తెలుగుతో...నేను ;-రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
 తెలుగు ...ఇదొక భాష
...అని. తెలుసు మనందరికీ . ఇది మన భాష.  ఈ భాష మనుషుల మధ్య ఎంతటి. అవసరాన్ని, ప్రాముఖ్యతను  సంతరించుకుందో చూస్తూనే ఉన్నాం. అనేక కారణాలతో సమాజగత మార్పులతో మనదైన తెలుగు భాష నిర్లక్ష్యం చేయబడుతోంది. అందరం గమనిస్తూనే ఉన్నాం. ఏది మాట్లాడాలన్నా భాష అవసరం . భాష గురించి ..language is key to the heart of
People ..అని,
language is a skin,  to rub my language
against the other. It is as ir I had words instead of fingers , or fingers at the tip of my words.My
language trembles with desire...అంటూ ఎందరెందరో భాషా అవసరాన్ని తెలిపారు.
 భాషంటే అంటూ  మన తెలుగువారు కూడా...
" జాతికి భాష జీవము
యశస్కరులై సుకవీంద్రులెఉదరో
ఖ్యాతి గడించినారు మన యాంధ్రికి తెలుగును తీర్చి దిద్ది యెం
తో తమి వారు నీకిడిన త్రోవ జరించి కవిత్రయ   మ్ము. సం
ప్రీతి స్మరించుచున్
సైతము వీడకుమీ  మన ఆంధ్ర సంస్కృతిన్
( ఆత్మకూరు గోవిందా చార్య.  ఆంధ్రమాత)...అని వివరించారు.మన వాళ్ళు చెప్పటమే కాదు..  తెలుగు తేట ఐనదని, అమృతతుల్యమని ... ఆంధ్ర దేశాన్ని పాలించిన శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, బృహత్పలాయనులు,  విష్ణుకుండినులు,చోళులు కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సార్వభౌములు మున్నగు ఎందరెందరో రాజులకు రాజభాషగా, శాసన భాషగా, కవుల కావ్యభాషగా వెలుగొందిన తెలుగు గొప్పతనాన్ని  ఎన్నెన్నో పొగడ్తలతో పాశ్యాత్యులు మెచ్చినదే. వారిచే నిఘంటువులు, వ్యాకరణాలు వ్రాయించుకున్నదే. మరి అలాంటి భాష పరిస్థితి ఎలా ఉంది నేడు....
 రాయగలిగిన వాళ్ళు కావ్యాలు రాస్తున్నారు. నవలలు, కథలు, కవితలు - ఇలా ఎన్నెన్నో సాహితీ ప్రక్రియలలోకి తెలుగు ... ఒదిగిపోయింది. ఐతే ఆ శ్రద్ధ సరిపోతుందా!కవితలు రాసినంత తేలికగా ఎంత మంది భాష నిలవటం ..
.నిలపటం గురించి వ్యాసాలు రాస్తున్నారు? ఆలోచించాలి. జుట్టున్న అమ్మే కదా ఏ కొప్పైనా పెట్టేది... ఇది పాత సామెతే ఐనా ఎంతో విలువైన సామెత. కనుక సాహిత్య రూపం ఏదైనా భాష దానికి మూలం.ఆ భాషకి చెందిన కొన్ని పదాలైనా తెలిసుండాలి. ఎందుకంటే ఏది రాసినా ఎప్పటికప్పుడు రాసింది కొత్తగా ఉండాలంటే భాషా పద జ్ఞానం చాలా అవసరం  కదా.
  మా అమ్మగారు మొదట నేర్పిన తెలుగు మాట ఏ మంచి వేళ నాకు నేర్పారో... నేనీ స్థాయిలో ఉన్నాను. 32 ఏళ్ల సుదీర్ఘ కాలం నేను తెలుగు ఉపాధ్యాయినిగా పని చేశాను. అది కూడా ఆంగ్ల మాద్యమంలో. ఆంగ్ల మాద్యమంలో  తెలుగును బోధించడం కష్టం అంటారు చాలా మంది. మరి ఆ కష్టం నాకు తెలియలా. అందుకు కారణం తెలుగు భాష పట్ల నాకున్న ప్రేమ కావచ్చు.
