస్తూ  సగంనాణాలు ఖర్చు పెట్టేశాడు. ఇక చాయ్ టిఫిన్ సెంటర్ లోపనిలో చేరాడు.కడుపునిండా తిండి వసతి దొరికింది. మధ్యాహ్నం  విశ్రాంతి తీసుకోకుండా కూరగాయల మార్కెట్లో పనిచేస్తూ రోజుకి యాభై రూపాయలు సంపాదించే వాడు. వృద్ధులు పిల్లలని రోడ్డు దాటించేవాడు.గుడిలో భజనలు ఊరేగింపులో పాల్గొని హాయిగా గొంతెత్తి కమ్మగా పాడేవాడు.నెలతిరిగేసరికి రాము దగ్గర వెయ్యి రూపాయలు పోగైనాయి.అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లాడు."ఏంట్రా నాన్నా!అంత చిక్కిపోయావూ?"తల్లి బావురుమంది."నాన్నా!ఈసారి  ఖాళీ చేతులతో తిరిగిరాలేదు.కష్టపడి డబ్బు సంపాదించటం నేర్చుకున్నాను.ఇది నాకు లక్షలతో సమానం! వ్యాపారం లో మోసం అవకతవకలు  నేను చేయలేను. నాకువచ్చిన విద్యలు ఇతరులకు నేర్పుతూ  నిన్ను అమ్మను చూసుకుంటూ  తృప్తి గా బతకటమే నాలక్ష్యం"అంటున్న కొడుకు వైపు  ఏంచెప్పాలో తెలీక అలా చూస్తూ ఉండిపోయాడు సుబ్బయ్య 🌹
కామెంట్‌లు