 ఏళ్లుగా తెలుగు భాష పట్ల జరుగుతున్న వివక్ష ..నిర్లక్ష్యపు తీరు తెన్ను గమనిస్తు వచ్చా. ఆ భాష గురించి తరగతుల్లో ఎలా నేర్పించాలి అన్న ప్రయత్నం రకరకాలుగా చేశాను. ఆలోచిస్తే అది తరగతి గదులకే పరిమితమైంది. పిల్లలతో పాటు వచ్చే తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు తమ భావాన్ని వ్యక్తపరచటానికి తగిన భాష ఉండేది కాదు చాలామందికి .ఇంటి వద్ద పిల్లలకు తెలుగు నేర్పటానికి వారు చాలా అవస్థలు పడేవారు. ట్యూషన్‌ చెప్తారా మేడం మా అబ్బాయి/అమ్మాయికి తెలుగు సరిగ్గా రావటం లేదు అనేవారు. మన మాతృ భాష తెలుగు. మీరు తెలుగువారు. పైగా తల్లిదండ్రులు .పక్కన కూర్చుని నేర్పటం వలన పిల్లల మానసిక స్థితిగతులే కాదు శక్తి సామర్థ్యాలు మీకు తెలుస్తాయి. మీకు పిల్లలకు మధ్య బంధం అర్థవంతంగా ఉంటుంది. కనుక మీరే మీ పిల్లలకి తెలుగు నేర్పండి - అంటూ ట్యూషన్‌ ప్రస్తావనను ఆపేసేదాన్ని. ఎందుకంటే అమ్మ నేర్పే తెలుగు పదం జరామరం.
 ఇలాంటి సంఘటనలనెన్నో చూశాక నా పరిశ్రమ బడితో సరిపోదు సమాజంలోకి వెళ్లాలి అనిపించింది. అందుకే 2007వ సంవత్సరం నుంచి సమాజానికి భాషను, భాషతో పాటు సాహిత్యాన్ని, ఇతర జ్ఞానాన్ని అందించాలని, ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా’ - అన్న శ్రీశ్రీగారి మాటల్ని గుర్తు తెచ్చుకుని నా పరిశోధన పరిశ్రమ మొదలుపెట్టాను.
 పిల్లలతో మొదలు పెట్టాలని ముందుగా ‘పదంలో పదం’ అనే శీర్షికతో 2007లో తెలుగు పద పరిచయం పని ప్రారంభించా. ఆహారం అన్నపదం ఉందనుకోండి దాని నుండి హారం విడగొడితే - ఒక పదం నుంచి మరో పదం ఇది పిల్లలకో ఆటగా ఉంటుందనుకున్నా. ఆ పదాలను బొమ్మలతో పరిచయం చేశాను. బొమ్మలతో పిల్లల కోసం చాలామంది నిఘంటువుల్ని తయారు చేశారు. కాని నాదో విధం. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విశాలాంధ్ర దినపత్రిక వారికి నాలుగైదు పదాలను ఉదహరిస్తూ నా పని గురించి తెలిపి దానిని ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తారా అని ఉత్తరం రాశాను. అప్పుడు ఇప్పుడు ముత్యాల ప్రసాద్‌ గారు ఎడిటర్‌గా ఉన్నారు. ‘‘ఈ పద్దతి నచ్చిందమ్మా వేద్దాం వరుసగా పంపండి’’ అన్నారు ఆయన. ఆ మాట విన్న నాకెంత సంతోషమో.... అపుడే నేను పిల్లల కోసం గేయ కథలు, గేయాలు 4 పుస్తకాలను ముద్రించాను. వాటిలో చాలావరకు నేను తరగతి పిల్లల కోసం రాసినవే. నిజానికి నేను ఇంటర్‌ చదివేటప్పటి నుంచి కవితలు మొదలైనవి రాసేదాన్ని. ఈ పుస్తకాల ముద్రణకు ముందు నా సహ ఉపాధ్యాయులు, మిత్రులు డా.ఏ.కె ప్రభాకర్‌ - మల్లీశ్వరి గారు మీ కవితలు ఎప్పుడైనా ముద్రించుకోవచ్చు పిల్లల కోసం రాసినవి ఏమైనా ఉంటే అవి ముద్రించండి - అన్నారు. దాంతో తేనె చినుకులు, తేనె వాకలు 1-2 భాగాలు, రెల్లుపూలు మొత్తం నాలుగు పుస్తకాలు (బాల సాహిత్యం) తయారైంది. కళాజ్యోతి అధినేత శ్రీ ఆలపాటి బాపన్న చౌదరిగారి అండతో ఆ ముద్రణ జరిగింది. ఆ నాలుగు పుస్తకాలను ఒకేసారి ఆవిష్కరించాను.
 ఐతే ‘‘పదంలో పదం’’ ఏడాదిన్నర కాలం బాగా నడిచింది. ఆ పదంలో పదం ప్రక్రియ పెద్దలను బాగా ఆకర్షించింది. నాకు బొమ్మల గురించిన సమస్య మొదలవ్వడంతో అక్కడితో అది ఆపేశాను.
 తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండదంటారు కదా. అలాగే వరుసగా రాయటానికి అలవాటు పడ్డ నాకు ఖాళీగా ఉండాలనిపించలేదు. విశాలాంధ్ర పత్రికవారు నాకిచ్చిన అవకాశాల్ని పోగొట్టుకోదలచలేదు. అందుకని అప్పుడు ‘‘ఒక్క పదం - అర్థాలెన్నో’’ - అనే శీర్షికతో 2008 నుంచి 2014 రాష్ట్రం విడపోయే వరకూ వరుసనే 500 వ్యాసాలు రాశాను.
 ఈ ప్రక్రియ ప్రారంభించిన కొత్తలో ప్రసిద్ధ జర్నలిస్ట్‌, సంపాదకులు ఏ.బి.కె ప్రసాద్‌ గారు, వారితో పాటు మరికొందరు నన్ను చాలా అభినందించారు. మంచిపని చేస్తున్నావంటూ ఈ వ్యాసాలలో భాషా పదాలతో పాటు సాహితీ భాగాలైన సామెతలు, పద్యాలు భాషా పరిచయానికి ఉపయోగించాను. దానితో పాటు పత్రిక వారు ఆయా పదాలకు బొమ్మలను ఇచ్చారు. ఆ 500 వ్యాసాల నుండి దాదాపు 180 వ్యాసాలను నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌ వారు పుస్తకంగా తెచ్చారు. మిగిలినవాటిని - ఒక్క పదం - అర్థాలెన్నో -2 వ భాగం తీసుకు రావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 ఇదిలా ఉంచితే - 2007లోనే పిల్లల కోసం టంగ్‌ ట్విస్టర్స్‌ లాంటివి వ్రాసి వాటితో వార్త దిన పత్రికను పలుకరించాను. అపుడు ఎడిటర్‌గా ఉన్న శ్రీరామచంద్రమూర్తి గారు అంగీకరించి ప్రచురణకు తీసుకున్నారు. అవన్నీ 2 పంక్తులు, నాలుగు పంక్తులతో ఉన్నవి. ముఖ్యమంగా పిల్లలకు పరిసర జ్ఞానంతో పాటు తెలుగు భాషా పద పరిచయానికి ఉద్దేశింపబడినవి. ఒక 3 నెలలు గడిచేటప్పటికి ఇలా కాదు ఇంకా ఏదో చేయాలనే తపన మొదలైంది.
 అప్పుడు భాష, సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం, పరిసర జ్ఞానం మొదలైన అంశాలతో  వ్యాసాలు రాశాను. అవి కూడా సామెతలు, పొడుపు కథలు, పద్యాలు మొదలైన అనేకాంశాలతో కూడిన వ్యాసాలు. దాదాపు 350 వ్యాసాలు రాశాను. అవి కూడా 2015 వరకూ వరుసనే వచ్చాయి. వాటి నుంచి కొన్నిటిని తీసి 2013లో ‘‘పదాల పరిమళాలు’’ పేరుతో పుస్తక ముద్రణ జరిగింది. ఇది పిల్లల కోసం అంటే శ్రీ డా.సి నారాయణరెడ్డి గారు ఆ పుస్తకానికి ముందు మాట రాస్తూ - ఇది పిల్లలకే కాదు అందరికీ పనికొస్తుందని - అని రాశారు.
  ఆ పుస్తకాన్ని చూచిన వెలగా వెంకటప్పయ్య గారు (బాల సాహితీవేత్త, సాహితీ పరిషత్‌ వ్యవస్థాపకులు)  - పిల్లల కోసం కథ, గేయం, నవల తప్ప ఇలాంటి మరో  ప్రక్రియ రాలేదు ఈ పుస్తకాన్ని ఇలాంటి ప్రక్రియగా తెచ్చి చాలా మంచి పని చేశావు ..అని ప్రశంసించారు.
 తెలుగు భాష కోసం ఇంకా ఇంకా ఏదో చేయాలనే తపన ఆగ లేదు. కొత్త తరహాగా భాషా పదాలను (ఒకప్పుడు మనం వాడి ప్రస్తుతం వాడుక తగ్గిన , వాడుకలో లేని పదాలు) పరిచయం చేయాలని ఆలోచించాను. ఎలా రాయాలి. ఎలా రాస్తే ఎక్కువ పదాలను పరిచయం చేయగలను. ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా ఎలా రాయాలి - అని అనుకుంటూనే నా ప్రమేయం ఎక్కువ లేకుండానే ఓ ఊహ మదిలో మెదిలింది. ఔను ఇలా ఇప్పటివరకూ ఎవరు రాయలేదు అని అనుకుని ప్రారంభించా. ఈ వ్యాసాలు కూడా వార్త దిన పత్రికలో రెండేళ్ళు విద్య శీర్షికలో వచ్చాయి. ఇవన్నీ నా పరిశోధనాత్మక వ్యాసాలే. చాలా పరిశ్రమ చేశాను.  ఆ వ్యాస  సంపుటే .
..నుడి గుడి...
        
      108 వ్యాసాలతో
దాదాపు 2600 పైగా
పదాలను ఈ నుడిగుడి" లో పరిచయం చేశాను. ఈ
పరిశోధనాత్మక గ్రంథానికి. డా ఏ కె ప్రభాకర్ గారు " "భాషాంతరంగంలోకి  "
అంటూ " పది చేతులు కలిస్తే గాని చేయలేని పనిని మల్లీశ్వరి వొంటి చేత్తో రాశారు..అంటూ నా మనసు చదివినట్టే  నా నుడి గుడికి అద్భుతమైన  ముందు మాట రాశారు.
అలాగే. ప్రసిద్ధ కవి, విమర్శకులు శ్రీ బిక్కి కృష్ణ ఈ ..నుడి గుడి .. గ్రంథాన్ని  " తెలుగు పద
సౌరభం ఈ నుడి గుడి పరిశోధనాత్మక గ్రంథు" 
అభివర్ణించారు. ప్రముఖ సంపాదకులు, బహుగ్రంథకర్త శ్రీ తుర్లపాటి  కుటుంబరావు గారు 
" ఇలాంటి పుస్తకాన్ని ఇంతవరకు చూడలేదు.
అన్నారు .అలా ఇంకా డా.యన్ గోపి, నాళేశ్వరం శంకర్  మొఛలైన
ఎందరెందరో ప్రశంసించారు.  2019 లో కొలకలూరి విశ్రాంతమ్మ పరిశోధనాత్మక అవార్డుతో పాటు మరో రెండు అవార్డులు వచ్చాయి.  
    ఎందరికో  తెలుగు పద పరిచయం చేయటానికై ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా వాట్స ప్ 
వేదికగా 26  నెలల పాటు  _ పద సంపద" 
పేరుతో వేల తెలుగు పదాలను అందించాను. 
అవి మాకెంతో ఉపయుక్తమైనాయని ఎందరో అన్నపుడు నాకెంతో సంతోషం.  సంతృప్తి కలిగింది. నా శ్రమ వృథా కాలేదని ఎందరికో ఉపయోగపడిందని.
ఇదంతా నా గొప్పని ప్రదర్శించటం కోసం  రాయటం లేదు. మన భాష కోసం  మనమే   శ్రద్ధ తీసుకోవాలని చెప్పటం కోసం మాత్రమేనని  గుర్తించాలి.
ఎందరో కవులు, రచయితలు..వారు రాసే ప్రక్రియ ఏదైనా  భాషను నేర్పగలిగే రాతలు కొన్నైనా రాస్తే
బాగుంటుందని ...నేను భాషా వ్యాసాలతో పాటు అనేక సాహితీ ప్రక్రియలలో రచనలు చేశాను..చేస్తున్నాను .
       భావమున్నా ....
భాష లేనిది భావనలను ఎలా పూల పొట్లం లా
విప్పగలం....అదే. చెప్పగలం. మన ఆస్తులను కాపాడుకుంటాం కదా
అలాగే తరాలను వెలిగించిన..తరాలను వెలిగించనున్న  మన
తెలుగు భాషను కాపాడుకుందాం.
ఏమంటారు. ...? దీనిని చదివే వారందరికి ధన్యవాదం.
ఎందుకంటే.....
మన భాష తెలుగు
తెలుసుకుంటే వెలుగు.
 తెలుసుకుందామా....మరి .

కామెంట్‌లు